లండన్ : స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఆగస్ట్ 15న లండన్‌లో భారత రాయబార కార్యాలయం ఎదుట పాక్ మద్దతుదారుల నిరసనల అనంతరం మరోసారి అదే ప్రాంతంలో పాక్ మద్దతుదారులు పేట్రేగిపోయారు. హై కమిషన్ భవనంపై పాక్ మద్దతుదారులు కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. హింసాత్మక నిరసనలతో భారత రాయబార కార్యాలయ భవనం పాక్షికంగా దెబ్బతిందని బ్రిటన్‌లో భారత హైకమిషన్ పేర్కొంది. లండన్‌లో భారత హైకమిషన్ వెలుపల మంగళవారం మరోసారి హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయని, నిరసనలతో హైకమిషన్ ప్రాంగణం దెబ్బతిందని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది.
పాక్ మద్దతుదారుల హింసాత్మక నిరసనలను లండన్ మేయర్ సాధిక్ ఖాన్ ఖండించారు. ఇలాంటి దుశ్చర్యలు ఆమోదయోగ్యం కాదని, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఆగస్ట్ 15న బ్రిటన్‌లో భారత రాయబార కార్యాలయం వద్ద జరిగిన నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్‌తో స్వయంగా మాట్లాడి అనంతరం తాజా ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో బ్రిటన్‌లో పాక్ మద్దతుదారులు హింసాత్మక నిరసనల బాటపట్టారు. మరోవైపు ఆర్టికల్ 370కి సంబంధించి భారత నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని అమెరికా, బ్రిటన్,రష్యా సహా ప్రధాన దేశాలన్నీ సమర్ధించాయి.
Comments
Please login to add a commentAdd a comment