
పాక్ ప్రధాని కావాలని ఉంది: మలాలా
న్యూయార్క్: తాలిబన్ల కాల్పుల్లో గాయపడి కోలుకున్న పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్(16) పాక్‌కు ప్రధాని కావాలని కోరుకుంటున్నానని చెప్పింది. తన ఆదర్శ నాయకురాలైన దివంగత ప్రధాని బేనజీర్ భుట్టో అడుగుజాడల్లో నడచి దేశానికి సేవ చేయాలని ఉందని సీఎన్‌ఎన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ‘ఇదివరకు డాక్టర్‌ను కావాలనుకున్నాను. అయితే ఇప్పుడు రాజకీయాల్లో చేరాలనుకుంటున్నాను. రాజకీయాల్లోకి వెళ్తే దేశానికే డాక్టర్ కావచ్చు. ప్రధాని అయితే బడ్జెట్ నుంచి పిల్లల విద్య కోసం ఎక్కువ నిధులు ఖర్చు చేయొచ్చు’ అని చెప్పింది.
మలాలా పుస్తకాన్ని అమ్మొద్దు: తాలిబన్లు
ఇస్లామాబాద్: మలాలా తన జీవితానుభవాలతో రాసిన ‘ఐ యామ్ మలాలా’ పుస్తకాన్ని అమ్మకూడదని పాక్ తాలిబన్లు వ్యాపారులను హెచ్చరించారు. మలాలా లౌకికవాదం కోసం మతాన్ని వదులుకుందని, అందుకే ఆమెకు అవార్డులు ఇస్తున్నారని తాలిబన్ల ప్రతినిధి షహీదుల్లా షాహిద్ ఆరోపించాడు. మలాలా నిజానికి ఎలాంటి సాహసమూ చేయలేదని, ఆమె పుస్తకాన్ని అమ్మితే శిక్షిస్తామని హెచ్చరించాడు.