
మహాద్భుతం ఈ హోటల్
మక్కా: సాధారణంగా హోటల్ అంటే ఓ వందనో లేదంటే ఓ వెయ్యో గదులతో ఉంటుంది. కానీ, ఏకంగా పది వేల గదులతో ఉంటే.. అందులో 70 రెస్టారెంట్లు ఉంటే.. ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజమే పది వేల రూములు, డెబ్బై రెస్టారెంట్లతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ వచ్చే ఏడాది తొలిరోజుల్లో ప్రారంభం కానుంది.
దీనిని సంపన్న దేశం అయిన సౌదీ అరేబియాలోని మక్కాలో నిర్మించారు. అబ్రాజ్ కుడాయ్ అనే పేరుగల ఈ హెటల్ ని దాదాపు 3.5 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు. అనుకున్న ప్రకారం అన్ని పనులు పూర్తయితే.. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి వస్తుంది. దీనిని సౌదీ అరేబియా ఆర్థికశాఖనే స్వయంగా నిర్మించగా దీనికి దార్ అల్-హంద్షా గ్రూప్ డిజైన్ ఇచ్చింది. ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాకు రెండు కిలో మీటర్ల దూరంలో ఈ నిర్మాణం కొలువు దీరింది.