
బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం వరుస షాక్‌లతో సతమతమవుతోంది. తాజాగా జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.హెచ్.విశ్వనాథ్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడకు అందజేశారు. సంకీర్ణ ప్రభుత్వం సరైన రీతిలో పనిచేసేందుకు గాను సిద్దరామయ్య నేతృత్వంలో ఏర్పాటైన సమన్వయ కమిటీ ఏడాది గడుస్తున్నా ఉమ్మడి ప్రణాళికను రూపొందించలేకపోయిందని మండిపడ్డారు. ఇరు పార్టీల మధ్య సమన్వయానికి సిద్ధరామయ్య చర్యలు తీసుకోలేదన్నారు. తుముకూరులో మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమి వెనుక కుట్ర ఉందని ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్‌లో ధిక్కార స్వరం
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రామలింగారెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తీసుకున్న పలు నిర్ణయాలపై మండిపడుతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్లకి, ఇతర పార్టీల నుంచి చేరిన వారికి, కాంగ్రెస్ విధానాలు తెలియని వారికి ప్రాధాన్యత ఇవ్వడమే పార్టీ ప్రస్తుత స్థితికి కారణమని ధ్వజమెత్తారు. ఇదే పరిస్థితి కొనసాగితే సీనియర్ నేతలు పార్టీలో ఉండలేరని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత రోషన్ బేగ్ సైతం ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితికి సిద్దరామయ్య, దినేశ్ రావులే కారణమని మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. సిద్దరామయ్య పొగరు వల్లే పార్టీ ఇలా తయారైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment