
చైనా దూకుడుకు బ్రేక్‌లు ఇవే....
సాక్షి, న్యూఢిల్లీ : ఇండో- చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమై యుద్ధానికి దారితీసినా చైనాకు ఒరిగేదేమీలేదని ఇరు వైపులా ప్రాణ నష్టం మినహా సాధించేదేమీ లేదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. చైనా భేషజాలకు పోయి హెచ్చరికలు జారీ చేయడం కట్టిపెట్టి చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి చొరవ చూపడమే మేలని భావిస్తోంది. 1962లో చైనాతో తలపడిన భారత్ తాజా ఉద్రిక్తతలకు బెదరబోదని, ఆసియా ప్రబల శక్తిగా ఎదిగి అమెరికాకు దీటైన సవాల్ విసురుతున్న చైనాకే యుద్ధంతో సవాళ్లు ఎదురవుతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో డోక్లామ్ వద్ద భారత్‌కే ప్రాబల్యం ఉందని, సేనల పరంగా మనమే ముందున్నామని, అయితే సరిహద్దులో మౌలిక వసతుల విషయంలో చైనాదే పైచేయి అని తెలిపాయి. యుద్ధం వస్తే 3488 కిలోమీటర్ల ఇండో-చైనా సరిహద్దు వెలుపలకూ అది విస్తరించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి.
భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఊపందుకున్నక్రమంలో ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసే పరిస్థితి ఉండబోదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. యుద్ధం దిశగా సాగుతున్న చైనా దూకుడుకు ఆర్థిక, వ్యూహాత్మక అంశాలు బ్రేక్ వేస్తాయని చెబుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ తొలివారంలో చైనాలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ల భేటీ డోక్లాం ప్రతిష్టంభనకు తెరదించే దిశగా సాగుతుందని భావిస్తున్నారు.