జెనీవా: కరోనా వైరస్ పేషెంట్లకు ఉపయోగిస్తున్న యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనాను పూర్తిగా నయం చేయడంలో విఫలమైనందున దీని ట్రయల్స్‌కు మంగళం పాడనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు డబ్ల్యూహెచ్‌వో శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా పేషెంట్లపై ప్రయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌తోపాటు లోపినవిర్, రిటోనవిర్ మందుల క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్‌లో మధ్యంతర నివేదికలు ఈ ఔషధాలు కోవిడ్ మరణాలను తగ్గించడంలో ఎలాంటి ప్రభావాన్ని చూపలేవని తెలిపింది. (ఆ ఔషధ ఉత్పత్తిని పెంచండి: డబ్ల్యూహెచ్‌ఓ)
అయితే ఈ మందులు ఇచ్చిన రోగుల్లో కోవిడ్ మరణాల రేటు పెరిగిందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని వివరణ ఇచ్చింది. ఈ నిర్ణయం ఇతర అధ్యయనాలపై ప్రభావాన్ని చూపబోదని స్పష్టం చేసింది. కాగా అగ్రరాజ్యం అమెరికా సంజీవనిగా భావిస్తూ వచ్చిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కరోనా పేషెంట్లపై పరీక్షించేందుకు అభ్యంతరం చెప్తూ సదరు ఔషధంపై డబ్ల్యూహెచ్‌వో మే 25న నిషేధం విధించింది. అయితే దీన్ని ప్రయోగించిన వారిలో మరణాల రేటును సమీక్షించిన తర్వాత జూన్ మొదటివారంలో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. మరోవైపు.. ప్రస్తుతానికైతే కరోనాను పూర్తిగా తగ్గించే చికిత్స ఏది లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ రాయబారి డాక్టర్ డేవిడ్ నబారో పేర్కొన్న విషయం తెలిసిందే. (ప్రపంచం పెను ప్రమాదంలో ఉంది)
Comments
Please login to add a commentAdd a comment