పాఠశాలలో ప్రత్యేక తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయులు
శాంతినగర్ : ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన ఉండాలని, వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఉపాధ్యాయులు. ఉమ్మడి వడ్డేపల్లి మండలంలో మొత్తం 630 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వడ్డేపల్లి మండలంలో 5 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 1 ఎయిడెడ్ పాఠశాల, మరో కస్తూర్బా పాఠశాల ఉంది. రాజోలి మండలంలో 3 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎంపీహెచ్‌ఎస్, ఉర్దూ మీడియం పాఠశాల ఉంది. ఆయా పాఠశాలల్లో పది చదువుతున్న విద్యార్థులంతా మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించా లని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండటంతో ప్రత్యేక ప్రణాళికతో ఉపాధ్యాయులు విద్యాబోధన చేపట్టారు.
ముగ్గురు విద్యార్థుల చొప్పున
ఆయా పాఠశాలల్లో చదువులో వెనుకబ డిన విద్యార్థులను గుర్తించి ఒక్కో ఉపాధ్యాయుడు ముగ్గురు చొప్పున దత్తత తీసుకున్నారు. వారు పాస్‌అయ్యే బాధ్యతను ఉపాధ్యాయులు చేపట్టారు. వారం రోజులపాటు చెప్పిన పాఠాల్లోని అంశాలపై ప్రతివారం స్లిప్‌టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. అందులో రాయలేని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సాగిస్తున్నారు.
ఫిబ్రవరి నుంచి అల్పాహారం..
విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు కృషిచేస్తున్నట్లు ఎంఈఓ నర్సింహులు పేర్కొన్నారు. ఈ విషయమై కొందరు దాతలను కలిశామన్నారు. అందుకు వారు సానుకూలంగా ఉన్నారని, ఫిబ్రవరి 1నుంచి అల్పాహారం అందించి ప్రత్యేక తరగతులు కొనసాగిస్తామన్నారు.
సక్రమంగా పాఠశాలకు
విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలకు సక్రమంగా పంపాలి. పనులున్న సమయంలో పాఠశాలకు పంపకపోవడంతో పాఠాలు అర్థంగాక వెనుకబడి పోతున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
ప్రోత్సాహక బహుమతులు
విద్యార్థులను ప్రోత్సహించే దిశగా 9.5 గ్రేడ్ సాధించిన వారికి శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు హరుణ్‌రషీద్ రూ.516, సామేల్ రూ.1,116, ఊశన్న రూ.2,116, నాగేంద్రం రూ.5,116, 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు సాయిరాం రూ.10,116 ప్రోత్సాహక బహుమతులు ప్రకటించారు.
పట్టుదలతో చదువుతున్నాను..
పదిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని మమ్మల్ని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల వదిలిన అనంతరం ప్రత్యేక తరగతులు పెట్టి పాఠాలు చెబుతున్నారు. పదిలో ఎలాగైనా 9.5 జీపీఏకు పైగా మార్కులు తెచ్చుకోవాలని, పాఠశాలకు, ఉపాధ్యాయులకు మా తల్లిదండ్రులకు పేరు రావాలని పట్టుదలతో చదువుతున్నాను.
– స్వప్న, విద్యార్థి, జెడ్పీహెచ్‌ఎస్ శాంతినగర్
టాప్ మార్కులు సాధించే దిశగా బోధన
అత్యధిక మార్కులు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మా టాపర్లంతా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరారు. అయినా ఉన్నవారిని వందశాతం పాస్‌చేయించి అత్యధిక మార్కులు సాధించేదిశగా అడుగులు వేస్తున్నాం.
– నర్సింహులు, ఎంఈఓ, వడ్డేపల్లి
ప్రత్యేక తరగతులు..
ఆయా గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ప్రారంభిచారు. ఉదయం గంట, సాయంత్రం గంటపాటు తరగతులు నిర్వహిస్తూ.. విద్యాబోధన చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment