
కొండపై నుంచి ‘ఫైర్‌ఫాల్’
కాలిఫోర్నియా: ఇది అరుదైన, అద్భుతమైన చిత్రం. గత 11 ఏళ్లలో ఈ దృశ్యం కనిపించడం ఇది మూడోసారి మాత్రమే. ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ ఫొటో కాలిఫోర్నియాలోని యోస్‌మైట్ నేషనల్ పార్క్‌లో వాలైంటైన్స్ డే రోజున తీసిన చిత్రం. ఎత్తైన కొండ శిఖరం మీద నుంచి మంటల్లే కిందకు పారుతున్న ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరైనా అగ్నిపర్వతం నుంచి కిందకు లావా ప్రవహిస్తోందని పొరపాటు పడతారు. కానీ ఇది ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన సహజ ఆకృతి.
వాస్తవానికి కొండపై నుంచి జాలువారేది సన్నటి వాటర్ ఫాల్. పడమటి సంధ్యలో అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు పడి ప్రతిఫలించడం వల్ల ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. అరుదుగా ఫిబ్రవరి నెలలో కనిపించే ఈ దృశ్యానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. నిర్దిష్టమైన సూర్యుడి వేడికి కొండపైనున్న మంచుకరగి కిందకు జాలువారుతుంది. అప్పడు ఆకాశంలో ఎలాంటి మబ్బులు లేకుండా స్వచ్ఛమైన వాతావరణం ఉండాలి. అప్పుడే ఈ దృశ్యం కనిపిస్తుంది. హార్స్‌టేల్‌గా పిలిచే ఫాటర్ ఫాల్, జాలువారుతున్న లావాలా కనిపిస్తుండడంతో దాన్ని ‘ఫైర్‌ఫాల్’ అని పిలుస్తున్నారు.
పది నిమిషాలపాటు కనిపించిన ఈ దృశ్యాన్ని చూస్తూ జగతిని మైమరిచి తన్మయత్వంలో మునిగిపోయామని దీన్ని ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్, న్యూరో సైకాలజిస్ట్ సంగీతా డే తెలిపారు. ఈ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు ఎంతో మంది ఫొటోగ్రాఫర్లు ప్రతి ఏడాది ఫిబ్రవరిలో పార్క్‌ను సందర్శిస్తారట, అయితే గత 11 ఏళ్లలో ఈ దృశ్యం కనిపించడం మూడోసారి మాత్రమే అని ఆమె చెప్పారు. తనకు మాత్రం ఈ అవకాశం అనుకోకుండా రావడం అదృష్టమని ఆమె వ్యాఖ్యానించారు. మొట్టమొదటిసారిగా 1973లో గ్యాలెన్ రోవెల్ అనే ఫొటోగ్రాఫర్ ఈ దృశ్యాన్ని ఫొటో తీశారు.