పాప్ సింగర్ జే చో, కోమా నుంచి బయటపడిన యువతి
సంగీతానికి రాళ్లను సైతం కరిగించే శక్తి ఉందంటారు. ఆ మాట ఎంతవరకు నిజమో తెలీదు గానీ.. 4 నెలలుగా కోమాలో ఉన్న ఓ అమ్మాయిని స్పృహలోకి వచ్చేలా చేసింది మాత్రం ఒక పాటే. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలోని సన్నివేశాన్ని గుర్తుచేసే..ఈ అరుదైన సంఘటన చైనాలో చోటుచేసుకుందని స్థానిక వార్తా పత్రిక పేర్కొంది. ఇంతకీ విషయమేమిటంటే.. చైనాకు చెందిన 24 ఏళ్ల యువతి గత నవంబర్‌లో కోమాలోకి వెళ్లింది. రక్తంలో ఆక్సీజన్ సరఫరా సరిగా లేనందున మెదడు పనిచేయకపోవడంతో ఆమెకు ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు.
అప్పటి నుంచి ఆస్పత్రిలో ఉన్న ఆమెకు ఓ నర్స్ సేవలు అందిస్తోంది. ఎలాగైనా ఆమెలో చలనం కలిగించాలనుకున్న నర్స్.. ప్రతీరోజూ జోకులు చెప్తూ ఆమెను నవ్వించడానికి ప్రయత్నించేది. అందులో భాగంగానే ఓ రోజు తనకెంతో ఇష్టమైన.. తైవాన్ పాప్‌స్టార్ జే చో ‘రోజీమేరీ’ పాటను ప్లే చేసింది. ఆ పాట వినగానే యువతి నెమ్మదిగా కళ్లు తెరిచింది. ఈ విషయాన్ని గమనించిన నర్స్.. డాక్టర్‌ను పిలుచుకొని వచ్చింది. నాలుగు నెలలుగా జీవచ్చవంలా పడి ఉన్న పేషెంట్ ఇలా స్పృహలోకి రావడంతో ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆమెకు మెరుగైన చికిత్సను అందించి తిరిగి మామూలు మనిషయ్యేలా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment