వీళ్లంతా ఏపీకి సలహాదారులట! | we are all AP advisors | Sakshi
Sakshi News home page

వీళ్లంతా ఏపీకి సలహాదారులట!

Published Sun, Jan 17 2016 1:12 AM | Last Updated on Sat, Aug 18 2018 6:00 PM

వీళ్లంతా ఏపీకి సలహాదారులట! - Sakshi

వీళ్లంతా ఏపీకి సలహాదారులట!

ముదిరిన చంద్రబాబు విదేశీ మైకం
సాక్షి, హైదరాబాద్: ‘నేను మారిన మనిషిని’. ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెప్పేమాట ఇది.  కానీ తనలో ఎలాంటి మార్పూ లేదని ఆయన పదేపదే రుజువు చేసుకుంటున్నారు. ఆయనలో విదేశీమైకం ఏమాత్రమూ దిగలేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచంలోని పలు ప్రముఖ పరిశ్రమల సీఈవోలు, మాజీ దేశాధ్యక్షులను రాష్ర్ట ఆర్థికాభివృద్ధి మండలి సలహాదారులుగా నియమించాలని చంద్రబాబు భావించడం ఇందుకు తాజా నిదర్శనం. ముఖ్యమంత్రి ఆలోచనలకనుగుణంగా ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో కృష్ణకిషోర్ పలు ప్రతిపాదనలను సిద్ధం చేశారు కూడా.  

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ అధ్యక్షుడు టోనీ బ్లెయిర్, మైక్రోసాఫ్ట్ సంస్థాపక అధ్యక్షుడు బిల్‌గేట్స్ వంటివారిని రాష్ర్ట ఆర్థికాభివృద్ధి మండలి సలహాదారులుగా నియమించుకోవాలని ముఖ్యమంత్రి భావించడం చూస్తే ఆయన విదేశీ మైకం బాగా ముదిరినట్లు కనిపిస్తున్నదని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.  బ్రాండ్.. ఇమేజ్.. భ్రమల నుంచి చంద్రబాబు బైటపడినట్లు కనిపించడం లేదని అధికారులంటున్నారు.  

క్లింటన్, బ్లెయిర్, బిల్‌గేట్స్ వంటివారితో ఎప్పుడు మాట్లాడతారని.. ఏ సలహాలు తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో బాబుగారి విజన్ మాటలు విని స్విట్జర్లాండ్ మంత్రి పాస్కల్ కొచెపిన్ ‘‘ఇలాంటివి చెబితే మాదేశంలో జైలుకన్నా పంపిస్తారు లేదంటే పిచ్చాసుపత్రికైనా పంపుతారు’’ అని వ్యాఖ్యానించిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఇపుడు మరలా అదే తీరులో వ్యవహరిస్తున్నారని వారు పేర్కొంటున్నారు.
 
ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదనలు..

ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఏర్పాటు కాబోతున్న రాష్ర్ట ఆర్థిక మండలి ఎలా ఉండబోతోంది..? దాని రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి? అనేది గతకొంతకాలంగా చర్చనీయాంశంగా ఉంది.  ఆర్థికాభివృద్ధి మండలి సీఈవోగా నియమితులైన ఐఆర్‌ఎస్ అధికారి జె.కృష్ణకిషోర్ ఇప్పటికే సింగపూర్‌లో ఆర్థిక అభివృద్ధి మండలిని అధ్యయనం చేసివచ్చారు. రాష్ర్ట ఆర్థికాభివృద్ధి మండలి ఏ తరహాలో ఉండాలో ఒక ప్రజంటేషన్ రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించారు. ఆర్థికాభివృద్ధిమండలికి వివిధ రంగాలలో సలహాలు, సూచనలు ఇవ్వడం కోసం పలువురు విదేశీ ప్రముఖులను సలహాదారులుగా నియమించాలని అందులో ప్రతిపాదించారు.
 
సలహాదారులుగా పరిశ్రమాధిపతులు..
మాజీ దేశాధినేతలు...!!

రాష్ర్ట ఆర్థికమండలికి సలహాదారులుగా.. పరిపాలన రంగంలో బిల్ క్లింటన్, టోనీబ్లెయిర్, ఎస్.నారాయణ, ఫిలిప్ యో, ప్రతాప్ భానుమెహతా, అరుణ మైరాలను, పరిశ్రమల రంగంలో బిల్‌గేట్స్, రతన్ టాటా, ఎల్‌నో మస్క్, సత్య నాదెళ్ల, ఇంద్రా నూయీ, సుందర్ పిచాయ్, ఆనంద్ మహీంద్ర, శివ నాడార్, ఆది గోద్రెజ్, వై.సి.దేవేశ్వర్, దీపక్ పారిఖ్‌లను సలహాదారులుగా నియమించాలని ప్రతిపాదించారు. మౌలిక సదుపాయాల్లో ఎ.ఎం.నాయక్, జి.రఘురామ్, ప్రొఫెసర్ సెబాస్టియన్ మోరిస్, అశ్వన్ మహాలింగం, జగన్ షాలను, ఆర్థిక, పబ్లిక్ ఫైనాన్స్ రంగంలో వై.వి.రెడ్డి, సి.రంగరాజన్, డి.సుబ్బారావు, ఎం.గోవిందరావు, వివేక్ పాథక్, అశోక్ గులాటి, అభిజిత్ బెనర్జీలను సలహాదారులుగా నియమించాలని సూచించారు. నైపుణ్య పారిశ్రామిక రంగంలో ఆర్.ఎ. మషేల్కర్, సంతోష్ మెహరోట్రా, రాజన్ అనందన్, ఎస్.పరశురామన్, నందన్ నీలేకని, వినోద్ ఖోస్లాలను సలహాదారులుగా నియమించాలని ప్రతిపాదించారు.
 
రెండు లక్షల కోట్ల పెట్టుబడులు!

రాష్ర్టంలో 2019 నాటికి రూ. రెండు లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా ఆర్థికమండలి పనిచేస్తుందని కూడా సీఈవో కృష్ణ కిషోర్ ఆ ప్రతిపాదనలలో పేర్కొన్నారు. అయితే 1991 ఆగస్టు నుంచి మార్చి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8.96 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వస్తే కేవలం 41,860 కోట్ల రూపాయలు పెట్టుబడుల ప్రతిపాదనలు మాత్రమే అమలైనట్లు ఆర్థిక శాఖ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. ఇది ప్రతిపాదనల్లో కేవలం 4.67 శాతం మాత్రమేనని ఆయన వివరించారు.
 
అంతర్గత ఆదాయం పెంపు, యూజర్ చార్జీలు
ఆర్థికాభివృద్ధి మండలిలో పలు విభాగాలు.. ప్రణాళిక-విధాన రూపకల్పన, పెట్టుబడుల ప్రోత్సాహక, ప్రాజెక్టు అప్రైజల్ సలహా సర్వీసు, ఆర్థిక వనరుల సమీకరణ-స్పెషల్ పర్పస్ వెహికల్  పనిచేస్తాయి. అంతర్గతంగా ఆదాయాన్ని పెంచే మార్గాలను ఆర్ధికాభివృద్ధి మండలి అన్వేషిస్తుంది. పన్ను మూలాల్ని విస్తరించడం, పన్నుల్ని పెంచడం, యూజర్ చార్జీల వసూలు ద్వారా ఆర్థిక వనరులను పెంచనుంది. అలాగే కేంద్రం నుంచి రాబట్టగలిగే ఆర్థిక వనరుల్ని గుర్తిస్తుంది.

విదేశీ సంస్థల నుంచి రుణాల్ని రాబట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. ఆర్థికాభివృద్ధి మండలి ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తారు. న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లలో ఉప కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాలతోపాటు చెన్నై, బెంగళూరుల్లోనూ ఆర్థిక మండలి కార్యాలయాల్ని ఏర్పాటు చేస్తారు. న్యూయార్క్, కాలిఫోర్నియా, లండన్, పారిస్, బీజింగ్, షాంఘై, సింగపూర్, టోక్యోల్లోనూ స్థానికులద్వారా రాష్ట్ర ఆర్థిక మండలికి పనిచేసేలా ఏర్పాటు చేస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement