తుమకూరు సభలో ప్రధాని మోదీని గజమాలతో సత్కరిస్తున్న దృశ్యం
సాక్షి బళ్లారి/తుమకూరు/శివమొగ్గ: సిద్దరామయ్య సర్కారు అవినీతి ఖజానాగా మారితే ఈ పైప్‌లైన్లు ఢిల్లీకి నేరుగా అనుసంధానమయ్యాయని కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ విమర్శించారు. నిధులన్నీ అధిష్టానానికి చేరుతున్నాయన్నారు. శనివారం తుమకూరు, గదగ్, శివమొగ్గల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. మే 15 తర్వాత (ఫలితాలు వెలువడ్డాక) కాంగ్రెస్ పార్టీ ‘పీపీపీ(పంజాబ్, పుదుచ్చేరి, పరివార్) కాంగ్రెస్’గా మారబోతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల టికెట్లను, పార్టీ పదవులను.. చివరకు సీఎం సీట్లను వేలం వేస్తోందని విమర్శించారు.
సీట్లు, పదవులకోసం టెండర్లు
గదగ్ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘హెలికాప్టర్ స్కామ్, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ టెండరు వ్యవస్థను ప్రారంభించింది. టికెట్ల పంపిణీ, పార్టీ పదవులకోసం నేతలను ఎన్నుకోవటం, సీఎంలను ఎన్నుకోవటం వంటి వాటికి ఇక్కడ టెండర్లు వేస్తారు. సీఎంగా ఎవరుండాలనేది.. ఎవరెక్కువ నిధులను ఢిల్లీకి పంపిస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుందని కన్నడ కాంగ్రెస్ నేతలకు చెప్పేశారు’ అని మోదీ అన్నారు.
‘కర్ణాటకలో ప్రజల నుంచి దోపిడీ చేసిన మొత్తంలో కొంతమొత్తాన్ని కాంగ్రెస్ నేతలు తీసుకెళ్తారు. మిగిలినదంతా ఓ అవినీతి ఖజానాలో పెడతారు. ఆ ఖజానా పైప్‌లైన్ ఢిల్లీలోనే తెరుచుకుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం చేజారితే ఈ డబ్బులు ఆగిపోతాయనే భయం కాంగ్రెస్‌లో స్పష్టంగా కనబడుతోంది’ అని మోదీ పేర్కొన్నారు. కన్నడ మంత్రుల ఆస్తులు ఐదేళ్లలో వందల కోట్లకు ఎలా పెరిగాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
పేదరిక నినాదమేమైంది?
తుమకూరు ర్యాలీలోనూ మోదీ మాట్లాడారు. కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్, జేడీఎస్‌లు తెరవెనక దోస్తీ చేసుకున్నాయని విమర్శించారు. ‘పేదరికం నినాదంతో కాంగ్రెస్ మొదట్నుంచీ గెలుస్తూ వస్తోంది. కానీ, కాంగ్రెస్ పార్టీ రైతులు, పేదలను పూర్తిగా విస్మరించిందన్నారు. కర్ణాటకకు మంచి భవిష్యత్తుకోసం కాంగ్రెస్‌ను ఓటర్లు శిక్షించాలని పిలుపునిచ్చారు.
మహదాయి నదీజలాల వివాదాన్ని మోదీ గుర్తుచేస్తూ.. గోవాలో అధికారంలో ఉన్నప్పుడు ఈ నదీ జలాలను ఎట్టిపరిస్థితుల్లో కర్ణాటకకు ఇవ్వబోమని సోనియా గాంధీ చెప్పిన విషయాన్ని మరవొద్దన్నారు. ‘వారిప్పుడు గోవాలో అధికారాన్ని కోల్పోయారు. దీంతో ఇప్పుడు కన్నడ ప్రజల్లో మహదాయి వివాదాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. సమస్యను పరిష్కరించేందుకు చొరవచూపాల్సింది పోయి ట్రిబ్యునల్‌కు పంపించారని మోదీ మండిపడ్డారు.
యడ్యూరప్ప చిత్తశుద్ధి భేష్
బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప గురించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను అర్థరహితమని మోదీ శివమొగ్గ ర్యాలీలో (యడ్యూరప్ప సొంత జిల్లా) పేర్కొన్నారు. ‘సమాజం పట్ల యడ్యూరప్పకున్న చిత్తశుద్ధి, ఆయన వయసు వంటి వాటిని మరిచిపోయి అర్థరహిత విమర్శలు చేస్తున్నారు. ఈ జిల్లాలోని కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలు డిపాజిట్లు రాకుండాచేయాలి’ అని అన్నారు. పెద్దనోట్లను రద్దు చేశాక అత్యధికంగా కాంగ్రెస్ నేతల ఇళ్లలోనే భారీగా నోట్లకట్టలు బయటపడ్డాయి.
ఈవీఎంకు మోదీ కొత్త నిర్వచనం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)కు మోదీ కొత్త అర్థం చెప్పారు. ‘ఈవీఎంలో ఈ అంటే ఎనర్జీ ఆఫ్ ది పీపుల్, వి– అంటే పీపుల్స్ ఎలక్టోరల్ వాల్యూ ఎడిషన్, ఎం– పీపుల్స్ మోటివేషన్ ఫర్ ప్రోగ్రెస్..’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment