ఖమ్మం (అర్బన్) : హైదరాబాద్ ట్యాంక్ బండ్‌ను తలదన్నేలా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ అతి తక్కువ కాలంలో అభివృద్ధి చేయడం అభినందనీయమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఆదివారం ట్యాంక్ బండ్‌ను ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ చెరువుకు ఇవ్వని విధంగా లకారం చెరువుకు నగరంలో రూ.23 కోట్లతో అభివృద్ధి చేశామని అన్నారు. మిషన్ కాకతీయ పథకంలో రూ 17.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఒకప్పుడు మురుగు నీటితో కంపు కొట్టిన చెరువు నేడు కృష్టానది జలాలతో కలకలలాడుతోందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ చెరువు మొత్తం కబ్జాలకు గురైందని అన్నారు.
ఎప్పుడైనా ఇంత అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అజయ్‌కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి వెంటబడి నిధులు సమకూర్చుకున్నారని అన్నారు. నగరంలోనే ఉన్న అటవీ భూమి 400 ఎకరాల్లో కూడా పార్కుగా నగర వాసులకు ఆహ్లదం అందించాలనే తలంపుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయించడం జిల్లా ప్రజల ఆదృష్టం అన్నారు. కష్టాల్లో ఉన్న గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేందుకు మంత్రి తుమ్మల ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు. హైదరాబాద్ తలదన్నేలా త్వరలో ఖమ్మంలో కూడా రింగ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. జాతీయ పార్టీలను నమ్ముకుంటే ఢీల్లిలో బానిసలం అవుతమని అన్నారు. గాంధీ భవన్‌లో కూర్చోని సర్వే చేసుకోవడం కాదని.., ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలన్నారు.
జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. రఘునాథపాలెం మండలంలో సాగు నీరు అందించేందుకు ఉపయోగపడే బుగ్గవాగునీటిని అందించడానికి అవసరమైన కాల్వల నిర్మాణానికి భూసేకరణ ఇతర పనులకు అవసరమైన రూ 37 కోట్లును కొద్ది రోజుల్లో మంజూరు చేస్తానని హరీష్‌రావు అన్నారు. ప్రూట్ మార్కెట్ ఏర్పాటుకు కావాల్సిన స్థలం ఉంటే వెంటనే నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు.
మురుగు మాయమైంది..: తుమ్మల
ఒకప్పుడు మురుగు కూపంగా ఉన్న లకారం చెరువును నేడు సుందరీకరణగా తీర్చిదిద్దామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాడు ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తనకు మిగిలిన పనులు చేయడానికి సీఎం కేసీఆర్ మళ్లీ అవకాశం కల్పించడం ఆదృష్టంగా ఉందని అన్నారు. ఖమ్మం నగరంలోని సాగర్ ప్రధాన కాల్వ కట్టలకు ఖాళీ స్థలాల్లో కూడా బ్యూటిపి కేషన్ చేసి నగర వాసులకు అందిస్తామన్నారు. 180 కోట్లుతో రింగ్‌రోడ్డు నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికే నిధులు కేటాయించారని, త్వరలోనే నిర్మాణం చేసి చూపిస్తామన్నారు. కాళేశ్వరం తరహాలనే గోదావరి నీళ్లను జిల్లాలో సస్యశ్యామలం చేసే విధంగా పనులన్ని యుద్ధ ప్రాతిపధికన చేయనున్నట్లు తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం :పొంగులేటి
అభివృద్ధి సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదారాబాద్ కంటే ఖమ్మం అభివృద్ధికి కంకణం కట్టుకుని సాధిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ఒక మోడల్ జిల్లాగా నిలుస్తుందని గుర్తు చేశారు.
అందరి సహకారంతోనే..: అజయ్
సీఎం కేసీఆర్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తన్నీరు హరీష్‌రావు, కేటీఆర్‌ల కృషితోనే ఖమ్మం అభివృద్ధి సాధ్యమవుతోందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. లకారం ట్యాంక్ బండ్ నిర్మాణానికి నాడు మంత్రి తుమ్మల గుణపం వేశారని, అదే చెరువులో నేడు బోటులో షికా>రు చేశారని గుర్తు చేశారు. ఇంకా కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గతంలో 6 దశాబ్దాలుగా జరిగని అభివృద్ధిని మూడు సంవత్సరాల్లో సాధించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ది సంస్థ చైర్మన్ బేగ్ తదితరులు మాట్లాడారు.
ఈ సభలో జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, మేయర్ డాక్టర్ పాపాలాల్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఎమ్మెల్యేలు బానోత్ మధన్‌లాల్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, కమిషనర్ సంధీప్‌కుమార్ షూ, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, కార్పొరేటర్లు చావా నారాయణరావు, కర్నాటి కృష్ణ, బిక్కసాని ప్రశాంతిలక్ష్మి, కొత్తపల్లి నీరజ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, సీతారామ ప్రాజెక్టు సీఈ సుధాకర్, ఇరిగేషన్ ఎస్‌ఈ ధర్మ,ఈఈలు నరిసింహరావు, వెంకటేశ్వరరెడ్డి, డీఈ ఆర్జన్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ నివాసంలో తేనేటి విందు
జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు తన్నీరు హరీష్‌రావు, తుమ్మలనాగేశ్వరరావులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఆదివారం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన అల్పాహారం, తేనేటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి ఇటీవల నిర్మించిన నూతన నివాసాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment