Wireless Charging
-
వైఫైలా ‘వైర్లెస్ పవర్’.. కేబుల్స్ లేకుండానే మొబైల్ ఛార్జింగ్!
సియోల్: ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఛార్జింగ్ అయిపోతే చికాకు పడతారు. ఛార్జింగ్ పెట్టేందుకు కేబుల్ కోసం వెతుకుతారు. ఇంట్లో ఉంటే పర్వాలేదు.. కానీ వేర ప్రదేశానికి వెళ్లినప్పుడు కేబుల్స్‌ను తీసుకెళ్లటం కొంత భారంగానే ఉంటుంది. అయితే.. ఇకపై ఆ ఇబ్బందులు తప్పబోతున్నాయి. ఎలాంటి కేబుల్స్ లేకుండానే విద్యుత్తు సరఫరా చేసే ప్రయోగంలో తొలి విజయం సాధించారు శాస్త్రవేత్తలు. దక్షిణ కొరియాలోని సెజోంగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొత్త ‘వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్’ను అభివృద్ధి చేశారు. ఇన్‌ఫ్రారెండ్ లైట్స్ ద్వారా సురక్షితంగా పవర్‌ను ట్రాన్స్ఫర్ చేసి చూపించారు. 30 మీటర్ల దూరంలోని సెన్సార్లకు ఛార్జింజ్ చేసేందుకు 400 మిల్లీవాట్ల పవర్‌ను ఈ వ్యవస్థ విజయవంతంగా సరఫరా చేసింది. దీనిని మొబైల్ పరికరాలను ఛార్జ్ చేసే విధంగా విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచే పనిలోపడ్డారు శాస్త్రవేత్తలు. ‘పవర్ డివైజ్‌లను వైర్‌లెస్‌గా మార్చటం ద్వారా ఫోన్స్, టాబ్లెట్స్ వంటి వాటికి కేబుల్స్‌ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం రాదు. అలాగే.. ఐఓటీ పరికరాలు, తయారీ ప్లాంట్లలోని సెన్సెర్లను ఛార్జ్ చేయవచ్చు.’ అని పరిశోధన బృంద నాయకుడు జిన్యోంగ్ హా తెలిపారు. మరోవైపు.. వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ కోసం పలు టెక్నిక్‌లపై పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. అయితే.. మీటర్ల వ్యవధిలో తగినంత విద్యుత్తును పంపడం సవాలుగా మారిందన్నారు. ఈ క్రమంలో.. పరిశోధకులు 'డిస్ట్రిబ్యూటెడ్ లేజర్ ఛార్జింగ్' అనే పద్ధతి అన్ని టెక్నిక్‌ల కంటే మేలైనదిగా తేల్చారు. ఏదైనా వస్తువు, వ్యక్తి ఈ సిస్టమ్‌లోని లైట్‌ను అడ్డుకోనంత వరకు తక్కువ స్థాయి పవర్‌ను సురక్షితంగా పంపించవచ్చని చెప్పారు. ఎలా పనిచేస్తుంది? డిస్ట్రిబ్యూటెడ్ లేజర్ ఛార్జింగ్ అనేది కొంత వరకు సంప్రదాయ లేజర్ లాగానే పని చేస్తుంది. ఒకే వస్తువులో లేజర్ పరికరాలను అమర్చకుండా.. ట్రాన్స్మిటర్, రిసీవర్ రెండు వేరువేరుగా ఉంటాయి. ఈ రెండు ఒకే లైన్లో ఉండి లేజర్ లైట్ అనుసంధానమవుతే.. ఈ వ్యవస్థ లైట్ ఆధారిత పవర్‌ను లోడ్‌కు సరఫరా చేస్తుంది. ఒకవేళ ట్రాన్స్మిటర్, రిసీవర్ల మధ్య ఏదైనా అడ్డుపడితే ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా పవర్ సేఫ్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. పరిశోధకులు రిసీవర్, ట్రాన్స్మిటర్లను 30 మీటర్ల దూరం వేరు చేశారు. ట్రాన్స్మిటర్ ఎర్బియం-డోప్డ్ ఫైబర్ యాంప్లిఫైయర్ ఆప్టికల్ సోర్స్‌తో తయారు చేశారు. రిసీవర్ యూనిట్లో రెట్రో రిఫ్లెక్టర్, ఆప్టికల్ సిగ్నల్‌ను ఎలక్ట్రికల్ పవర్‌గా మార్చే ఫోటోవోల్టాయిక్ సెల్, పవర్ డెలివరీ అవుతున్నప్పుడు ప్రకాశించే ఎల్ఈడీ ఉన్నాయి. ఈ వ్యవస్థ విజయవంతంగా విద్యుత్తును ట్రాన్స్ఫర్ చేసి చూపించింది. ఇదీ చదవండి: వైద్య చరిత్రలో మరో అద్భుతం... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం -
ఎలక్ట్రిక్ వాహనాలు: ఇక ఆ దిగులే అవసరం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న కాలమంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. చార్జింగ్ పాయింట్లు, మైలేజీ, పేలుళ్లు లాంటి సంఘటనలు నమోదవుతున్నప్పటికీ, పెరుగుతున్న కాలుష్య భూతాన్ని నివారించేందుకు ఈవాహనాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలో మీరట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికారు. ఈ-వాహనాలు డ్రైవింగ్‌లో ఉండగానే చార్జింగ్ చేసుకోవచ్చు. వైర్లెస్ మొబైల్ ఛార్జర్ లాంటి టెక్నాలజీతో అచ్చం మొబైల్స్ లాగానే వీటిని చార్జ్ చేసుకోవచ్చన్నమాట. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం సాగర్ కుమార్, రోహిత్ రాజ్‌భర్ అనే ఇద్దరు స్టూడెంట్స్ వైర్లెస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ సిస్టంను డెవలప్ చేశారు. ఈ సిస్టంలో రోడ్డుపక్కన టవర్లు ఏర్పాటు చేసి కారులో రిసీవర్ ఏర్పాటు చేస్తామని సాగర్ తెలిపారు. కారు టవర్ పరిధిలోకి రాగానే, కారు బ్యాటరీ ఛార్జ్ అవ్వడం ప్రారంభమవుతుంది. రిసీవర్ పరిధి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, దాని వేగాన్ని పెంచుతుందని వెల్లడించారు. ఇది వైర్లెస్ మొబైల్ ఛార్జర్ లాంటిదని చెప్పారు. విద్యుదయస్కాంత శక్తి వ్యవస్థ ఆధారంగా ఈ టెక్నిక్ పనిచేస్తుందని రీజనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త మహదేవ్ పాండే తెలిపారు. తద్వారా డీజిల్, పెట్రోల్ వాహనాల మాదిరిగానే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఎక్కువ దూరం ప్రయాణించడమేకాదు డ్రైవింగ్‌లో ఉండగానే ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పర్యావరణాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినప్పటికీ, ఛార్జింగ్ పాయింట్లు పరిమితంగా ఉండడం సమస్యగా మారిందని సాగర్ రోహిత్ చెప్పుకొచ్చారు. వాహనాలు ఎక్కువ దూరం వెళ్లలేక పోతున్న కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారనీ, అందుకే ఈ ఆలోచన చేశామ చెప్పారు. తమప్రతిపాదనకు నీతి ఆయోగ్‌కు పంపించామన్నారు. వైర్లెస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ సిస్టం ఆలోచన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని రోహిత్ చెప్పారు. అయితే ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా తమ ప్రాజెక్ట్‌కు లభించిన సహాయంతో ప్రస్తుతం పని సులభంగా జరుగుతోందని రోహిత్ వెల్లడించారు. మరోవైపు తమ విద్యార్థుల ఆవిష్కరణపై ఎంఐఈటీ వైస్-ఛైర్మన్ పునీత్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. నూతన ఆవిష్కరణలకు తమ విద్యార్థులకు అన్ని సహాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. -
పార్క్ చేస్తే చాలు..కారు ఇట్టే ఛార్జింగ్ అవుతుంది..!
పని మీదమీరోషాపింగ్ మాల్‌కు వెళ్లారు. పార్కింగ్‌లో మీ ఎలక్ట్రిక్ కారు పెట్టేసి మాల్ లోపలికి వెళ్లారు. షాపింగ్ చేసుకుని వచ్చేసరికి కారు ఫుల్‌గా చార్జయిందనుకోండి. అది కూడా ఎలాంటి వైర్ కనెక్షన్ లేకుండా. భళే ఉంటుంది కదా! అచ్చం ఇలాంటి వైర్లెస్ చార్జింగ్ కార్లపైనే వోల్వో కార్ల సంస్థ ప్రయోగాలు చేస్తోంది. కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అసలు పార్కింగ్ ప్లేస్‌లో పెడితే కార్లు ఎలా చార్జింగ్ అవుతాయి, దాని వెనకుండే మెకానిజం ఏంటి, వైర్లెస్ చార్జింగ్‌తో ఉపయోగాలేంటి... తెలుసుకుందామా.. కారు ఎలా చార్జ్ అవుతుంది? ► కారును చార్జ్ చేసేందుకు చార్జింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన చార్జింగ్ ప్యాడ్ (బ్లూ చతురస్త్రం)పై పార్క్ చేయాలి. ఆ చార్జింగ్ ప్యాడ్ నుంచి కారుకు విద్యుత్ శక్తి అందుతుంటుంది. ఆ శక్తిని గ్రహించి బ్యాటరీని చార్జ్ చేయడానికి కారు భాగంలో ముందు టైర్ల దగ్గర రిసీవర్ ఉంటుంది. కారులో ఉండే 360 డిగ్రీ కెమెరాతో డ్రైవర్ కారు రిసీవర్‌ను సరిగ్గా చార్జింగ్ ప్యాడ్‌పైకి తీసుకురావొచ్చు. స్వీడన్‌లోని గోథెన్బర్గ్ సిటీలో గత మూడేళ్లుగా ఈ వైర్లెస్ చార్జింగ్ ప్రయోగాలను వోల్వో చేస్తోంది. ఇందుకోసం వోల్వో ఎక్స్‌సీ40 ఎస్యూవీ ఎలక్ట్రిక్ ట్యాక్సీలను వాడుతోంది. ► వోల్వో వైర్లెస్ చార్జింగ్ శక్తి దాదాపు 40 కిలోవాట్లు. అంటే 11 కిలోవాట్ల ఏసీ వైర్డ్ చార్జర్‌తో పోలిస్తే 4 రెట్లు వేగంగా కారు చార్జ్ అవుతుంది. అలాగే 50 కిలోవాట్ల డీసీ వైర్డ్ చార్జర్‌తో ఎంత వేగంగానైతే కారు చార్జ్ అవుతుందో అంతే వేగంతో వైర్‌లెస్‌తో చార్జ్ చేయొచ్చు. రోజుకు 12 గంటలు, ఏడాదికి లక్ష కిలోమీటర్లు తిరిగినా వాహనం మన్నికగా ఉంటుంది. వైర్లెస్, ఎలక్ట్రిక్ కాబట్టి పర్యావరణ హితం కూడా. పైగా కేబుల్‌తో చార్జ్ చేసే అవసరం ఉండదు. వైర్లెస్ చార్జింగ్‌తో ఉపయోగాలేంటి? ప్రస్తుతం చార్జింగే పెద్ద సమస్య పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే మార్కెట్లోకి ఎన్ని కొత్త వాహనాలు వస్తున్నా ప్రధాన సమస్య చార్జింగే. ఎక్కడంటే అక్కడ చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం లేకపోవడం వీటికి మైనస్. ఈ సమస్య వల్లే వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వోల్వో లాంటి కార్ల సంస్థల కొత్త చార్జింగ్ టెక్నాలజీలతో ఇలాంటి మైనస్లకు చెక్ పడుతుందేమో చూడాలి. చదవండి: ఉక్రెయిన్‌పై బాంబుల మోత..! రష్యా దాడులను చెక్ పెట్టేందుకు గూగుల్ భారీ స్కెచ్..! -
సరికొత్త టెక్నాలజీతో ఈవీ ఛార్జింగ్ సమస్యలకు చెక్!
రోజు రోజుకి టెక్నాలజీ వేగంగా మారిపోతుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ వాహనాలను నడుపుతున్న వినియోగదారులు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ ఎలక్ట్రిక్ వాహనాలను వేదిస్తున్న ప్రధాన సమస్య ఛార్జింగ్. ఈ సమస్యకు చెక్ పెడుతూ ఒక దశాబ్దం క్రితం దక్షిణ కొరియాలోని శాస్త్రవేత్తలు మొదటసారి రహదారి మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు కార్లు, బస్సులు ఆటోమెటిక్ గా ఛార్జ్ అయ్యే విధంగా మార్గాన్ని అన్వేషించారు. తాజాగా, అమెరికాలోని ఇండియానా డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేషన్(ఇండోట్), పర్డ్యూ విశ్వవిద్యాలయం సహకారంతో ప్రపంచంలోని మొట్టమొదటి వైర్ లెస్-ఛార్జింగ్ కాంక్రీట్ పేవ్ మెంట్ హైవే సెగ్మెంట్ ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా జర్మన్ స్టార్టప్ మాగ్మెంట్ అభివృద్ధి చేసిన అయస్కాంత స్వభావం గల కాంక్రీట్ ఉపయోగించనున్నారు. దీని వల్ల ఎలక్ట్రిక్ వేహికల్స్ కు బ్యాటరీ ఛార్జింగ్ సమస్య ఉత్పన్నం కాదు. ఇండియానా రాష్ట్ర గవర్నర్ ఎరిక్ జె. హోల్కోంబ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రాన్ని అమెరికా కూడలిగా పిలుస్తారు. అభివృద్ధి చెందుతున్న వాహన సాంకేతికతకు మద్దతు తెలపడం వల్ల ఇంకా రాష్ట్ర ప్రతిష్టను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఈ భాగస్వామ్యం కింద వైర్ లెస్ ఛార్జింగ్ హైవే టెక్నాలజీని అభివృద్ది చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నిధులు అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే వేసవిలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా రవాణా శాఖ పావు మైలు పొడవైన టెస్ట్ బెడ్ ను నిర్మిస్తుంది. అప్పుడు, ఇంజనీర్లు ట్రక్కులను ఛార్జ్ చేసే కాంక్రీట్ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరగడంతో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతూనే ఉందని ఇండోట్ కమిషనర్ జో మెక్ గిన్నిస్ తెలిపారు. -
Apple MacBook pro : యాపిల్ ఐప్యాడ్ ప్రో అప్ డేట్స్ ఇవే
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన బ్రాండ్స్ తో వినియోగదారుల్ని ఆకట్టుకునేలా కొత్త కొత్త అప్ డేట్స్ తో ముందుకు వస్తుంది. నివేదికల ప్రకారం,యాపిల్ సంస్థ తన కొత్త యాపిల్ ఐప్యాడ్ కు వైర్లెస్ ఛార్జింగ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ వైర్లెస్ ఛార్జింగ్ పై వర్క్ చేస్తుండగా..,వచ్చే ఏడాది నాటికి ఈ టాబ్లెట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐప్యాడ్ ప్రో మోడళ్లకు అల్యూమినియం ఎన్‌క్లోజర్ ఉంది. కానీ టెక్ దిగ్గజం మాషబుల్ వివరాల ప్రకారం..వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కోసం అల్యుమినియ ఎన్‌క్లోజర్ బదులు గ్లాస్ ఎన్‌క్లోజర్ ను అమర్చనుంది. ఐప్యాడ్ ప్రో కోసం ఆపిల్ మాగ్‌సేఫ్ పరీక్షిస్తుంది. ప్రతీ ఐఫోన్12 ఛార్జింగ్ కాయిల్స్ చుట్టూ మ్యాగ్నెట్స్ ఉంటాయి.ఇది ఫోన్‌కి మాగ్‌సేఫ్ ఛార్జర్ వినియోగించేందుకు ఉపయోగపడుతుంది. నార్మాల్గా పెట్టే ఛార్జింగ్ కంటే వైర్‌లెస్‌గా టాబ్లెట్ కు ఛార్జింగ్ పెట్టే సమయం ఎక్కువగా ఉంది. అందుకే వైర్ లెస్ ఛార్జింగ్ తో పాటూ కేబుల్ సాయంతో ఛార్జింగ్ పెట్టుకునేలా థండర్‌బోల్ట్ పోర్ట్‌ను చేర్చాలని యోచిస్తోంది.ఐపాడ్ ప్రో వెనుక భాగం నుంచి ఐఫోన్ లేదా ఎయిర్ పాడ్లు ఛార్జింగ్ పెట్టుకునేలా వెసలు బాటు కల్పించాలని యాపిల్ ప్రతినిధులు భావిస్తున్నారు. చదవండి : Apple updates : ఆపిల్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయ్ ! -
షియోమీ నుంచి సరికొత్త టెక్నాలజీ
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ షియోమీ సరికొత్త వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ "ఎంఐ ఎయిర్ ఛార్జ్"ను ఆవిష్కరించింది. పేరుకు తగ్గట్టే ఎంఐ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీతో షియోమీ యూజర్లు కేబుల్స్, ప్యాడ్లు లేదా వైర్లెస్ ఛార్జింగ్ స్టాండ్లు లేకుండా స్మార్ట్ఫోన్లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఒకేసారి రిమోట్‌గా ఛార్జ్ చేయవచ్చు. "ఒకేసారి అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఎటుంవంటి కేబుల్ సహాయం లేకుండా ఎంఐ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఇది, వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలో పెను మార్పులను తీసుకొస్తుందని ఆశిస్తున్నాం"అని షియోమి తన ట్విటర్ లో తెలిపింది.(చదవండి: రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల) ఈ వైర్లెస్ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ షియోమీ స్పేస్ పొజిషనింగ్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసినట్లు షియోమీ సీఈఓ తెలిపారు. దీనిలోని 144 యాంటెన్నాలతో కూడిన ఫేస్ కంట్రోల్ అర్రే మిల్లీమీటర్ తరంగాలు నేరుగా బీమ్‌ఫార్మింగ్ ద్వారా ఛార్జింగ్ అవసరమయ్యే స్మార్ట్‌ఫోన్‌కు వెళతాయి. దీనిలోని బిల్ట్ ఇన్ 5- ఫేస్ ఇంటర్ఫేస్ యాంటెన్నా మనం ఛార్జ్ చేయాలనుకునే డివైజ్‌ను ఖచ్చితంగా గుర్తించగలదు. ఎంఐ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ బేస్ మోడల్ ద్వారా 5వాట్ కి సపోర్ట్ చేసే అనేక పరికరాలను ఒకేసారి ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది మాయ కాదని ఇది ఒక సైన్స్ అద్భుత సృష్టి అని వీడియో చివరలో పేర్కొంది. ఇది వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది. -
సరికొత్త ఫీచర్లతో బ్లాక్‌బెర్రీ స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్ఫోన్లను గురువారం విడుదల చేసింది. బ్లాక్‌బెర్రీ ఎవాల్వ్, ఎవాల్వ్ ఎక్స్ డివైస్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎవాల్వ్ స్మార్ట్‌ఫోన్ ధర ను రూ.24,990 గా, ఎవాల్వ్ఎక్స్ ధరను రూ.34,990గాను నిర్ణయించింది. ఎవాల్వ్ ఎక్స్ స్మార్ట్ఫోన్లు ఆగస్టు చివరినాటికి, ఎవాల్వ్ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ నాటికి ప్రత్యేకంగా అమెజాన్‌లో నియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు వీటిపై జియో రూ.3,950 క్యాష్‌బ్యాక్‌ను అందివ్వనుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోళ్లపై 5శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. భారీ బ్యాటరీ, 18:9 రేషియో బెజెల్‌లెస్ స్క్రీన్, వైర్‌లైస్ చార్జింగ్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్‌తో వస్తున్న తొలి బ్లాక్ బెర్రీ మొబైల్స్‌గా ఇవి నిలవనున్నాయి. మొమరీ విస్తరణకు సంబంధించి ఎవాల్స్లో 4జీబీ ర్యామ్‌ను, 256 ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌ను అవకాశాన్ని అందిస్తోంది. ఇది తప్ప ఈ రెండు స్మార్ట్ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఎవాల్వ్ ఎక్స్ ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13+13 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ -
ఐఫోన్ 8.. మరో ఆసక్తికర ఫోటో
ఆపిల్ ఐఫోన్8.. తన 10 వార్షికోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి విడుదల కాబోతున్న స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల గురించి టెక్ వర్గాలు, ఐఫోన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ వైపు నుంచి ఐఫోన్ 8 పై వస్తున్న లీకేజీలు అన్నీ ఇన్నీ కావు. రోజుకో వార్త ఐఫోన్ ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంపొందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్‌తో వస్తుందంటూ ఆ సంస్థ ప్రతినిధి గతేడాది పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోన్‌కు పవర్ అందించే వైర్లెస్ ఛార్జింగ్ మెకానిజానికి సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనాలోని మోస్ట్ పాపులర్ మీడియా సైట్ వైబో ఈ ఫోటోలను విడుదల చేసింది.. డివైజ్ గ్లాస్ వెనుకాల ఈ వైర్లెస్ ఛార్జర్ కాంపొనెంట్ ఉంటుందట. ఇది డివైజ్‌కు, తన ప్లాట్‌ఫామ్‌కు మధ్య ప్రేరక శక్తిని బదిలీచేస్తుందని తెలుస్తోంది. మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 8తో పాటు అప్‌గ్రేడ్ కాబోతున్న ఐఫోన్ 7కు, ఐఫోన్ 7ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు కూడా వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఉండబోతుందట. ఈ ఏడాది రాబోతున్న ఐఫోన్లన్నింటికీ వైర్లెస్ ఛార్జింగ్ సామర్థ్యాలను ఆపిల్ కల్పిస్తుందని కూడా వెల్లడవుతోంది. సెప్టెంబర్‌లో జరుగబోయే స్పెషల్ ఈవెంట్లో ఆపిల్, తన ఐఫోన్ 8ను ప్రవేశపెట్టబోతుంది. దాంతో పాటు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్ స్మార్ట్ఫోన్లు కూడా లాంచ్ కాబోతున్నాయి. -
గదిలో ఉన్న అన్ని పరికరాలకు ఒకేసారి చార్జింగ్
వాషింగ్టన్ : రూమ్‌లో ఎక్కడున్నా వైర్లెస్ విధానం ద్వారా ఒకే సారి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలకు చార్జింగ్ పెట్టుకునే సరికొత్త విధానాన్ని డిస్నీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిద్వారా ఒకేసారి సెల్ఫోన్లు, ఫ్యాన్లు, లైట్లను రీచార్జ్ చేయవచ్చు. ఈ నూతన ఆవిష్కరణలో విద్యుత్ శక్తి వైఫై తరంగాల మాదిరిగా మారుతుందని డిస్నీ రీసెర్చ్ సెంటర్ ప్రధాన పరిశోధక శాస్త్రవేత్త అలెన్ సన్ శాంపిల్ పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ ఫలితంగా భవిష్యత్తులో రోబోట్లు, మొబైల్ పరికరాల వంటి వాటిలో బ్యాటరీలు, వైర్లు అవసరం లేకుండా చేయవచ్చని అలెన్ సన్ తెలిపారు. ఈ వైర్లెస్ పవర్‌ను సాధారణ గది పరిమాణానికి సరఫరా చేయగలుగుతున్నామని, కాని దీన్ని ఒక చిన్న బొమ్మ స్థాయికి తగ్గించడంకానీ, ఒక పెద్ద వేర్‌హౌస్ స్థాయికి పెంచడంగాని చేయలేకపోతున్నామని, ఈ విషయంలో పురోగతి సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. వైర్లెస్ పవర్ ట్రాన్స్ మిషన్ అనేది దీర్ఘకాలిక సాంకేతిక స్వప్నమని అలెన్సన్ అన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త నికోలా టెస్లా 1980లో వైర్లెస్ లైటింగ్ సిస్టంను కనుగొన్నారని, ఈ విధానంతో దూర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయడం, గృహాలకు వైర్లెస్ విధానం ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అలెన్ సన్ చెప్పారు. -
ఐ ఫోన్ 8 ఫీచర్లపై కొత్త రూమర్లు
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ మేకర్ యాపిల్ తరువాతి ఫోన్ ఐ ఫోన్ 8 పై అనేక అంచనాలు ఇప్పటికే మార్కెట్లో నెలకొన్నాయి. ఫోన్ లవర్స్ లో విపరీతమైన ఆసక్తి రేపుతున్న ఐ ఫోన్ 8 ఫీచర్స్ పై తాజాగా మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఐ ఫోన్లతో హల్ చల్ చేస్తున్న యాపిల్ వార్షికోత్సవ ఎడిషన్‌గా మూడు మోడల్స్ ఐ ఫోన్లను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఐ ఫోన్ 8 లేదా ఐ ఫోన్ ఎక్స్ తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం తాజా యాపిల్ స్మార్ట్‌ఫోన్ 7తో పోలిస్తే వీటిని మరింత పవర్ ఫుల్ గా రూపొందిస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్స్‌తో తీసుకురానుంది. ఈ ఫీచర్లు ఇప్పుడు ఆన్లైన్లో జోరుగా వైరల్ అవుతున్నాయి. వైర్లెస్ చార్జర్ , అరగంట పాటునీళ్లలో నానినా పాడుకాని వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో పాటు కొత్తగా 3డీ టచ్ మాడ్యుల్ జోడించనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎడిషనల్ గ్రాఫైట్ షీట్ ను అదనపు ఫీచర్ గా చేర్చింది. ఓవర్ హీటింగ్ నుంచి ఫోన్ ను కాపాడేందుకుగాను ఎడిషనల్ గ్రాఫైట్ షీట్ తో ఐ ఫోన్ 8 ను డిజైన్ చేసిందట. కాగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కొత్త ఆఫిల్ ఐ ఫోన్ -8 ఫీచర్స్ మొత్తం గ్లాస్ బాడీ, హై క్వాలిటీ గొరిల్లా గ్లాస్ , లిక్విడ్ మెటల్ ఫ్రేమ్ 6.9 ఎంఎం మందం 5.8 అంగుళాల ఓఎల్ఈడీ ఎడ్జ్ డిస్ప్లే, వైర్లెస్ చార్జింగ్, టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ రీడర్ టెక్నాలజీ, స్మార్ట్ కనెక్టర్ డ్యూయల్ 12 మెగా పిక్సల్ యాంగిల్, టెలీఫోటో లెన్స్ 3డీ కెమేరా టెక్నాలజీ పొందుపర్చినట్టు తెలుస్తోంది. అయితే ఇతర ఐ ఫోన్లతో పోలిస్తే వైర్ లెస్ చార్జర్ ఫీచర్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. వైర్ లెస్ చార్జింగ్ ప్లేట్ ద్వారా దాదాపు 15 అడుగుల దూరంనుంచి దీన్ని చార్జ్ చేసుకోవచ్చని ఇటీవల రూమర్లువచ్చాయి. ఇదే నిజమైతే బ్యాటరీ పేలుళ్లతో బెంబేలెత్తుతున్న వినియోగదారులకు 3డీ టచ్ మాడ్యూల్ ఫీచర్ నిజంగా శుభవార్తే. అలాగే వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ పెద్ద విశేషంగా నిలవనుంది.