
పాలికె భేటీ దృశ్యం
సాక్షి, కర్ణాటక(బనశంకరి) : గత కొన్నేళ్ల క్రితం హత్యకు గురైన బీబీఎంపీ కార్పొరేటర్ నటరాజ్ కుటుంబానికి సహాయం చేయాలా, వద్దా? అని పాలికె నెలవారీ సమావేశంలో రభస చెలరేగింది. ఆయన కుటుంబం వీధిపాలైనట్లు బీజేపీ కట్టుకథ అల్లుతోంది, వారికి పాలికె సభ్యులు ఒకనెల వేతనం అందించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ కార్పొరేటర్ లతాఠాకూర్ పట్టుబట్టారు.మంగళవారం పాలికె సమావేశంలో నటరాజ్ కు టుంబం వీధిపాలైందని, రోడ్డుపై వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారని, పాలికె నుంచి సహాయం అందించాలని కొందరు బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో పాలికె సభ్యులందరూ ఒకనెల వేతనం సహాయంగా అందించాలని తీర్మానించారు. ఇందు కు లతాఠాకూర్ వ్యతిరేకించారు. ఆ కుటుంబం బాగానే ఉందని, కానీ వీదిపాలైనట్లు బీజేపీ సభ్యులు మాట్లాడడం సరికాదని విమర్శించారు. గతంలో బీజేపీ సభ్యుడు మహేశ్‌బాబు ప్రమాదంలో మరణించినప్పుడు పార్టీలకు అతీతంగా తామంతా సహాయం చేశామన్నారు. నటరాజ్ మామ తమ పరిస్థితి కష్టతరంగా ఉందని సహాయం చేయాలని కోరారని బీజేపీ సభ్యులు లతాఠాకూర్‌పై ఎదురు దాడిచేశారు. మేయర్ సంపత్‌రాజ్ జోక్యం చేసుకుని మృతి విషయంలో ఎవరూ రాజకీయం చేయరాదన్నారు. డిప్యూటీ మేయర్, ఇతర ముఖ్యులు కలిసి నటరాజ్ ఇంటిని సందర్శించి పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటామని మేయర్ హామీ ఇచ్చారు.
సభ ఆలస్యంపై ఆగ్రహం
బీబీఎంపీ సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావలసి ఉన్నప్పటికీ సుమారు రెండు గంటల ఆలస్యమైంది. 12.50 గంటలకు సభ ప్రారంభమైంది. సభ ఆలస్యంగా ప్రారంభం కావడం పట్ల విపక్షనేత పద్మనాభరెడ్డి తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశారు. బీబీఎంపీ నెలవారి సభకు ప్రత్యేకత ఉంది, సంపత్‌రాజ్ మేయర్‌గా ఎన్నికైనప్పటి నుంచి పాలికె సభలు ఆలస్యంగా జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. మాజీ మేయర్ శాంతకుమారి కుమారుడు వివాహానికి హాజరు కావడం వల్ల ఆలస్యమైందని మేయర్ సంపత్‌రాజ్ సమర్దించుకున్నారు. ఇక ముందు సభ నిర్ణీత సమయంలో జరుగుతుందని హామీనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment