భారత్తో చర్చలకు సిద్ధం: పాక్
న్యూఢిల్లీ: ఎలాంటి ముందస్తు షరతు లేకుండా భారత్తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ జాతీయ భద్రత సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. ఇరు దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశాన్ని రద్దు చేసినట్టు భారత్ అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు.
ఇదిలావుండగా, భారత్, పాక్ల మధ్య శాంతి చర్చల్లో మూడోపక్షం ప్రమేయం ఉండరాదని భారత్ మొదట్నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. పాక్ ఈ చర్చలకు జమ్ముకశ్మీర్ వేర్పాటు వాద నాయకులను ఆహ్వానించడంపై భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. గతంలో భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్లు నిర్ణయించిన శాంతిచర్చల ఎజెండాకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అప్పట్లో అనుకున్న ఎజెండాలో అసలు కాశ్మీర్ అంశం లేదు. కానీ ఆ తర్వాత నవాజ్ షరీఫ్పై పాక్ సైన్యం తీవ్రమైన ఒత్తిడి తేవడంతో చర్చల్లో కాశ్మీర్ సమస్య గురించి కూడా ఉండాలని అన్నారు. పైగా, ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు ముందు.. కాశ్మీర్కు చెందిన వేర్పాటువాద నేతలతో చర్చలకు పాక్ సై అంది. దీంతో ఇరు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. పాక్ జాతీయ భద్రత సలహాదారును కలిసేందుకోసం వెళ్తున్న కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబీర్ షాను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో సర్తాజ్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్తో అన్ని సమస్యల గురించి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కశ్మీర్ అంశానికి తాము అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. భారత్ హురియత్ నేతలను అరెస్ట్ చేయడం తమను నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. పాక్ ముందస్తు షరతు లేకుండా భారత్తో చర్చలు జరిపేందుకు సిద్ధమని ఓ వైపు చెబుతూనే.. మరోవైపు భారత్ అభీష్టానికి భిన్నంగా హురియత్ నేతలను చర్చలకు ఆహ్వానించడం గమనార్హం.