చల్లారుతున్న కా‘వేడి’...
బెంగళూరులో పలుచోట్ల సాధారణ స్థితి
- సుప్రీం తీర్పు అమలు చేస్తామన్న సీఎం సిద్దరామయ్య
- ఆందోళనకారులపై ఉక్కుపాదం తప్పదని వ్యాఖ్య
- గాయపడిన ఓ యువకుడి మృతి కర్ణాటకకు అదనపు బలగాలు
సాక్షి, బెంగళూరు/చెన్నై/న్యూఢిల్లీ: కావేరి జలవివాదంపై అట్టుడికిన కర్ణాటకలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యం గా రాజధాని బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలపై ఈ నెల 20 వరకు 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక సర్కారు అంగీకరించింది. ఈ అల్లర్ల ద్వారా రాష్ట్రంతోపాటు బెంగళూరు ప్రతిష్టకు మచ్చ ఏర్పడుతోందని, ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతామని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు.మంగళవారం కేబినెట్ అత్యవసర భేటీలో పరిస్థితిని సమీక్షించిన సీఎం.. కోర్టు నిర్ణయం అమలుచేయటం రాజ్యాంగబద్ధమని, కఠినంగా వ్యవహరించక తప్పదని స్పష్టం చేశారు. వివాదంపై కర్ణాటక సర్కారు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై కావేరి ట్రిబ్యునల్ సెప్టెంబరు 18న(ఆదివారం) తుదితీర్పు వెలువరించనుంది. కాగా, సోమవారం నాటి ఘటనలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మూడంతస్తుల భవనం నుంచి దూకి గాయపడిన కుమార్ (30)అనే యువకుడు మంగళవారం చనిపోయాడు. దీంతో ఈ వివాద మృతుల సంఖ్య రెండుకు చేరింది. సోమవారం పోలీసుల కాల్పుల్లో పాతికేళ్ల యువకుడు మరణించడం తెలిసిందే. ఈ ఇద్దరి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాలకు సిటీ బస్సులు, మెట్రోసేవలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు మినహా మిగిలిన ప్రాంతాలకు బస్సు సర్వీసులు మొదలయ్యాయి.
చెదురుమదురు ఘటనలు.. బెంగళూరులో నిషేధాజ్ఞలు బుధవారం వరకు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. పలుచోట్ల పరిస్థితి అదుపులోకి వచ్చినా.. సున్నితమైన 16 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతోంది. తిగలారపాల్యలో నిన్న సగం కాలిన తమిళనాడు బస్సును ఆందోళనకారులు మంగళవారం పూర్తిగా తగలబెట్టారు. రెండ్రోజుల్లో 300 మందిని అరెస్టు చేశారు. హెగ్గనహల్లి, పట్టెగారపాల్య ప్రాంతాల్లో నిరసనకారులు రోడ్లపై టైర్లు తగటబెట్టడంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. మండ్య, చిత్రదుర్గ, రమణగార, మైసూరు ప్రాంతాల్లోనూ అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. బుధవారం మండ్య లేదా మైసూరులో కావేరి హితరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు సమావేశమై.. తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు నిఘా సమాచారం.
సీఎం సిద్ధరామయ్య, హోం మంత్రి జి.పరమేశ్వర వేర్వేరు వీడియో ప్రకటనల్లో ‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, బక్రీద్ సందర్భంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావటంతోపాటు ఐటీ సంస్థలు సెలవు ప్రకటించటంతో రోడ్లు నిర్మానుష్యంగానే ఉన్నాయి. తమిళులు నివసించే ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలతో ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. బక్రీద్ సందర్భంగా పలు ప్రాంతాల్లో.. ముస్లిం ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో శాంతిభద్రతలపై సిద్ధరామయ్య మాట్లాడారు. కర్ణాటకకు అదనంగా 700 మంది రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పంపిస్తున్నట్లు తెలిపారు. అటు కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని చొరవతీసుకోవాలని కోరారు.
కోర్టు నిర్ణయమే శిరోధార్యం..‘కోర్టు నిర్ణయాన్ని అమలుచేయటం చాలా కష్టం. కానీ రాజ్యాంగాన్ని గౌరవించాలి. అందుకే సుప్రీం చెప్పినట్లుగానే కావేరి నీటిని విడుదల చేస్తాం. రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించేందుకు చొరవతీసుకోవాలని ప్రధానిని కోరాం’ అని తెలిపారు.
తమిళనాట ఆందోళన బాట
కావేరి జల వివాదంపై కర్ణాటకలో తమిళనాడు ప్రజల ఆస్తులపై జరిగిన విధ్వంసంతో.. తమిళ తంబిలు కన్నడ సంస్థల ముందు.. ఆందోళన నిర్వహించారు. నామ్ తమిళార్ కచ్చి (ఎన్టీకే) సంస్థ కార్యకర్తలు కోయంబత్తూరుతోపాటు పలు ప్రాంతాల్లో ధర్నాలు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చెన్నైలోని కర్ణాటక బ్యాంకుపైకి ఓ అగంతకుడు రాయి విసరటంతో బ్యాంకు అద్దాలు పగిలాయి. పలుచోట్ల కర్ణాటక బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. కన్నడనాట ఆందోళనల ద్వారా రూ. 2వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తమిళనాడు వ్యాపారస్తుల సంఘం వెల్లడించింది.
పెళ్లికీ అడ్డంకి..ఆందోళనల నేపథ్యంలో బెంగళూరులో జరగాల్సిన ఓ పెళ్లి వేదిక మారింది. తమిళనాడు తిరువణ్ణామలైకి చెందిన రంజిత్ బుధవారం బెంగళూరులో తమిళమ్మాయి సౌమ్యతో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే బెంగళూరులో కర్ఫ్యూ నేపథ్యంతో అక్కడ పెళ్లి చేయడం సాధ్యం కాదని గ్రహించిన పెళ్లి బృందం సామగ్రి సర్దుకొని తమిళనాడులోని తిరువణ్ణామలైకు తరలివెళ్లింది.
కర్ణాటకకు 25వేల కోట్ల నష్టం
తాజా వివాదంతో కర్ణాటకకు రూ. 25వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అసోచామ్ వెల్లడించింది. హింసాత్మక ఘటనల వల్ల భారత సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరు ప్రతిష్టకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని తెలిపింది. నష్టం కూడా ఎక్కువగా, ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలకే వాటిల్లిందని ఓ ప్రకటనలో చెప్పింది. నగరంలో మౌలిక వసతులతోపాటు, రవాణా రంగం పెద్దమొత్తంలో కోల్పోయిందని వెల్లడించింది. ప్రముఖ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతోపాటు ఈ-కామర్స్ దిగ్గజాలైన అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ కార్యాలయాలు వరుసగా రెండోరోజూ మూతబడ్డాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు మంగళవారం సెలవు ప్రకటించి.. శనివారం (సెప్టెంబర్ 17)న ఆఫీసులు తెరిచి ఉంచనున్నట్లు తెలిపాయి. కాగా, కావేరి వివాదం ముదిరేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమే కారణమని బీజేపీ ఆరోపించింది.
శాంతించండి
న్యూఢిల్లీ: కావేరి వివాదంలో కర్ణాటక, తమిళనాడు ప్రజలు శాంతిభద్రతలు సాధారణ స్థితికి చేరుకునేందుకు సహకరించాలని కేంద్రం కోరింది. ఆందోళనకారులపై కఠినంగా వ్యవహరించాలని ఇరు ప్రభుత్వాలకు సూచించింది. ‘సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక వివాదం సరికాదు. ఆందోళనల వల్ల సామాన్య ప్రజానీకానికి సమస్యలు తప్పవు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించొచ్చు. కన్నడనాట తమిళులపై, తమిళనాడులో కన్నడిగులపై దాడులు తప్పు’ అని కేంద్ర సమాచార ప్రసార మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కావేరి వివాదంలో అవాస్తవాలను ప్రసారం చేసి పరిస్థితి రెచ్చగొట్టవద్దని, కాస్త సంయమనం పాటించాలని కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఆదేశాలు జారీ చేసింది.
చాలా బాధగా ఉంది: మోదీ
కర్ణాటక, తమిళనాడు ఘటనలు బాధ కలిగించాయని ప్రధాని మోదీ అన్నారు. సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ‘హింసతో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదు. న్యాయపరిధిలో చర్చించటం ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యంలో సంయమనం, పరస్పర సహకారం ద్వారానే ఏదైనా సాధించవచ్చు. పౌరులుగా మన బాధ్యతను గుర్తుపెట్టుకుందాం’ అని మోదీ తెలిపారు.