
ఓ ప్రేమ కబురు ప్రాణం తీసింది!
లండన్: ఓ తీయని ప్రియుని ప్రేమ కబురు ప్రియురాలి ప్రాణాలను తీసింది. పెళ్లి చేసుకుంటాననే ప్రియుడి తీపి వార్త కాస్తా ఓ యువతికి శాపంగా మారింది. లండన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బల్గేరియాకు చెందిన దిమిత్రినా దిమిత్రోవా(29) ఓ యువకునితో ప్రేమలో పడింది. ఆ క్రమంలో గత కొంతకాలంగా వారు ప్రేమలో విహరిస్తున్నారు. ఇక పెళ్లి సమయం వచ్చేసిందని భావించిన ఆ ప్రియుడు పెళ్లి ప్రస్తావనను ప్రియురాలి చెంతకు చేరవేయాలని భావించాడు. ఈ క్రమంలోనే ప్రియురాలిని ఆహ్వానించాడు.
ఇద్దరు కలిసి ఏకాంతంగా ఉన్న ఒక కొండపై కలిశారు. కాసేపు ప్రేమ కబుర్లు చెప్పుకున్న అనంతరం తన మనసులో మాటను చెప్పాడు ఆ యువకుడు.'నిన్ను నేను త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నువ్వు సిద్ధమేనా'అని ఆ యువకుడు ప్రియురాలికి తన మనసులో విషయాన్ని చెప్పాడు. దీంతో ఆ యువతి ఆనందంతో ఎగిరి గంతులేస్తూ ఊహల్లో తేలియాడింది. ఇక అది కొండ కావడంతో అదుపు తప్పి కిందకు జారింది.ఆ కొండ 60 ఏడుగులు ఎత్తు కావడంతో ఆమె తీవ్రంగా గాయపడటమే కాకుండా గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది.