అనుసంధానం చేసిన వేలిముద్ర యంత్రం (ఫైల్)
సాక్షి, నేలకొండపల్లి: తప్పుడు వివరాలతో రేషన్ పొందుతున్న పెద్ద రైతులకు రైతుబంధు పథకం కష్టాన్ని తెచ్చింది. వివరాలను రేషన్ సర్వర్‌తో అనుసంధానం చేయటంతో పదెకరాలు, అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూములున్న రైతులకు రేషన్ నిలిచిపోతున్నాయి. ఇప్పటి వరకు తక్కువ భూమి ఉన్నట్లు చూపించి పలువురు పెద్ద రైతులు ఆహార భద్రత కార్డులు పొందారు. మరికొందరు భూమి ఉన్నా సేద్యంలో లేదంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలు చూపించి రేషన్ తీసుకుంటున్నారు. అలాంటి రైతులకు పథకంతో తెరపడింది. రేషన్ సర్వర్‌కు దీనిని అనుసంధానం చేయటంతో ఎక్కువ భూములు ఉన్న రైతులకు రేషన్ నిలిచిపోయింది.
పెట్టుబడి సాయం పొందేందుకు సాగులో లేని భూములను సైతం సేధ్యం చేస్తున్నామంటూ రైతులు తప్పుడు పత్రాలు చూపి రెండు పర్యాయాలు లబ్ధి పొందారు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రైతుబంధు లబ్ధిదారుల వివరాలను తెప్పించుకొని తమ శాఖ సర్వర్‌కు అనుసంధానం చేయడంతో పెద్ద రైతుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ఫుడ్ సెక్యూరీటీ యాక్ట్ 2013 ప్రకారం వారిని రేషన్, రైతుబంధుకు అనర్హులుగా ప్రకటించింది.
విచారించాలని డీఎస్‌ఓలకు ఆదేశాలు..
జిల్లాలో పది ఎకరాల పైన ఉన్న రైతులు ఎవరెవరు ఉన్నారో విచారించాలని జాయింట్ కలెక్టర్ల ద్వారా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు అందాయి. పెద్ద రైతులు, వారి భూముల వివరాలు విచారించి నివేదికలను పంపాలని అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. ఇప్పటికే డీఎస్‌ఓ లకు లిఖిత పూర్వక ఆదేశాలు అందాయి.
రైతు బంధుతో ..
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు 8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందజేస్తోంది. దీంతో ఏ రైతుకు ఎంత భూమి ఉందో లెక్క తేలిపోయింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆకున్ సబర్వాల్ రైతుల ఆధార్ నంబర్‌ను పీడీఎస్ రైస్ ఈ పాస్ సర్వర్‌కు అనుసంధానం చేయటంతో అనర్హులు దొరికిపోయారు.
ప్రస్తుతం రేషన్ దుకాణాలల్లో ఈ పాస్ విధానంలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద రైతులు రేషన్ దుకాణానికి వెళ్లి ఈ పాస్ మిషన్ పై వేలిముద్ర వేస్తు ఇన్‌వాలీడ్ అని వస్తోంది. దీంతో డీలర్లు రేషన్‌ను నిలిపివేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 669 దుకాణాలు ఉండగా వాటిలో 3,95,857 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి.
అర్హులకు ఇబ్బంది లేదు..
తక్కువ భూమి ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక వేళ రేషన్ ఆగిపోతే స్థానిక తహసీల్దార్‌కు దరఖాస్తు కోవాలి. విచారించి రేషన్ అందేలా చర్యలు తీసుకుంటాం. పది ఎకరాలు అంత కంటే ఎక్కువగా భూమి ఉన్న రైతులకు ఈనెల నుంచి రేషన్‌ను నిలిచిపోతుంది. ఇప్పటికే కమీషనర్ కార్యాలయంలో బ్లాక్ చేశారు.
– కె.వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జ్ డీఎస్‌ఓ, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment