
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో మరోసారి అధికారం కాంగ్రెస్‌పార్టీదే అని సీఎం సిద్ధరామయ్య కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అయితే ఇందుకు ప్రతిపక్ష బీజేపీ నేతలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు కార్యకర్తలంతా ఐకమత్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహదేవపుర నియోజకవర్గంలోని రామగొండనహళ్లిలో ఏర్పాటు చేసిన ‘మనెమనెగె కాంగ్రెస్’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
‘బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పడంలో దిట్టలు. వారు అబద్ధాలను ప్రచారం చేస్తుంటే మనం ప్రజలకు నిజాలు చెప్పాలి. ప్రజలకు ఇచ్చిన 165 హామీల్లో ఇప్పటికే 155కు పైగా హామీలను నెరవేర్చింది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఈ పుస్తకంలో పొందుపరిచాము. వాటిని ప్రజలకు చేర్చే బాధ్యత కార్యకర్తలపై ఉంది. అని సీఎం అన్నారు.