CM siddaramayya
-
రెండో సీటూ కావాలి!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం సిద్దరామయ్య చాముండేశ్వరి స్థానం నుంచే పోటీ చేస్తారా? లేక ఉత్తర కర్ణాటకలోని బాదామీ నుంచి కూడా పోటీ చేయనున్నారా? ఈ విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సిద్దరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని భావించినా సీనియర్ నాయకులు ఖర్గే, మొయిలీల ఒత్తిడితో కాంగ్రెస్ అధిష్టానం ఆయనను చాముండేశ్వరి స్థానానికే పరిమితం చేసింది. బాదామీలో దేవరాజ్ పాటిల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీనిపై తన అసంతృప్తిని ఇప్పటివరకు సిద్దరామయ్య బహిరంగంగా వెల్లడించలేదు కానీ.. బాదామీ నుంచి పోటీ చేయాలన్న ఆసక్తిని వివిధ వేదికలపై వ్యక్తపరిచారు. బాదామీ నియోజకవర్గ నేతలు తనను పోటీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పలు సందర్భాలలో వ్యాఖ్యానించారు. అధిష్టానంతో చర్చలు రాహుల్ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ మొదట్నుంచీ రెండో స్థానంలో పోటీని తోసిపుచ్చింది. అయినా, బీసీల చాంపియన్‌గా పేరున్న సిద్దరామయ్యను నిరాశకు గురిచేస్తే ఫలితాలు వేరోలా ఉంటాయనే అభిప్రాయంలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అందుకే పాటిల్‌కు ఇంతవరకు బీ–ఫామ్ ఇవ్వలేదు. అటు, సీఎం రెండో సీటు కోసం అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఏడుసార్లు చాముండేశ్వరి నుంచి పోటీ చేసిన సీఎం ఐదుసార్లు గెలిచారు. ఈ సారి చాముండేశ్వరి నుంచి గెలవటం సులభం కాదనే అభిప్రాయంలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. -
కర్ణాటకకు రాష్ట్ర జెండా..
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం కోసం రూపొందించిన అధికారిక జెండాను ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఆవిష్కరించారు. ‘నాద ధ్వజ’గా పేర్కొంటున్న ఈ జెండాలో పసుపు, తెలుపు, ఎరుపు వర్ణాలతోపాటు మధ్యలో రాష్ట్ర చిహ్నమైన ‘గండభేరుండ’ ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండాలన్నది కన్నడిగుల అభిప్రాయం, ఆకాంక్ష అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. దీనిని శుక్రవారం రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించనున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు ప్రత్యేక పతాకం ఉండకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. జాతీయ జెండానే అత్యున్నతమనీ, రాష్ట్ర జెండా కంటే ఎత్తులో ఉంటుందనీ వివరించారు. కాగా, ప్రస్తుతం దేశంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేక జెండా ఉంది. -
‘మత హింస’ అమిత్ షా లక్షణం
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీ చీఫ్ అమిత్ షాపై విమర్శల తీవ్రతను పెంచారు. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం అమిత్ షాకు ఉన్న లక్షణమని సిద్ధరామయ్య ఆదివారం నాడిక్కడ విమర్శించారు. ‘కర్ణాటకలో మత హింసను రెచ్చగొట్టే చర్యల్ని మేం ఎంతమాత్రం అనుమతించం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది’ అని సిద్ధరామయ్య హెచ్చరించారు. ‘ప్రధాని మోదీ కర్ణాటకకు వచ్చి మత ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతున్నారని నేను చెప్పడం లేదు. అది అమిత్ షాకు ఉన్న లక్షణం. అది తప్ప షాకు మరొకటి తెలీదు. మత హింసనే అతను రాజకీయ వ్యూహంగా భావిస్తాడు’ అని విమర్శించారు. -
మరోసారి అధికారం కాంగ్రెస్ పార్టీకే !
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో మరోసారి అధికారం కాంగ్రెస్‌పార్టీదే అని సీఎం సిద్ధరామయ్య కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అయితే ఇందుకు ప్రతిపక్ష బీజేపీ నేతలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు కార్యకర్తలంతా ఐకమత్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహదేవపుర నియోజకవర్గంలోని రామగొండనహళ్లిలో ఏర్పాటు చేసిన ‘మనెమనెగె కాంగ్రెస్’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పడంలో దిట్టలు. వారు అబద్ధాలను ప్రచారం చేస్తుంటే మనం ప్రజలకు నిజాలు చెప్పాలి. ప్రజలకు ఇచ్చిన 165 హామీల్లో ఇప్పటికే 155కు పైగా హామీలను నెరవేర్చింది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఈ పుస్తకంలో పొందుపరిచాము. వాటిని ప్రజలకు చేర్చే బాధ్యత కార్యకర్తలపై ఉంది. అని సీఎం అన్నారు. -
‘ఇంటింటికీ కాంగ్రెస్’
సాక్షి, బెంగళూరు /వైట్‌ఫీల్డ్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా, ప్రతిపక్ష పార్టీల కంటే ముందుగానే అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నగారాను మోగించింది. రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ ఒక్కతాటి పైకి చేరారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌లకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ‘మనెమనెగె కాంగ్రెస్’ పేరిట కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. నగరంలోని మహదేవపుర నియోజకవర్గంలోని రామగొండనహళ్లిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ‘మనెమనెగె కాంగ్రెస్’ కార్యక్రమాన్ని సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కె.సి.వేణుగోపాల్, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్లు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేసిన ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేపీసీసీ నుండి ఒక కోటి పదిలక్షల రూపాయల మొత్తాన్ని ఖర్చు చేసి ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకాన్ని రాష్ట్రంలోని ఇంటింటికీ అందజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పేదలు, రైతులు, వెనకబడిన వర్గాలవారు, మైనారిటీల కోసం చేపట్టిన కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. శనివారం రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. ఇక అక్టోబర్ 15నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. స్థానికులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి..! కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం ఏర్పాటుచేసిన వేదిక సమీపంలో కొందరు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సిఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ వేణుగోపాల్, ఏఐసిసి కార్యదర్శి హరిప్రసాద్, రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ అ«ధ్యక్షుడు పరమేశ్వర్ శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విచ్చేశారు. మహదేవపుర నియోజకవర్గం హగదూరు వార్డు రామగుండనహళ్లి పాఠశాల ఆవరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఈప్లేక్సీను ఏర్పాటు చేసి స్థానికులకు టికెట్ ఇస్తే.. పార్టీ విజయానికి కృషిచేస్తామని వారు ఆఫ్లెక్సీలో పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు పరిసర ప్రాంతాల నుంచి పాదయాత్రతో చేరుకున్నారు. దూరప్రాంతాలనుంచి బీఎంటీసీ బస్సుల్లో ఈకార్యక్రమానికి జనాన్ని, కార్యకర్తలను తరలించడం కనిపించింది -
చల్లారుతున్న కా‘వేడి’...
బెంగళూరులో పలుచోట్ల సాధారణ స్థితి - సుప్రీం తీర్పు అమలు చేస్తామన్న సీఎం సిద్దరామయ్య - ఆందోళనకారులపై ఉక్కుపాదం తప్పదని వ్యాఖ్య - గాయపడిన ఓ యువకుడి మృతి కర్ణాటకకు అదనపు బలగాలు సాక్షి, బెంగళూరు/చెన్నై/న్యూఢిల్లీ: కావేరి జలవివాదంపై అట్టుడికిన కర్ణాటకలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యం గా రాజధాని బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలపై ఈ నెల 20 వరకు 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక సర్కారు అంగీకరించింది. ఈ అల్లర్ల ద్వారా రాష్ట్రంతోపాటు బెంగళూరు ప్రతిష్టకు మచ్చ ఏర్పడుతోందని, ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతామని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు.మంగళవారం కేబినెట్ అత్యవసర భేటీలో పరిస్థితిని సమీక్షించిన సీఎం.. కోర్టు నిర్ణయం అమలుచేయటం రాజ్యాంగబద్ధమని, కఠినంగా వ్యవహరించక తప్పదని స్పష్టం చేశారు. వివాదంపై కర్ణాటక సర్కారు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై కావేరి ట్రిబ్యునల్ సెప్టెంబరు 18న(ఆదివారం) తుదితీర్పు వెలువరించనుంది. కాగా, సోమవారం నాటి ఘటనలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మూడంతస్తుల భవనం నుంచి దూకి గాయపడిన కుమార్ (30)అనే యువకుడు మంగళవారం చనిపోయాడు. దీంతో ఈ వివాద మృతుల సంఖ్య రెండుకు చేరింది. సోమవారం పోలీసుల కాల్పుల్లో పాతికేళ్ల యువకుడు మరణించడం తెలిసిందే. ఈ ఇద్దరి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాలకు సిటీ బస్సులు, మెట్రోసేవలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు మినహా మిగిలిన ప్రాంతాలకు బస్సు సర్వీసులు మొదలయ్యాయి. చెదురుమదురు ఘటనలు.. బెంగళూరులో నిషేధాజ్ఞలు బుధవారం వరకు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. పలుచోట్ల పరిస్థితి అదుపులోకి వచ్చినా.. సున్నితమైన 16 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతోంది. తిగలారపాల్యలో నిన్న సగం కాలిన తమిళనాడు బస్సును ఆందోళనకారులు మంగళవారం పూర్తిగా తగలబెట్టారు. రెండ్రోజుల్లో 300 మందిని అరెస్టు చేశారు. హెగ్గనహల్లి, పట్టెగారపాల్య ప్రాంతాల్లో నిరసనకారులు రోడ్లపై టైర్లు తగటబెట్టడంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. మండ్య, చిత్రదుర్గ, రమణగార, మైసూరు ప్రాంతాల్లోనూ అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. బుధవారం మండ్య లేదా మైసూరులో కావేరి హితరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు సమావేశమై.. తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు నిఘా సమాచారం. సీఎం సిద్ధరామయ్య, హోం మంత్రి జి.పరమేశ్వర వేర్వేరు వీడియో ప్రకటనల్లో ‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, బక్రీద్ సందర్భంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావటంతోపాటు ఐటీ సంస్థలు సెలవు ప్రకటించటంతో రోడ్లు నిర్మానుష్యంగానే ఉన్నాయి. తమిళులు నివసించే ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలతో ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. బక్రీద్ సందర్భంగా పలు ప్రాంతాల్లో.. ముస్లిం ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో శాంతిభద్రతలపై సిద్ధరామయ్య మాట్లాడారు. కర్ణాటకకు అదనంగా 700 మంది రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పంపిస్తున్నట్లు తెలిపారు. అటు కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని చొరవతీసుకోవాలని కోరారు. కోర్టు నిర్ణయమే శిరోధార్యం..‘కోర్టు నిర్ణయాన్ని అమలుచేయటం చాలా కష్టం. కానీ రాజ్యాంగాన్ని గౌరవించాలి. అందుకే సుప్రీం చెప్పినట్లుగానే కావేరి నీటిని విడుదల చేస్తాం. రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించేందుకు చొరవతీసుకోవాలని ప్రధానిని కోరాం’ అని తెలిపారు. తమిళనాట ఆందోళన బాట కావేరి జల వివాదంపై కర్ణాటకలో తమిళనాడు ప్రజల ఆస్తులపై జరిగిన విధ్వంసంతో.. తమిళ తంబిలు కన్నడ సంస్థల ముందు.. ఆందోళన నిర్వహించారు. నామ్ తమిళార్ కచ్చి (ఎన్టీకే) సంస్థ కార్యకర్తలు కోయంబత్తూరుతోపాటు పలు ప్రాంతాల్లో ధర్నాలు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చెన్నైలోని కర్ణాటక బ్యాంకుపైకి ఓ అగంతకుడు రాయి విసరటంతో బ్యాంకు అద్దాలు పగిలాయి. పలుచోట్ల కర్ణాటక బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. కన్నడనాట ఆందోళనల ద్వారా రూ. 2వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తమిళనాడు వ్యాపారస్తుల సంఘం వెల్లడించింది. పెళ్లికీ అడ్డంకి..ఆందోళనల నేపథ్యంలో బెంగళూరులో జరగాల్సిన ఓ పెళ్లి వేదిక మారింది. తమిళనాడు తిరువణ్ణామలైకి చెందిన రంజిత్ బుధవారం బెంగళూరులో తమిళమ్మాయి సౌమ్యతో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే బెంగళూరులో కర్ఫ్యూ నేపథ్యంతో అక్కడ పెళ్లి చేయడం సాధ్యం కాదని గ్రహించిన పెళ్లి బృందం సామగ్రి సర్దుకొని తమిళనాడులోని తిరువణ్ణామలైకు తరలివెళ్లింది. కర్ణాటకకు 25వేల కోట్ల నష్టం తాజా వివాదంతో కర్ణాటకకు రూ. 25వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అసోచామ్ వెల్లడించింది. హింసాత్మక ఘటనల వల్ల భారత సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరు ప్రతిష్టకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని తెలిపింది. నష్టం కూడా ఎక్కువగా, ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలకే వాటిల్లిందని ఓ ప్రకటనలో చెప్పింది. నగరంలో మౌలిక వసతులతోపాటు, రవాణా రంగం పెద్దమొత్తంలో కోల్పోయిందని వెల్లడించింది. ప్రముఖ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతోపాటు ఈ-కామర్స్ దిగ్గజాలైన అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ కార్యాలయాలు వరుసగా రెండోరోజూ మూతబడ్డాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు మంగళవారం సెలవు ప్రకటించి.. శనివారం (సెప్టెంబర్ 17)న ఆఫీసులు తెరిచి ఉంచనున్నట్లు తెలిపాయి. కాగా, కావేరి వివాదం ముదిరేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమే కారణమని బీజేపీ ఆరోపించింది. శాంతించండి న్యూఢిల్లీ: కావేరి వివాదంలో కర్ణాటక, తమిళనాడు ప్రజలు శాంతిభద్రతలు సాధారణ స్థితికి చేరుకునేందుకు సహకరించాలని కేంద్రం కోరింది. ఆందోళనకారులపై కఠినంగా వ్యవహరించాలని ఇరు ప్రభుత్వాలకు సూచించింది. ‘సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక వివాదం సరికాదు. ఆందోళనల వల్ల సామాన్య ప్రజానీకానికి సమస్యలు తప్పవు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించొచ్చు. కన్నడనాట తమిళులపై, తమిళనాడులో కన్నడిగులపై దాడులు తప్పు’ అని కేంద్ర సమాచార ప్రసార మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కావేరి వివాదంలో అవాస్తవాలను ప్రసారం చేసి పరిస్థితి రెచ్చగొట్టవద్దని, కాస్త సంయమనం పాటించాలని కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఆదేశాలు జారీ చేసింది. చాలా బాధగా ఉంది: మోదీ కర్ణాటక, తమిళనాడు ఘటనలు బాధ కలిగించాయని ప్రధాని మోదీ అన్నారు. సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ‘హింసతో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదు. న్యాయపరిధిలో చర్చించటం ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యంలో సంయమనం, పరస్పర సహకారం ద్వారానే ఏదైనా సాధించవచ్చు. పౌరులుగా మన బాధ్యతను గుర్తుపెట్టుకుందాం’ అని మోదీ తెలిపారు. -
రాష్ర్టంలో ఏసీబీ ఏర్పాటు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకేనని సీఎం సిద్ధరామయ్య వెల్లడి బెంగళూరు: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో(ఏసీబీ)ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం సిద్దరామయ్య వెల్లడించారు. ఏసీబీని ఏర్పాటు చేయడం వెనక లోకాయుక్త సంస్థను నీరుగార్చే ఉద్దేశమేదీ తమ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. లోకాయుక్త సంస్థ పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, ఏసీబీ ఏర్పాటు తర్వాత కూడా లోకాయుక్త ఎప్పటిలాగే తన విధులను నిర్వర్తించనుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోకాయుక్త విధులకు అడ్డుతగిలేలా నడుచుకోబోమని తెలిపారు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణల సమయంలో కొన్ని గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటుండడంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఏసీబీని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. మైసూరులో హత్యకు గురైన బీజేపీ కార్యకర్త రాజు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారాన్ని అందించనుందని చెప్పారు. మైసూరు శాం తి, సౌభ్రాతృత్వాలకు నిలయమైన నగరమని, అలాంటి చోట ఇ లాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రస్తుతానికి మైసూరు నగరంలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయ న్నారు. -
యువ యుగ పథకం ద్వారా యువతకు ప్రోత్సాహం
మంత్రి పరమేశ్వర్‌నాయక్ బళ్లారి అర్బన్ : నేటి విద్యార్థులు రేపటి బావి భారత పౌరులు, యువతకు ఉపాధి రంగంలో రాణించేందుకు యువ యుగ పథకం ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక విజయనగర శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ సభాంగణంలో పోటీ పరీక్షల శిక్షణ విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో యువ యుగ పథకం సేవలు యువతకు ఉపయోగపడేలా వీఎస్కేయూలో ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ఈ పథకం అమలుకు మొదట తాను ఎంతో శ్రమించి ముఖ్యమంత్రి సిద్దరామయ్య దృష్టికి తీసుకొని పోగా ఎంతో మంచి ఆలోచనతో తెలియజేయడం హర్షనీయమని తమను అభినందించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువత నిర్మూలన కోసం యువ యుగ పథకం మంజూరు కోసం రూ.10 కోట్ల నిధులను సీఎం వెంటనే మంజూరు చేశారని తెలిపారు. తమ పరిధిలోని కర్ణాటక ఒకేషనల్ స్కిల్ డెవలప్మెంట్ శాఖ నుంచి రూ.90 కోట్ల నిధులతో యువత కు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు హెచ్ఆర్డీ కేంద్రాల ఏర్పాటుకు ఈ నిధులను కేటాయిస్తామన్నారు. ఈ పథకం ద్వారా హెచ్ఆర్డీ కేంద్రాల్లో తమ ప్రతిభకు తగ్గట్టుగా ప్రోత్సహించి శిక్షణ అందించి ఆయా శాఖలలో హై-క కింద ఉపాధి అవకాలను కల్పిస్తామన్నారు. విద్యార్థి దశలో అమూల్యమైన సమయాన్ని వృదా చేయకుండా తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని సకాలంలో తీర్చిదిద్దాలని తెలిపారు. బళ్లారి జిల్లా వీఎస్కేయూ అభివృద్దికి హై-క విభాగం నుంచి రూ.2.5 కోట్ల నిధులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే ఎన్వై.గోపాలకృష్ణ మాట్లాడుతూ... వీఎస్కేయూ అభివృద్ధికి ప్రొఫెసర్లు ఇచ్చిన మనవి పత్రం ప్రకారం బళ్లారి వీఎస్కేయూ అభివృద్ధితో పాటు గ్రామీణ క్రీడా మైదానాలు, తాగునీటి వ్యవస్థపై చర్చించి తాము చర్యలు తీసుకొని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు రాజకీయ రంగం వైపు చూడకుండా ఐఏఏస్, కేఏఎస్ పోటీ పరీక్షలు శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బుడా అధ్యక్షుడు హుమాయూన్ ఖాన్, వీఎస్కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ ఎంఎస్ సుభాష్, ఉపకులపతి ప్రొఫెసర్ టీఎం.భాస్కర్, బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ ఆర్.రంగనాథ్, ప్రొఫెసర్లు ఎల్ఆర్.నాయక్, జే.సోమశేఖర్, సిండికేట్ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.