మనం రంగు మారొచ్చు! | we may change our తరుయ colour | Sakshi
Sakshi News home page

మనం రంగు మారొచ్చు!

Published Thu, Jun 11 2015 9:33 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

మనం రంగు మారొచ్చు!

మనం రంగు మారొచ్చు!

ఊసరవెల్లి గురించి తెలుసుకదూ. చర్మం రంగులు మార్చగలగడం దాని ప్రత్యేకత. అలాగే సముద్రంలో నివసించే అనేక జీవులు ఇతర వేట జీవుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు చర్మం రంగును మారుస్తుంటాయి. అవి ఉన్న ప్రదేశానికి అనుగుణంగా తమ రంగును మార్చుకుని వాటిని వేటాడే జీవులను బోల్తా కొట్టిస్తుంటాయి. ఆ జీవి రంగు అక్కడి ప్రదేశంలో కలిసిపోయి ఉండడంతో వేరే జీవులేవీ వాటిని గుర్తించలేవు. తద్వారా అవి రక్షణ పొందుతాయి. ఇలా చర్మం రంగులను మార్చగలిగే లక్షణం అనేక సముద్ర జీవులకు ఉంది. రంగులు మార్చే చర్మం వల్ల మానవులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని భావించిన శాస్త్రవేత్తలు ఇలాంటి కృత్రిమ చర్మాన్ని రూపొందించారు.
 
చర్మం రంగు ఎలా మారుతుంది..
ఆక్టోపస్, కొన్ని రకాల చేపలు, ఇతర సముద్ర జీవులు చర్మం రంగును మార్చుకోగలవు. ఆయా జీవుల్లో ఉండే హరితకాలు అనే కణజాలాల వల్ల చర్మం రంగు మారుతుంది. ఈ జీవుల చర్మంపై వర్ణద్రవ్య సంచులు ఉంటాయి. కణజాలం చుట్టూ ఉన్న కండరాలు వర్ణద్రవ్యం సాగేలా చేస్తాయి. అక్కడి పరిసరాలు ఏ రంగులో ఉంటే ఆ రంగుకు అనుగుణంగా ఈ వర్ణద్రవ్యంరంగు మారుతుంది. దీని వల్ల ఆయా జీవుల రంగు పరిసరాల్లో కలిసిపోతుంది. ఈ  మార్పులను ఆధారంగా చేసుకుని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని రూపొందించారు.
 
ఎలా రూపొందించారు:
రంగులు మారే కృత్రిమ చర్మం రూపొందించేందుకు శాస్త్రవేత్తలు సున్నితమైన, సాగే గుణం ఉన్న కండరాలు కలిగిన చర్మం లాంటి పదార్థాన్ని తయారు చేశారు. ఇది ఎలక్ట్రానిక్ తరంగాల ద్వారా అవసరమైన రూపం, రంగు, పరిమాణంలోకి మారగలదు. ఈ చర్మంలాంటి పదార్థంపై రంగులు గల మచ్చల్ని ఏర్పాటు చేశారు. ఈ పదార్థం పరిమాణం, ఆకారం మారినప్పుడు ఈ మచ్చలు కూడా వెంటనే మారిపోతాయి. ఎలక్ట్రానిక్ తరంగాలకు అనుగుణంగా ఈ మచ్చలు కావాల్సిన రంగులోకి మారిపోతాయి.
 
మరో శాస్త్రవేత్తల బృందం కూడా ఇటీవల ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాన్నే తయారు చేసింది. ఈ పరికరంలో కాంతి, ఉష్ణోగ్రత సెన్సర్లు ఉంటాయి. అవి పరిసరాల్లోని రంగుకు అనుగుణంగా కాంతిని ప్రసరింపజేస్తాయి. పరిసరాల్లో ఏ రంగు ఉంటే ఆ రంగు కాంతిని ఇవి ప్రసరిస్తాయి. ఇలా రంగులు మార్చే చర్మంలాంటి ఉత్తత్తులు అందుబాటులోకి వస్తే సైన్యం, రక్షణ సిబ్బందికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement