
మీ సంపాదనెంతో ట్విట్టర్ చెప్పేస్తుంది!
వాషింగ్టన్: నడిచే తీరు.. చదివే పుస్తకాలు.. మాట్లాడే పద్ధతి వారి వారి మనోభావాలను చెప్తుందన్నది మనం విన్న విషయమే. కానీ సామాజిక మాధ్యమం... మైక్రో బ్లాగింగ్ సైట్... ట్విట్టర్... ఏకంగా యూజర్ల ఆదాయం ఎంతో చెప్పేంస్తుందంటున్నారు పరిశోధకులు. అత్యధిక సంపాదన ఉన్నవారు ట్విట్టర్లో తమ ఆగ్రహాన్ని, భయాన్ని ఎక్కువగా వ్యక్తం చేస్తుంటారని... ఆశావాదులు తక్కువ సగటు ఆదాయాన్ని కలిగి ఉంటారని గుర్తించారు.
పెన్సిల్ వేనియా, జాన్ హాప్కిన్స్ విశ్వ విద్యాలయాలు, యూనివర్శిటీ కాలేజ్ లండన్ మరియు మైక్రోసాఫ్ట్ రీసెర్స్ కు సంబంధించిన పరిశోధకులు ట్విట్టర్ వినియోగదారుల మనోభావాల పై పలు పరిశోధనలు జరిపారు. వినియోగదారులు వాడే పదాలను, భాషను బట్టి వారి ఆదాయాన్ని, వృత్తిని తెలుసుకోవచ్చని నిర్ధారించారు.
లండన్ లోని జాబ్ కోడ్ సిస్టమ్ తొమ్మిది రకాలుగా ఉంటుంది. ప్రతి రకం నుంచి పరిశోధక బృందంలోని ప్రతినిధులు ఓ శాంపిల్ ను సేకరించి ఆ క్రమాన్ని బట్టి వారి వారి సగటు ఆదాయాన్ని గుర్తించారు. ట్విట్టర్ లో వివరాలు అస్పష్టంగా ఉండే వారిని మినహాయించి, మిగిలిన 5,00,191 ట్విట్టర్ వినియోగదారులు పోస్టు చేసిన పది మిలియన్లకు ట్వీట్లపై అధ్యయనకారులు పరిశోధనలు జరిపారు.
ఇటువంటి అధ్యయనాల్లో ఇది అతిపెద్ద డేటా సెట్ అని పెన్సిల్వేనియా పోస్ట్ డాక్టోరియల్ పరిశోధకుడు డానియెల్ ప్రయోటక్ పియాట్రో తెలిపారు. యూజర్లు ఉపయోగించే పదాలను ఓ క్రమ పద్ధతిన గణించి, వారి భాషా విధానాన్ని విశ్లేషించారు. అంతేకాదు ఆ పదాల గుణాలను విభజించారు. ఎక్కువశాతం మంది ఒకేలాంటి, పదాలను వాడటంతోపాటు... ఒకరికొకరు సరిపోలిన పదాలను వాడినట్లుగా పరిశోధకులు గమనించారు. ఇప్పటికే జరిపిన పలు అధ్యయనాల ద్వారా వయసు లింగ బేధాలను గుర్తించగా... వాటి ఆధారంగా.. ప్రస్తుతం వినియోగదారుల ఆదాయాన్ని సైతం నిర్ధారించినట్లు పరిశోధకులు తెలిపారు.
ఎవరైతే ట్విట్టర్ లో ఎక్కువ భయాన్ని, ఆందోళనను, కోపాన్ని వ్యక్త పరుస్తారో వారు అధిక ఆదాయం ఉండేవారుగానూ, ఆశావాదాన్ని వినిపించేవారు తక్కువ ఆదాయం కలిగి ఉండేవారుగాను పరిశోధకులు గ్రహించారు. అలాగే బ్రాకెట్లలో సరళమైన పదాలను వాడేవారు తక్కువ ఆదాయం కలిగి ఉండేవారుగానూ... తరచుగా రాజకీయాలు, సంస్థల గురించి చర్చించేవారు అధిక ఆదాయం కలిగి ఉండేవారుగానూ పరిశోధకులు నిర్ధారించారు.