
వామ్మో! వాట్సాప్ ను వాళ్లూ వాడుకుంటున్నారు!
అబుధాబి: మొబైల్ మెసెజింగ్ యాప్ వాట్సాప్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. నిన్నమొన్నటివరకు రోడ్డుపక్కన పేవ్‌మెంట్ల మీద, కూడళ్ల వద్ద, థియేటర్ల వద్ద అడుక్కున్న యాచకులు ఇప్పుడు వాట్సాప్‌నూ వదిలిపెట్టడం లేదు. సున్నితమైన మనస్సు, దానగుణం ఉన్న వారు లక్ష్యంగా ఏకంగా వాట్సాప్ లో కరుణరసాత్మకమైన కథనాలు వండివారుస్తున్నారు. అమ్మ జబ్బుకు, అక్కకు రోగం, అన్నకు వైకల్యం అన్న తరహాలో అత్యంత దయనీయ కథనాలను గుర్తుతెలియన నంబర్ల ద్వారా పంపిస్తూ డబ్బులు అడుక్కుంటున్నారు.
ఎంత తోచితే అంత దానం చేయాలని వేడుకుంటూ ఏకంగా బ్యాంకు అకౌంట్ నంబర్లు కూడా వాట్సాప్‌లకు పంపిస్తున్నారు. రంజాన్ మాసం కావడంతో దుబాయ్‌లో ఈ ట్రెండ్ మరింత ముదిరింది. ప్రజల జాలిగుణాన్ని సొమ్ము చేసుకొని డబ్బు దోచుకునే ఉద్దేశంతో మోసగాళ్లే ఇలాంటి సందేశాలను వాట్సాప్ నంబర్లకు కుప్పలు తెప్పలుగా పంపిస్తున్నారని, వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని అబుదాబి డీజీపీ (ఆపరేషన్స్) ఆమిర్ మహమ్మద్ ఆల్ ముహైరి చెప్పారు. వాట్సాప్ లో తనకు నిత్యం ఇలాంటి దీనతీదీనమైన కథనాలతో సందేశాలు వస్తుండటంతో ఓ మహిళ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసపూరితమైన సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, మీడియా దుబాయ్ ప్రజలకు సూచించింది.