'టిప్ ఇవ్వని విద్యార్థి'పై వర్సిటీ వేటు!
తెల్లగా ఉందన్న కారణంతో రెస్టారెంట్ వెయిట్రస్ కు టిప్ ఇవ్వకుండా అవమానించిన నల్లజాతి విద్యార్థిపై వేటు వేయాలంటూ దాదాపు 50 వేల మంది ఆక్స్ ఫర్డ్ వర్సిటీకి పిటిషన్లు పంపడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 'జాత్యహంకారి ఎన్టొకోజో క్వాంబే'ను ఆక్స్ ఫర్డ్ నుంచి తొలిగించాలంటూ వస్తున్న పిటిషన్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్సిటీ ఎలాంటి చర్య తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఆక్స్ ఫర్డ్ లో లా పూర్తిచేసిన దక్షిణాఫ్రికా విద్యార్థి క్వాంబే.. పబ్లిక్ పాలసీలో పీజీ చేసేందుకు మళ్లీ అదే యూనివర్సిటీ చేరాడు. గతవారం తన సొంత ఊరు కేప్ టౌన్ లో ఓ రెస్టారెంట్ కు వెళ్లిన క్వాంబే తెల్ల వెయిట్రస్ కు టిప్ ఇవ్వకుండా దూషించి అవమానించాడు. సోషల్ మీడియాలో సంచలనం రేపిన ఈ ఉదంతంలో సదరు తెల్ల వెయిట్రస్ ఆష్లే స్కుల్జ్ కు భారీ ఎత్తున విరాళాలు లభించిన సంగతి తెలిసిందే. ఆక్స్ ఫర్డ్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, ఇక్కడి విద్యార్థుల భావాలకు, చేసే పోరాటాలకు అడ్డుకట్ట వేయబోదని వర్సిటీ అధికారుల ప్రకటించారు. అయితే సాటి మనిషిని తూలనాడటం తప్పేనని, అంత మాత్రాన క్వాంబేపై చర్యలు తీసుకోమని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.
(చదవండి: ఆమె తెల్లగా ఉందని టిప్ ఇవ్వనన్నాడు!)