పియానో ప్లే చేస్తున్న బ్రైస్ డుడల్
ఎవరిలో ఏం టాలెంట్ ఉంటుందో చెప్పలేం. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దని పెద్దలు సూచిస్తుంటారు. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన ఓ డెలివరీ బాయ్ అనూహ్య రీతిలో తన టాలెంట్‌ను ప్రపంచానికి చాటిచెప్పి శెభాష్ అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మిచిగాన్ : అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం డెట్రాయిట్ నగరానికి చెందిన వర్చెట్టి కుటుంబం కొన్నిరోజుల కిందట పిజ్జాలు ఆర్డర్ ఇచ్చింది. బ్రైస్ డుడల్ అనే 18 ఏళ్ల విద్యార్థి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వర్చెట్టి ఇంటికి వెళ్లిన డుడల్ పిజ్జాను డెలివరీ చేశాడు. వారి ఇంట్లో పియానో చూసి ముచ్చటపడ్డ ఆ టీనేజర్ నేను ఒక్కసారి ప్లే చేయవచ్చా అని అడిగాడు. అందుకు జూలీ వర్చెట్టి ఆలోచిస్తూనే సరేనంది. వెంటనే పియానో ముందున్న బెంచ్‌పై కూర్చున్న డెలివరీ బాయ్ కొన్ని సెకన్లలోనే బటన్లపై చేతివేళ్లను వేగంగా కదిలించడం మొదలుపెట్టాడు. బీథోవెన్స్ ‘మూన్‌లైట్’ సొనాటాను చాలా అద్బుతంగా ప్లే చేశాడని ఆమె పొగడ్తల్లో ముంచేసింది. వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ అతడికి ఎంతో టాలెంట్ ఉందన్నారు జూలీ.
ర్యాన్ వర్చెట్టి సైతం హర్షం వ్యక్తం చేశాడు. వీడియో గేమ్ ఆడుతున్న మా 10ఏళ్ల బాబు అది పక్కనపెట్టేసి మరీ పియానో ప్లే చేస్తున్నది ఎవరో చూసేందుకు వచ్చాడని తెలిపాడు. డెలివరీ బాయ్ డుడల్ పియానో వద్దకు వెళ్లగా.. అది పగలకొడతాడేమోనని అనిపించిందన్నాడు. చిన్నప్పటి నుంచీ పియానో ప్లే చేయడం అంటే ఇష్టమని, దాంతోపాటు బేస్‌బాల్ గేమ్ వల్ల తనకు స్కాలర్‌షిప్ వస్తుందని ఆగస్టులో మాకాంబ్ కమ్యూనిటీ కాలేజీలో చేరనున్నట్లు డెలివరీ బాయ్ తమకు చెప్పినట్లు ర్యాన్ వివరించాడు. అతడు పియానో ప్లే చేస్తుండగా వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా భారీ లైక్స్, కామెంట్లతో అతడు పాపులర్ అయిపోయాడు. డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు కానీ.. ఈ టీనేజర్‌లో అమేజింగ్ టాలెంట్ ఉందని నెటిజన్లు కొనియాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment