బీచ్లో స్నానం చేద్దామని మహిళ వెళ్లగానే..
ఫ్లోరిడా: ఫ్లోరిడాలో అనూహ్య సంఘటన జరిగింది. బోకా రాటోన్ సముద్ర తీరంలోని బీచ్లో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ఓ యువతిని ఓ రెండడుగుల షార్క్ చేప అమాంతం కరిచేసింది. దాని పళ్లను పూర్తిగా ఆమె కుడి చేతి మోచేయి, మణికట్టు మధ్య భాగంలో దించి అలాగే కరిచిపట్టుకొని ఉండిపోయింది. దాంతో ఆమె భయంతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
పైగా చుట్టుపక్కల వారు ఆమెను సమీపించి ఆ షార్క్ను ఎంత విడిపించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో అక్కడి అత్యవసరం విభాగం 911కు ఫోన్ కాల్ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది ఆ బీచ్కు చేరుకున్నారు. ఆమె చేతిని అలాగే కరిచిపట్టుకొని ఉన్న ఆ షార్క్ చేపను కొట్టి చంపారు. అయినప్పటికీ అప్పటికే దాని పళ్లు పూర్తిగా ఆమె చేతిలోకి దిగిపోయి ఉండటంతో ఆ షార్క్తో సహా ఆస్పత్రికి తీసుకెళ్లారు. 23 ఏళ్ల మహిళకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటనతో అక్కడ బీచ్లో సరదాగా గడిపే వారంతా బిత్తరపోయారు.