రేపటిదాకా తమిళనాడుకు నీళ్లివ్వం
- చట్టసభల్లో నిర్ణయం తీసుకుంటాం: కర్ణాటక
- సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్
- బెంగళూరులో దేవెగౌడ దీక్ష
సాక్షి, బెంగళూరు: కావేరి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం వరకు తమిళనాడుకు వదిలేది లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. శనివారం జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం మీడియాకు వెల్లడించారు. ‘గత నెల 23 నాటికి నాలుగు జలాశయాల్లో 27.2 టీఎంసీల నీరుండేది. దాంతో తాగునీటి అవసరాలకే వాడాలని ఉభయ సభలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం 32.7 టీఎంసీల నీరుంది. నీటిని మా సాగునీటి అవసరాలకు వదలాలో, వద్దో సోమవారం ఉభయసభల భేటీలో నిర్ణయం తీసుకుంటాం’ అని సిద్ధరామయ్య వెల్లడించారు. కాగా, తమిళనాడుకు కావేరి నీరివ్వాలన్న ఆదేశాలను పునఃసమీక్షించాలంటూ కర్ణాటక సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే, ఈనెల 4 నాటికల్లా కావేరి జల నిర్వహణ బోర్డును నియమించాలంటూ కేంద్రానికి జారీ చేసిన ఆదేశాలనూ సమీక్షించాలని కోరింది.
మోదీ మధ్యవర్తిత్వం వహించాలి..: ప్రధాని మోదీ మధ్యవ ర్తిత్వం వహించి కావేరి సమస్యను పరిష్కరించాలని, కర్ణాటక లకు న్యాయం చేయాలనే డిమాండ్లతో మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవెగౌడబెంగళూరులో శనివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ నేత ఖర్గే భేటీ అయిన సందర్భంలో దేవెగౌడ భావోగ్వేగంతో కన్నీరు కార్చారు. మధ్యవర్తిత్వం వహించే విషయమై మోదీని ఒప్పిస్తామని కేంద్ర మంత్రి అనంతకుమార్ హామీ ఇవ్వడంతో రాత్రి ఆయన దీక్ష విరమించారు.