వారం రోజుల్లో పోలింగ్ జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార యుద్ధంలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నేతల మధ్య మాటలు పదునెక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ అద్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ పక్షాన ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జేడీఎస్ నేత కుమారస్వామిల మాటలు ఈ ప్రచార పోరులో తూటాల్లా పేలుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పాత రాజకీయ మర్యాదలు, సంప్రదాయాలకు అతీతంగా అసంబద్ధ రీతిలో వారి వ్యాఖ్యలు వేడిపుట్టిస్తున్నాయి. ఇటీవల ఓ ఎన్నికల ర్యాలీలో వందేమాతరం గీతాన్ని అగౌరవపరిచే విధంగా రాహుల్ ప్రవర్తించారని మోదీ గురువారం విమర్శించారు.
దీనికి రాహుల్,‘‘మోదీజీకి భయం పుట్టినప్పుడల్లా వ్యక్తిగత దూషణలకు పాల్పడతారు. ఆయన అందరికీ ప్రధాని కాబట్టి నేను ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయను. ఆయనకూ, నాకూ మధ్య ఉన్న తేడా ఇదే,’’ అని రాహుల్అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలకు మారుపేరు. కొందరు నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు దక్కుతాయి,’’ అని యడ్యూరప్ప నిప్పులు చెరిగారు. ఆయనకు సిద్దరామయ్య దీటైన జవాబు ఇస్తూ, ‘‘యడ్యూరప్ప కొడుకు రాఘవేంద్ర గతంలో పార్లమెంటు, అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
రాఘవేంద్ర ఎవరి కుమారుడు? అతను యడ్యూరప్ప కొడుకు కాదా?’’అంటూ మండిపడ్డారు. ఇదే విషయంపై ప్రధాని మోదీ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ, ‘‘ కాంగ్రెస్ కార్యకర్తలు చెమటలు కక్కుతూ ప్రచారం చేస్తుంటే, ముఖ్యమంత్రి 2+1 సూత్రం అనుసరిస్తూ, తాను రెండు సీట్ల నుంచి పోటీచేస్తూ, మరో సీటులో కొడుకును నిలబెట్టారు. మంత్రులు 1+1 సూత్రంతో కొడుకుల లేదా కూతుళ్లతో కలిసి పోటీచేస్తున్నారు,’’ అనగానేసిద్దరామయ్య వెంటనే, ‘‘బళ్లారి రెడ్డి సోదరులపై సీబీఐ కేసుల మూత గురించి మాట్లాడకుండా ఎన్నికల్లో గెలుపునకు 2+1 సూత్రం గురించి చెప్పారు. ఇద్దరు రెడ్లు+ఒక యడ్డీ ఫార్ములా అమలు చేస్తున్నారు,’’ అంటూ గాలి జనార్దన్ రెడ్డి అన్నదమ్ములు సోమశేఖర్, కరుణాకర్ రెండు సీట్ల నుంచి అసెంబ్లీకి బీజేపీ టికెట్ పై పోటీచేయడం గురించి ఎద్దేవా చేశారు.
ఎవరి మధ్య రహస్య ఒప్పదం?
జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఓ ప్రైవేటు విమానంలో అమిత్ షాతో కలిసి చేసిన ప్రయాణానికి సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని, తగిన సమయంలో ఫోటోలు విడుదల చేస్తానని సిద్ధూ ఇటీవల ప్రకటించారు. దీనిపై వెంటనే స్పందించిన కుమారస్వామి, ‘‘వరుణలో సీఎం కొడుకు యతీంద్ర పోటీచేస్తున్నారు. ఇక్కడ బీజేపీతో కాంగ్రెస్కు రహస్య ఒప్పందం ఉన్న కారణంగానే మొదట అక్కడ కాషాయపక్ష అభ్యర్థిగా ప్రకటించిన యడ్యూరప్ప కొడుకు రాఘవేంద్రను నిలబెట్టలేదు. సీఎంవి ఆధారరహిత, బాధ్యతలేని ప్రకటనలు.
ఈ మాటల వల్ల ఆయన తాగుబోతులా మాట్లాడుతున్నారని జనం అనుకుంటారు,’’ అని జవాబిచ్చారు. ‘‘కర్ణాటక అందరికీ శాంతివనంలా ఉండాలన్న ప్రసిద్ధ కన్నడ కవి కువెంపు మాటలు సిద్ధూ చదివి ఉంటే లింగాయతులకు మైనారిటీ మత హోదా ఇవ్వాలని సిఫార్సు చేసేవారు కాదు,’’ అని అమిత్షా వ్యాఖ్యానించగా, ‘‘కువెంపు రాసిన ఈ కన్నడ రాష్ట్ర గీతంలోని రెండో వాక్యంలోహిందువులు, మస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, జైనులకు అంటే అన్ని మతాలకు ఉద్యానవనంలా ఉండాలని చెప్పారు. అమిత్షా ఇది కూడా చదవాల్సింది,’’అని సీఎం గట్టిగా జవాబిచ్చారు.
అమిత్ షా జైనా? హిందువా?
‘‘సిద్దరామయ్య హిందువులను సైతం చీల్చడానికి ప్రయత్నిస్తున్న విషయం రాహుల్గాంధీ గమనించాలి. సీఎంకు ‘అహిందా’(కన్నడంలో దళిత, బీసీ, మైనారిటీ వర్గాల నేత అనడానికి సంక్షిప్త రూపం) నేత అనే పేరుంది. వాస్తవానికి ఆయన అహిందా నేత కాదు అహిందువు.’’ అన్న అమిత్ షా వ్యాఖ్యపై స్పందించిన సిద్ధూ, అమిత్ షా జైన మతస్తుడని, తాను హిందువో కాదో ఆయనే వివరణ ఇచ్చుకోవాలని సవాల్చేశారు. వెంటనే, తాను జైనుడిని కాదనీ, హిందూ వైష్ణవుడినని షా జవాబిచ్చారు. ప్రధాని మోదీ అవినీతి గురించి మాట్లాడడాన్ని సిద్ధూ ఆహ్వానిస్తూ, ‘‘ఈ విషయంపై మాట్లాడడం మంచిదే.
ముందు మీ మాటలను ఆచరణలో చూపించండి. మీరు ముందు లోక్‌పాల్ నియమించండి, జడ్జీ లోయా మృతిపై దర్యాప్తు జరిపించండి, అమిత్ షా కొడుకు జై షా శరవేగంతో పెంచుకున్న సంపదకు కారణాలు విచారించండి, మచ్చలేని నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించండి,’’అని సవాలు విసిరారు. దీనికి యడ్యూరప్ప జవాబిస్తూ, ‘‘మిస్టర్ టెన్ పర్సెంట్, మనం దిల్లీవైపు వేలు చూపే ముందు మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. రాష్ట్రంలో మీరు లోకాయుక్త అధికారాల్నింటికీ కత్తెరేసి శక్తిహీనుడిని చేయలేదా?’’అని ప్రశ్నించారు. ‘‘ మేం 22.5 లక్షల మందికి చేసిన రుణ మాఫీని కేంద్ర మంత్రులు చులకనచేసి మాట్లాడుతున్నారు. రైతు రుణాల మాఫీకి తన దగ్గర అచ్చు యంత్రం లేదని యడ్డీ అంటున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు కార్పొరేట్కంపెనీలకు రూ. 2.7 లక్షల కోట్ల రుణాలు మాఫీచేశాయి. కోట్లాది మంది రైతులను విస్మరించి మోదీ కొందరు పారిశ్రామికవేత్తలకు ఎందుకు మేలు చేస్తున్నారు?’’ అని సిద్దరామయ్య విరుచుకుపడ్డారు.
- (సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment