Ecuadorian embassy
-
‘వికీలీక్స్’ అసాంజె అరెస్ట్
లండన్: అమెరికా రక్షణ రహస్యాలు బహిర్గతం చేసి సంచలనం సృష్టించిన వికీలీక్స్ సహవ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె(47) అరెస్టయ్యారు. ఏడేళ్లుగా ఆయన లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నారు . అసాంజెకు కల్పించిన శరణార్థి హోదా, పౌరసత్వాన్ని ఈక్వెడార్ తాజాగా ఉపసంహరించడంతో గురువారం స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్‌చేశారు. తమ రహస్యాలను తస్కరించి ఘోరమైన నేరానికి పాల్పడిన అసాంజెను తమకు అప్పగించాలని అమెరికా పెట్టుకున్న విజ్ఞప్తి మేరకే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం వెస్ట్‌మినిస్టర్ కోర్టులో హాజరుపరచగా, అసాంజె తమ మందు గైర్హాజరై బెయిల్ షరతులను ఉల్లంఘించారని కోర్టు నిర్ధారించింది. దీంతో ఆయనకు 12 నెలల శిక్ష పడే అవకాశాలున్నాయి. ఈక్వెడార్ ఎంబసీలో ఆశ్రయం స్వీడన్లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై అరెస్టయినప్పటి నుంచి అసాంజె ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నారు. ఈ కేసులో తనను స్వీడన్‌కు అప్పగిస్తే, చివరకు అమెరికాకు అప్పగిస్తారని, అదే జరిగితే తనకు మరణ దండన లేదా చిత్రహింసలు తప్పవని పేర్కొంటూ ఈక్వెడార్ సాయం అర్థించిన తెలిసిందే. కోర్టు ముందు లొంగిపోవడంలో విఫలమైన అసాంజెకు వ్యతిరేకంగా అదే కోర్టు 2012 జూన్ 29న ఆదేశాలిచ్చిందని, ఆ వారెంట్ ప్రకారమే ఆయన్ని అరెస్ట్ చేశామని మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం వెల్లడించింది. అసాంజె అరెస్ట్‌ను యూకే ప్రభుత్వం స్వాగతించింది. యూకే, ఈక్వెడార్ల మధ్య జరిగిన విస్తృత చర్చల ఫలితంగానే ఇది సాధ్యమైందని పేర్కొంది. శరణార్థి నిబంధనలను అసాంజె తరచూ ఉల్లంఘించారని అందుకే ఆయనకు కల్పించిన రక్షణను ఉపసంహరించుకున్నామని ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మొరెనో చెప్పారు. ఇటీవలి కాలంలో అసాంజె, తన ఆతిథ్య దేశం ఈక్వెడార్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అసాంజె ఆశ్రయంపై పలు కొత్త నిబంధనలు విధించిన ఈక్వెడార్..ఆయన ఇంటర్నెట్ వినియోగం పైనా ఆంక్షలు పెట్టింది. రహస్యాలు బహిర్గతం చేసిన అసాంజెపై అభియోగాలు మోపినట్లు అమెరికా అధికారులు ధ్రువీకరించలేదు. కానీ కీలక పత్రాల ముద్రణకు సంబంధించి అసాంజెపై నేరపూరిత ఆరోపణలు నమోదైనట్లు గతేడాది బయటపడింది. అసాంజె కేసు నేపథ్యమిదీ అమెరికా దౌత్య విధానాలు, అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించి వికీలీక్స్ 2010లో 7.20 లక్షల కీలక పత్రాలను బహిర్గతం చేసింది. అదే ఏడాది అసాంజెపై లైంగికదాడి ఆరోపణలు రావడంతో స్వీడన్ కోర్టు వారెంట్ జారీచేసింది. లండన్‌లో లొంగిపోయిన అసాంజె బెయిల్‌పై విడుదలయ్యారు. అసాంజెను స్వీడన్‌కు అప్పగించాలని 2011లో బ్రిటన్ కోర్టు తీర్పునిచ్చింది. అదే జరిగితే తనను స్వీడన్ నుంచి అమెరికాకు అప్పగిస్తారని ఈక్వెడార్ సాయం కోరారు అసాంజె. దీంతో 2012 జూన్‌లో ఆయనకు ఈక్వెడార్ రాజకీయ శరణార్థి హోదా ఇచ్చింది. లండన్‌లో అసాంజెను ప్రశ్నించేందుకు స్వీడన్ అధికారులకు ఈక్వెడార్ అనుమతివ్వలేదు. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఈక్వెడార్ ఆయనపై పలు ఆంక్షలు విధించింది. -
అసాంజేకు ఇంటర్నెట్ కట్
లండన్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్టు ఈక్వెడార్ ప్రకటించింది. కాటాలోనియన్ వేర్పాటువాది అరెస్ట్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారా అసాంజే తన అభిప్రాయాన్ని తెలుపడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈక్వెడార్ రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు. యూరప్ దేశాలతో తమ దేశ సంబంధాలను అసాంజే చర్యలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు రఫెల్ కొరియా అధికారంలో ఉన్నప్పుడు అసాంజేకు మద్ధతుగా నిలిచినప్పటికీ, ప్రస్తుత అధ్యక్షుడు లెనిన్ మోరెనో రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోకూడదని ఆయనను హెచ్చరించారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో హిలరీ క్లింటన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన సమయంలో కూడా అసాంజేకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని తొలగించారు. అసాంజేపై స్వీడన్లో అత్యాచారం కేసు నమోదు కావడంతో ఆయన 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నారు. బయటకు వస్తే పోలీసులు అరెస్టుచేసి స్వీడన్‌కు, తర్వాత అమెరికాకు అప్పగిస్తారన్నది అసాంజే భయం. ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో అమెరికా అకృత్యాల రహస్య సమాచారాన్ని ఆయన వికీలీక్స్ ద్వారా బయటపెట్టడం తెలిసిందే. -
గుండెజబ్బుతో.. లొంగుబాటుకు సిద్ధమైన అసాంజ్
పలు దేశాలకు చెందిన అధికారిక రహస్యాలను బట్టబయలు చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ గుండెజబ్బుతో బాధపడుతున్నారు. దాంతో ఆయన లొంగిపోయేందుకు సిద్ధం అవుతున్నారు. చాలా కాలంగా లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న ఆయన.. అనారోగ్యం కారణంగానే బయటకు వచ్చేందుకు సిద్ధపడ్డారు. తన మీద ఎలాంటి ఆరోపణలు లేవని, తాను ఈక్వెడార్ రాయబార కార్యాలయం నుంచి త్వరలోనే బయటకు వస్తానని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. దాంతో అసాంజ్ లొంగిపోతారన్న ఉద్దేశంతో రాయబార కార్యాలయం ఎదుట భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గత రెండేళ్లుగా ఆయన అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో అసాంజ్ (43)కి గుండెజబ్బుతో పాటు తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య కూడా మొదలైంది. అయితే.. బయటకు వస్తే పోలీసులు అరెస్టు చేస్తారన్న కారణంతో ఇంతవరకు ఆస్పత్రికి కూడా వెళ్లలేదు. ప్రధానంగా విటమిన్ డి లోపం వల్లనే అసాంజ్ ఈ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలిసింది. దాదాపు రెండేళ్లుగా సూర్యరశ్మి సోకకపోవడం వల్లే డి విటమిన్ లోపం బాగా ఎక్కువైంది. దాంతో ఆయనకు ఆస్థమా, మధుమేహం, ఎముకలు బలహీనం కావడం, చివరకు మతిమరుపు కూడా వచ్చాయని అంటున్నారు. అసాంజ్‌ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనప్పుడు లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్ ఒక్కటి మాత్రమే ఆయనకు ఆశ్రయం ఇవ్వడానికి 202 ఆగస్టులో ముందుకొచ్చింది. ఓ లైంగిక దాడి కేసులో అసాంజ్‌ను ప్రశ్నించేందుకు ఆయనపై యూరోపియన్ అరెస్టు వారెంటు ఒకటి జారీ అయింది. దాంతో ఆయనను స్వీడన్‌కు నేరగాళ్ల అప్పగింత ఒప్పందంపై పంపాలని బ్రిటన్ భావిస్తోంది. స్వీడన్ నుంచి తనను అమెరికాకు పంపుతారని స్వతహాగా ఆస్ట్రేలియాకు చెందినర అసాంజ్ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ అమెరికాకు పంపితే, అక్కడి అధికారిక రహస్యాలను బయటపెట్టినందుకు ఆయనకు 35 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంది.