మానవతా దృక్పథంతో చూడాలి
కొలంబో: శ్రీలంక జలాల్లోకి పొరపాటుగా ప్రవేశిస్తున్న భారత జాలర్ల అంశాన్ని మానవతా దృక్పథంతో చూడాలని.. అది వారి జీవనాధారానికి సంబంధించినదని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘేకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విజ్ఞప్తి చేశారు. ఇటలీ నావికులతో భారత జాలర్లను పోల్చడం సరికాదని స్పష్టం చేశారు. శ్రీలంకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ముందుగా అక్కడికి వెళ్లిన సుష్మ శనివారంవిక్రమసింఘేతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అయితే భారత జాలర్లు ఉత్తర లంక జాలర్ల జీవనోపాధికి గండి కొడుతున్నారని, లంక జలాల్లోకి ప్రవేశిస్తే కాల్చివేస్తామని ఇటీవల విక్రమ సింఘే చేసిన వ్యాఖ్యలపై సుష్మ ఈ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది జాలర్ల జీవనాధార విషయమని, మానవతా దృక్పథంతో చూడాలని ఆమె స్పష్టం చేశారు. భేటీ అనంతరం విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ విషయాన్ని విలేకరులకు వెల్లడించారు. కాగా శ్రీలంకలోని తమిళుల కూటమి ‘తమిళ్ నేషనల్ అలయన్స్ (టీఎన్‌ఏ)’ నేతలతో సుష్మ జరిపిన భేటీలోనూ భారత జాలర్ల అంశం ప్రస్తావనకు వచ్చింది.