ఐ ఫోన్ 8 ఫీచర్లపై కొత్త రూమర్లు
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ మేకర్ యాపిల్ తరువాతి ఫోన్ ఐ ఫోన్ 8 పై అనేక అంచనాలు ఇప్పటికే మార్కెట్లో నెలకొన్నాయి. ఫోన్ లవర్స్ లో విపరీతమైన ఆసక్తి రేపుతున్న ఐ ఫోన్ 8 ఫీచర్స్ పై తాజాగా మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఐ ఫోన్లతో హల్ చల్ చేస్తున్న యాపిల్ వార్షికోత్సవ ఎడిషన్‌గా మూడు మోడల్స్ ఐ ఫోన్లను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఐ ఫోన్ 8 లేదా ఐ ఫోన్ ఎక్స్ తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం తాజా యాపిల్ స్మార్ట్‌ఫోన్ 7తో పోలిస్తే వీటిని మరింత పవర్ ఫుల్ గా రూపొందిస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్స్‌తో తీసుకురానుంది. ఈ ఫీచర్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో జోరుగా వైరల్ అవుతున్నాయి.
వైర్‌లెస్ చార్జర్ , అరగంట పాటునీళ్లలో నానినా పాడుకాని వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో పాటు కొత్తగా 3డీ టచ్ మాడ్యుల్ జోడించనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎడిషనల్ గ్రాఫైట్ షీట్ ను అదనపు ఫీచర్ గా చేర్చింది. ఓవర్ హీటింగ్ నుంచి ఫోన్ ను కాపాడేందుకుగాను ఎడిషనల్ గ్రాఫైట్ షీట్ తో ఐ ఫోన్ 8 ను డిజైన్ చేసిందట.
కాగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కొత్త ఆఫిల్ ఐ ఫోన్ -8 ఫీచర్స్ మొత్తం గ్లాస్ బాడీ, హై క్వాలిటీ గొరిల్లా గ్లాస్ , లిక్విడ్ మెటల్ ఫ్రేమ్ 6.9 ఎంఎం మందం 5.8 అంగుళాల ఓఎల్ఈడీ ఎడ్జ్ డిస్‌ప్లే, వైర్‌లెస్ చార్జింగ్, టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ రీడర్ టెక్నాలజీ, స్మార్ట్ కనెక్టర్ డ్యూయల్ 12 మెగా పిక్సల్ యాంగిల్, టెలీఫోటో లెన్స్ 3డీ కెమేరా టెక్నాలజీ పొందుపర్చినట్టు తెలుస్తోంది. అయితే ఇతర ఐ ఫోన్లతో పోలిస్తే వైర్ లెస్ చార్జర్ ఫీచర్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. వైర్ లెస్ చార్జింగ్ ప్లేట్ ద్వారా దాదాపు 15 అడుగుల దూరంనుంచి దీన్ని చార్జ్ చేసుకోవచ్చని ఇటీవల రూమర్లువచ్చాయి. ఇదే నిజమైతే బ్యాటరీ పేలుళ్లతో బెంబేలెత్తుతున్న వినియోగదారులకు 3డీ టచ్ మాడ్యూల్ ఫీచర్ నిజంగా శుభవార్తే. అలాగే వైర్‌లెస్ చార్జింగ్ టెక్నాలజీ పెద్ద విశేషంగా నిలవనుంది.