సమాధానం దాటవేసిన డొనాల్డ్ ట్రంప్
లాస్ వెగాస్ :ఎన్నికల ఫలితాలపై మాట్లాడేందుకు అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా వస్తే అప్పుడు స్పందిస్తానని ఆయన అన్నారు. లాస్ వెగాస్లో జరిగిన చివరి డిబేట్లో ఆయన పాల్గొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తాను అప్పుడే అంగీకరించబోనని, తనకు వ్యతిరేకంగా రిగ్గింగ్ జరిగిందని ట్రంప్ ఆరోపించారు.
కాగా గతంలో ట్రంప్ ఎన్నికల ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి పార్టీ, మీడియా కలిసికట్టుగా ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడ్డాయని, నవంబర్ 8న సాధారణ ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొన్నింటిలోనూ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఆయన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై డిబేట్ మోడరేటర్ (సంధానకర్త) క్రిస్ వాలెస్ వేసిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం దాటవేశారు. ఎన్నికల ఫలితాలను గౌరవించాలా? లేదా? అనే దానిపై నవంబర్ ఎనిమిదిన నిర్ణయించుకుంటానని ట్రంప్ చెప్పారు. ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ కొనసాగితేనే బాగుంటుందన్నారు.
మా నాన్నదే విజయం: ఇవాంకా
మరోవైపు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మాత్రం... ఎన్నికల ఫలితాలను తన తండ్రి అంగీకరిస్తారని అన్నారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇవాంకా ఈ వ్యాఖ్యలు చేశారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే ఎలా స్పందిస్తారని అడిగిన ప్రశ్నకు ఎన్నికల్లో తన తండ్రే గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఇంతకన్నా ఎన్నికల ఫలితాలపై మాట్లాడేందుకు తాను ఇష్టపడనున్నారు. ఒకవేళ ఎన్నికల్లో విజయం సాధించినా, ఓడిపోయినా తన తండ్రి ఫలితాలను అంగీకరిస్తారని తెలిపారు. తన తండ్రి ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటారని ఆమె అభిప్రాయపడింది. తన తండ్రి గురించి మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు.