గుండెజబ్బుతో.. లొంగుబాటుకు సిద్ధమైన అసాంజ్
పలు దేశాలకు చెందిన అధికారిక రహస్యాలను బట్టబయలు చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ గుండెజబ్బుతో బాధపడుతున్నారు. దాంతో ఆయన లొంగిపోయేందుకు సిద్ధం అవుతున్నారు. చాలా కాలంగా లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న ఆయన.. అనారోగ్యం కారణంగానే బయటకు వచ్చేందుకు సిద్ధపడ్డారు. తన మీద ఎలాంటి ఆరోపణలు లేవని, తాను ఈక్వెడార్ రాయబార కార్యాలయం నుంచి త్వరలోనే బయటకు వస్తానని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. దాంతో అసాంజ్ లొంగిపోతారన్న ఉద్దేశంతో రాయబార కార్యాలయం ఎదుట భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.
గత రెండేళ్లుగా ఆయన అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో అసాంజ్ (43)కి గుండెజబ్బుతో పాటు తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య కూడా మొదలైంది. అయితే.. బయటకు వస్తే పోలీసులు అరెస్టు చేస్తారన్న కారణంతో ఇంతవరకు ఆస్పత్రికి కూడా వెళ్లలేదు. ప్రధానంగా విటమిన్ డి లోపం వల్లనే అసాంజ్ ఈ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలిసింది. దాదాపు రెండేళ్లుగా సూర్యరశ్మి సోకకపోవడం వల్లే డి విటమిన్ లోపం బాగా ఎక్కువైంది. దాంతో ఆయనకు ఆస్థమా, మధుమేహం, ఎముకలు బలహీనం కావడం, చివరకు మతిమరుపు కూడా వచ్చాయని అంటున్నారు. అసాంజ్ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనప్పుడు లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్ ఒక్కటి మాత్రమే ఆయనకు ఆశ్రయం ఇవ్వడానికి 202 ఆగస్టులో ముందుకొచ్చింది.
ఓ లైంగిక దాడి కేసులో అసాంజ్ను ప్రశ్నించేందుకు ఆయనపై యూరోపియన్ అరెస్టు వారెంటు ఒకటి జారీ అయింది. దాంతో ఆయనను స్వీడన్కు నేరగాళ్ల అప్పగింత ఒప్పందంపై పంపాలని బ్రిటన్ భావిస్తోంది. స్వీడన్ నుంచి తనను అమెరికాకు పంపుతారని స్వతహాగా ఆస్ట్రేలియాకు చెందినర అసాంజ్ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ అమెరికాకు పంపితే, అక్కడి అధికారిక రహస్యాలను బయటపెట్టినందుకు ఆయనకు 35 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంది.