సాక్షి, బెంగళూరు /వైట్‌ఫీల్డ్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా, ప్రతిపక్ష పార్టీల కంటే ముందుగానే అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నగారాను మోగించింది. రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ ఒక్కతాటి పైకి చేరారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌లకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ‘మనెమనెగె కాంగ్రెస్’ పేరిట కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. నగరంలోని మహదేవపుర నియోజకవర్గంలోని రామగొండనహళ్లిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ‘మనెమనెగె కాంగ్రెస్’ కార్యక్రమాన్ని సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కె.సి.వేణుగోపాల్, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌లు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేసిన ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేపీసీసీ నుండి ఒక కోటి పదిలక్షల రూపాయల మొత్తాన్ని ఖర్చు చేసి ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకాన్ని రాష్ట్రంలోని ఇంటింటికీ అందజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పేదలు, రైతులు, వెనకబడిన వర్గాలవారు, మైనారిటీల కోసం చేపట్టిన కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. శనివారం రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. ఇక అక్టోబర్ 15నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.
స్థానికులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి..!
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం ఏర్పాటుచేసిన వేదిక సమీపంలో కొందరు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సిఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ వేణుగోపాల్, ఏఐసిసి కార్యదర్శి హరిప్రసాద్, రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ అ«ధ్యక్షుడు పరమేశ్వర్ శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విచ్చేశారు. మహదేవపుర నియోజకవర్గం హగదూరు వార్డు రామగుండనహళ్లి పాఠశాల ఆవరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఈప్లేక్సీను ఏర్పాటు చేసి స్థానికులకు టికెట్ ఇస్తే.. పార్టీ విజయానికి కృషిచేస్తామని వారు ఆఫ్లెక్సీలో పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు పరిసర ప్రాంతాల నుంచి పాదయాత్రతో చేరుకున్నారు. దూరప్రాంతాలనుంచి బీఎంటీసీ బస్సుల్లో ఈకార్యక్రమానికి జనాన్ని, కార్యకర్తలను తరలించడం కనిపించింది
‘ఇంటింటికీ కాంగ్రెస్’
Published Sun, Sep 24 2017 2:02 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement