వివాహేతర సంబంధం.. మహిళకు బెత్తం దెబ్బలు | woman canned in indonesia for illicit relation | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. మహిళకు బెత్తం దెబ్బలు

Published Tue, Nov 29 2016 11:36 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

వివాహేతర సంబంధం.. మహిళకు బెత్తం దెబ్బలు

వివాహేతర సంబంధం.. మహిళకు బెత్తం దెబ్బలు

వేరే పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఇండోనేషియాలో ఓ మహిళను బహిరంగంగా బెత్తంతో కొట్టారు. బాధతో ఆమె విలవిల్లాడుతూ గట్టిగా ఏడుస్తుంటే.. చుట్టూ ఉన్నవాళ్లంతా వినోదం చూస్తూ ఉండిపోయారు. ఇండోనేషియాలో ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలుచేస్తారు. దాని ప్రకారం జూదం ఆడినా, మద్యం తాగినా, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా, స్వలింగ సంపర్కానికి పాల్పడినా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. తాజాగా ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులను వివిధ నేరాల కింద పట్టుకున్న అధికారులు.. రాష్ట్ర రాజధాని అయిన బందా అసె ప్రాంతంలో ఓ మసీదు వద్ద అందరూ చూస్తుండగా బెత్తంతో దెబ్బలు కొట్టారు. వాళ్లలో 34 ఏళ్ల మహిళ తన భర్త కాని వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆమెను తీవ్రంగా కొట్టారు. ఆమెను ఏడుసార్లు బెత్తంతో కొట్టారు. కొట్టిన వ్యక్తి కళ్లు తప్ప మిగిలిన శరీరం మొత్తం దుస్తులతో నిండిపోయి ఉంది. దెబ్బలు కొడుతుంటే తనకు చాలా నొప్పిగా ఉందని ఆమె భరించలేక ఏడ్చేసింది. ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించిన వ్యక్తికి కూడా ఏడు దెబ్బల శిక్ష విధించారు. 
 
19 ఏళ్ల వయసున్న ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు కూడా పెళ్లి కాకుండానే లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు వారికి 100 చొప్పున బెత్తం దెబ్బల శిక్ష పడింది. మరోవ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు అతడికి 22 దెబ్బలు పడ్డాయి. అతడి భాగస్వామి గర్భవతి కావడంతో.. ఆమెకు ఇంకా ఏశిక్ష విధించేదీ చెప్పలేదు. సాధారణంగా గర్భిణులకు ఇలాంటి శిక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. అసె రాష్ట్రానికి 2001 నుంచి ప్రత్యేక స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి అక్కడ షరియా చట్టం అమలులో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement