
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న కాలమంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. చార్జింగ్ పాయింట్లు, మైలేజీ, పేలుళ్లు లాంటి సంఘటనలు నమోదవుతున్నప్పటికీ, పెరుగుతున్న కాలుష్య భూతాన్ని నివారించేందుకు ఈవాహనాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలో మీరట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికారు. ఈ-వాహనాలు డ్రైవింగ్‌లో ఉండగానే చార్జింగ్ చేసుకోవచ్చు. వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ లాంటి టెక్నాలజీతో అచ్చం మొబైల్స్ లాగానే వీటిని చార్జ్ చేసుకోవచ్చన్నమాట.
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం సాగర్ కుమార్, రోహిత్ రాజ్‌భర్ అనే ఇద్దరు స్టూడెంట్స్ వైర్‌లెస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ సిస్టంను డెవలప్ చేశారు. ఈ సిస్టంలో రోడ్డుపక్కన టవర్లు ఏర్పాటు చేసి కారులో రిసీవర్ ఏర్పాటు చేస్తామని సాగర్ తెలిపారు. కారు టవర్ పరిధిలోకి రాగానే, కారు బ్యాటరీ ఛార్జ్ అవ్వడం ప్రారంభమవుతుంది. రిసీవర్ పరిధి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, దాని వేగాన్ని పెంచుతుందని వెల్లడించారు. ఇది వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ లాంటిదని చెప్పారు. విద్యుదయస్కాంత శక్తి వ్యవస్థ ఆధారంగా ఈ టెక్నిక్ పనిచేస్తుందని రీజనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త మహదేవ్ పాండే తెలిపారు. తద్వారా డీజిల్, పెట్రోల్ వాహనాల మాదిరిగానే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఎక్కువ దూరం ప్రయాణించడమేకాదు డ్రైవింగ్‌లో ఉండగానే ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
పర్యావరణాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినప్పటికీ, ఛార్జింగ్ పాయింట్లు పరిమితంగా ఉండడం సమస్యగా మారిందని సాగర్ రోహిత్ చెప్పుకొచ్చారు. వాహనాలు ఎక్కువ దూరం వెళ్లలేక పోతున్న కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారనీ, అందుకే ఈ ఆలోచన చేశామ చెప్పారు. తమప్రతిపాదనకు నీతి ఆయోగ్‌కు పంపించామన్నారు.
వైర్‌లెస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ సిస్టం ఆలోచన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని రోహిత్ చెప్పారు. అయితే ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా తమ ప్రాజెక్ట్‌కు లభించిన సహాయంతో ప్రస్తుతం పని సులభంగా జరుగుతోందని రోహిత్ వెల్లడించారు. మరోవైపు తమ విద్యార్థుల ఆవిష్కరణపై ఎంఐఈటీ వైస్-ఛైర్మన్ పునీత్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. నూతన ఆవిష్కరణలకు తమ విద్యార్థులకు అన్ని సహాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment