
భార్య పని చేయడం లేదని..
తన భార్య ఇంటి పని, వంట పని సరిగా చేయట్లేదంటూ.. కుటుంబ కష్టాలపై ఓ భర్త కోర్టుకెక్కాడు. 'మిస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ది ఫ్యామిలీ' అంటూ తాను పడుతున్న కష్టాలను వివరించాడు. అయితే ఇదే సందర్భంలో భర్త వల్ల ఆమె ఆరేళ్లుగా నాలుగు గోడల మధ్య అనుభవిస్తున్న నరకం కూడా బయటపడింది.
40 ఏళ్ల వయసున్న తన భార్య.. పనిచేయడంలో వెనుకబడిందని, కుటుంబాన్ని సరిగా చూడట్లేదని ఓ భర్త కోర్టుకెక్కాడు. వంట పనిలోనూ, ఇల్లు శుభ్రపరిచే విషయంలోనూ ఆమె పరమవీక్ అంటూ ఫిర్యాదు చేశాడు. తన భార్య అపరిశుభ్రతను, బద్ధకాన్ని భరింలేకపోతున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో జీవించలేకపోతున్నానని వాపోయాడు. రెండేళ్లుగా ఈ పరిస్థితులతో తీవ్రకష్టాలు అనుభవిస్తున్నట్లు కోర్టుకు తెలిపాడు.
అయితే స్థానికులు మాత్రం అతడి ఆరోపణలు నిజం కాదంటున్నారు. భర్త తరచుగా భార్యను వేధిస్తుంటాడని, కొని తెచ్చిన వంటకాలను దూరంగా విసిరి పారేస్తాడని, ఆమే వంట చేయాలంటాడని తెలిపారు. లేదంటే ఆమెను శారీరకంగా హింసిస్తుంటాడని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టుకు పత్రాలు సమర్పించిన బాధితురాలు.. తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించింది. భర్త చేస్తున్న ఫిర్యాదులు నిజం కాదంది. ఆరేళ్లుగా అతనితో నరకం అనుభవిస్తున్నాని, కోర్టుకు వచ్చేముందు కూడా తనను కొట్టాడని తెలిపింది. ఇటలీ సొన్నినో లాజియోకి చెందిన ఆమె... ఆరేళ్లుగా భర్త వేధింపులను భరిస్తూ కాలం గడుపుతున్నానని, తనపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని న్యాయస్థానానికి విన్నవించింది. ప్రస్తుతం ఆ భార్య భర్తల వివాదంలో విచారణను కోర్టు అక్టోబర్ నాటికి వాయిదా వేసింది.