గదిలో ఉన్న అన్ని పరికరాలకు ఒకేసారి చార్జింగ్
వాషింగ్టన్ : రూమ్‌లో ఎక్కడున్నా వైర్‌లెస్ విధానం ద్వారా ఒకే సారి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలకు చార్జింగ్ పెట్టుకునే సరికొత్త విధానాన్ని డిస్నీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిద్వారా ఒకేసారి సెల్‌ఫోన్లు, ఫ్యాన్లు, లైట్లను రీచార్జ్ చేయవచ్చు. ఈ నూతన ఆవిష్కరణలో విద్యుత్ శక్తి వైఫై తరంగాల మాదిరిగా మారుతుందని డిస్నీ రీసెర్చ్ సెంటర్ ప్రధాన పరిశోధక శాస్త్రవేత్త అలెన్ సన్ శాంపిల్ పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ ఫలితంగా భవిష్యత్తులో రోబోట్‌లు, మొబైల్ పరికరాల వంటి వాటిలో బ్యాటరీలు, వైర్లు అవసరం లేకుండా చేయవచ్చని అలెన్ సన్ తెలిపారు.
ఈ వైర్‌లెస్ పవర్‌ను సాధారణ గది పరిమాణానికి సరఫరా చేయగలుగుతున్నామని, కాని దీన్ని ఒక చిన్న బొమ్మ స్థాయికి తగ్గించడంకానీ, ఒక పెద్ద వేర్‌హౌస్ స్థాయికి పెంచడంగాని చేయలేకపోతున్నామని, ఈ విషయంలో పురోగతి సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. వైర్‌లెస్ పవర్ ట్రాన్స్ మిషన్ అనేది దీర్ఘకాలిక సాంకేతిక స్వప్నమని అలెన్సన్ అన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త నికోలా టెస్లా 1980లో వైర్‌లెస్ లైటింగ్ సిస్టంను కనుగొన్నారని, ఈ విధానంతో దూర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయడం, గృహాలకు వైర్‌లెస్ విధానం ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అలెన్ సన్ చెప్పారు.