దుస్తులు విప్పేస్తూ లండన్ వీధిలో..
లండన్: ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మంది తమ శరీరాకృతిని ఇష్టపడరని 2012 సెంటర్ ఫర్ అప్పీయరెన్స్ సర్వేలో వెల్లడైన విషయం.
అయితే ఆ సమస్య నుంచి బయట పడ్డ ఒక అమ్మాయి ..తమ శరీరం ఆకృతి గురించి బాధపడుతున్న వారికోసం వినూత్నంగా ఆలోచించింది. 'ఈటింగ్ డిజార్డర్'(ఎప్పుడూ ఏదో తినాలనిపిస్తుండటం లేక అసలేమీ తినలేక పోవడం) నుంచి బయటపడ్డ జే వెస్ట్ అనే యువతి రద్దీగా ఉండే లండన్ పికాడిలి సర్కస్ కూడలిలో కళ్లకు గంతలు కట్టుకొని పై దుస్తులను తీసేసి నిలబడింది. తన పక్కకి ఒక ఫ్లకార్డును కూడా పెట్టింది.
'ఎవరైతే ఈటింగ్ డిజార్డర్, ఆత్మగౌరవ సమస్యలతో బాధపడుతున్నారో వారికోసమో ఇలా నిలుచున్నాను...ఎవరైనా నాలాంటి వారందరికి అండగా ఉండాలనుకుంటే 'లవ్ సింబల్'తో నా శరీరంపైన రాయండి అని' ఆ ఫ్లకార్డుపై రాసి ఉంచింది. అంతేకాకుండా ఆమె అలా లో దుస్తులతో నిలబడి ఉన్నప్పుడు ...అండగా ఉంటామని వచ్చిన వారు ఆమె శరీరం పై రాస్తున్నపుడు తీసిన వీడియోని ఆన్లైన్లో పెట్టింది. ఆ వీడియోని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తిలకించి జే వెస్ట్ కి, ఆ సమస్యతో బాధపడుతున్న వారికి అండగా ఉంటామంటూ లైక్లు కొడుతున్నారు.