‘వికీలీక్స్‌’ అసాంజె అరెస్ట్‌ | Wikileaks co-founder Julian Assange arrested in London | Sakshi
Sakshi News home page

‘వికీలీక్స్‌’ అసాంజె అరెస్ట్‌

Published Fri, Apr 12 2019 4:20 AM | Last Updated on Fri, Apr 12 2019 4:59 AM

Wikileaks co-founder Julian Assange arrested in London - Sakshi

లండన్‌లో అసాంజెను వాహనంలో తరలిస్తున్న దృశ్యం

లండన్‌: అమెరికా రక్షణ రహస్యాలు బహిర్గతం చేసి సంచలనం సృష్టించిన వికీలీక్స్‌ సహవ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజె(47) అరెస్టయ్యారు. ఏడేళ్లుగా ఆయన లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నారు . అసాంజెకు కల్పించిన శరణార్థి హోదా, పౌరసత్వాన్ని ఈక్వెడార్‌ తాజాగా ఉపసంహరించడంతో గురువారం స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. తమ రహస్యాలను తస్కరించి ఘోరమైన నేరానికి పాల్పడిన అసాంజెను తమకు అప్పగించాలని అమెరికా పెట్టుకున్న విజ్ఞప్తి మేరకే ఆయన్ని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో హాజరుపరచగా, అసాంజె తమ మందు గైర్హాజరై బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని కోర్టు నిర్ధారించింది. దీంతో ఆయనకు 12 నెలల శిక్ష పడే అవకాశాలున్నాయి.  

ఈక్వెడార్‌ ఎంబసీలో ఆశ్రయం
స్వీడన్‌లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై అరెస్టయినప్పటి నుంచి అసాంజె ఈక్వెడార్‌ ఎంబసీలో తలదాచుకుంటున్నారు. ఈ కేసులో తనను స్వీడన్‌కు అప్పగిస్తే, చివరకు అమెరికాకు అప్పగిస్తారని, అదే జరిగితే తనకు మరణ దండన లేదా చిత్రహింసలు తప్పవని పేర్కొంటూ ఈక్వెడార్‌ సాయం అర్థించిన తెలిసిందే. కోర్టు ముందు లొంగిపోవడంలో విఫలమైన అసాంజెకు వ్యతిరేకంగా అదే కోర్టు 2012 జూన్‌ 29న ఆదేశాలిచ్చిందని, ఆ వారెంట్‌ ప్రకారమే ఆయన్ని అరెస్ట్‌ చేశామని మెట్రోపాలిటన్‌ పోలీస్‌ విభాగం వెల్లడించింది.  అసాంజె అరెస్ట్‌ను యూకే ప్రభుత్వం స్వాగతించింది.

యూకే, ఈక్వెడార్‌ల మధ్య జరిగిన విస్తృత చర్చల ఫలితంగానే ఇది సాధ్యమైందని పేర్కొంది. శరణార్థి నిబంధనలను అసాంజె తరచూ ఉల్లంఘించారని అందుకే ఆయనకు కల్పించిన రక్షణను ఉపసంహరించుకున్నామని ఈక్వెడార్‌ అధ్యక్షుడు లెనిన్‌ మొరెనో చెప్పారు. ఇటీవలి కాలంలో అసాంజె, తన ఆతిథ్య దేశం ఈక్వెడార్‌  మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అసాంజె ఆశ్రయంపై పలు కొత్త నిబంధనలు విధించిన ఈక్వెడార్‌..ఆయన ఇంటర్నెట్‌ వినియోగం పైనా ఆంక్షలు పెట్టింది. రహస్యాలు బహిర్గతం చేసిన అసాంజెపై అభియోగాలు మోపినట్లు అమెరికా అధికారులు ధ్రువీకరించలేదు. కానీ కీలక పత్రాల ముద్రణకు సంబంధించి అసాంజెపై నేరపూరిత ఆరోపణలు నమోదైనట్లు గతేడాది బయటపడింది.

అసాంజె కేసు నేపథ్యమిదీ
అమెరికా దౌత్య విధానాలు, అఫ్గానిస్తాన్, ఇరాక్‌ యుద్ధాలకు సంబంధించి వికీలీక్స్‌ 2010లో 7.20 లక్షల కీలక పత్రాలను బహిర్గతం చేసింది. అదే ఏడాది అసాంజెపై లైంగికదాడి ఆరోపణలు రావడంతో స్వీడన్‌ కోర్టు వారెంట్‌ జారీచేసింది.  లండన్‌లో లొంగిపోయిన అసాంజె బెయిల్‌పై విడుదలయ్యారు. అసాంజెను స్వీడన్‌కు అప్పగించాలని 2011లో బ్రిటన్‌ కోర్టు తీర్పునిచ్చింది. అదే జరిగితే తనను స్వీడన్‌ నుంచి అమెరికాకు అప్పగిస్తారని ఈక్వెడార్‌ సాయం కోరారు అసాంజె. దీంతో 2012 జూన్‌లో ఆయనకు ఈక్వెడార్‌ రాజకీయ శరణార్థి హోదా ఇచ్చింది. లండన్‌లో అసాంజెను ప్రశ్నించేందుకు స్వీడన్‌ అధికారులకు ఈక్వెడార్‌ అనుమతివ్వలేదు. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఈక్వెడార్‌ ఆయనపై పలు ఆంక్షలు విధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement