పొలిటికల్‌ వేడిని రగిలించిన 2017  | year roundup in khammam district | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ వేడిని రగిలించిన 2017 

Published Fri, Dec 29 2017 3:41 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

 year roundup in khammam district - Sakshi

భక్తరామదాసు ప్రాజెక్టు వద్ద నీటికి పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు (ఫైల్‌)

ఈ ఏడాది రాజకీయాలు మరింత వేడెక్కాయి. అన్ని పార్టీలు క్రియాశీలకంగా వ్యవహరించాయి. ముఖ్యమంత్రి జిల్లాపై మరింత శ్రద్ధ పెట్టారు. అధికార పార్టీ అభివృద్ధి పేరిట..మంత్రులతో చక్కర్లు కొట్టించింది. లోపాలు, వైఫల్యాలపై కమ్యూనిస్టులు కాస్త గుర్రుమన్నారు. టీడీపీలో ఆటుపోట్లు, కాంగ్రెస్‌లో సమన్వయానికి దిద్దుబాట్లు, వైఎస్సార్‌సీపీ పాతబలాన్ని పొందేందుకు కసరత్తుతో.. రాజకీయ వేడి రగులుకుంది. భవిష్యత్‌లో సై..అనేందుకు సిద్ధమనే సంకేతాలనిచ్చింది.   


సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజకీయ చైతన్యానికి గుమ్మంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ అభివృద్ధి మంత్రాన్ని ఆద్యంతం పటించగా.. విపక్ష రాజకీయ పక్షాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, సంస్థాగత అంశాలపై దృష్టి సారించి ఈ సంవత్సరం జిల్లా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. నూతన సంవత్సరం 2017 ఆరంభంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖమ్మంజిల్లాకు విచ్చేసి తిరుమలాయపాలెం వంటి కరువుపీడిత ప్రాంతంలో సాగునీటిని ప్రవహింపచేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలోచనతో రూపుదిద్దుకున్న జలసిరులు కురిపించే భక్తరామదాసు ప్రాజెక్టును ప్రారంభించారు. చైతన్య రాజకీయాలకు చిరునామా అయిన ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో కీలకమైన భక్తరామదాసు ప్రాజెక్టు మొదటిదశను సీఎం ప్రారంభించగా.. మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో ఏడాది లోపే రెండో దశను సైతం పూర్తి చేయించి సాగునీటిని అందించేందుకు అధికారులను సమాయత్తం చేయించారు. ఇప్పటికే ట్రయల్‌రన్‌ పూర్తికాగా.. మరికొద్ది రోజుల్లో భక్తరామదాసు రెండో దశనుంచి సాగునీరు ఆయా ప్రాంతాలకు అందనున్నది. పాలేరు ప్రాంతంలో వందలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు గతంలో రూపొందించి నిరుపయోగంగా ఉన్న పాలేరు పాతకాల్వను ఆధునిక హంగులతో పునరుద్ధరింప చేయగా.. పాతకాల్వను మంత్రి హరీష్‌రావు అక్టోబర్‌ మొదటి వారంలో ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రూపొందించిన సీతారామ సాగర్‌ ప్రాజెక్టు పనులు కొంతమేరకు ఊపందుకున్నా.. ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉందన్న భావనను ఈ సంవత్సరం పనులు కలిగించాయి. 

ఎన్నికల వాతావరణం.. 
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో అప్పుడే ఎన్నికల వాతావరణం ఏర్పడింది. అనేక నియోజకవర్గాల్లో వివిధ రాజకీయ పక్షాల మధ్య పరస్పర ఆరోపణలు, సవాల్, ప్రతిసవాళ్లు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సున్నం రాజయ్య, సండ్ర వెంకటవీరయ్య, మల్లు భట్టి విక్రమార్కలు ఆయా పార్టీల బలోపేతానికి, పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఈ సంవత్సరం అంతా తామై నిలిచారు. సీపీఎం జిల్లా మహాసభలను ఈ సంవత్సరం వైరాలో ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు ప్రజా సమస్యలపై చేయాల్సిన పోరాటాలపై దిశానిర్దేశం చేసింది. సీపీఐ సైతం పార్టీ నిర్మాణంపై దృష్టి సారించడంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలుపుకుని పోరుబాట బస్‌యాత్రను నిర్వహించింది. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరు నిర్వహించడం ద్వారా ఈ సంవత్సరం కీలకంగా నిలిచింది. ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం జిల్లా అధ్యక్షులు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. అగ్రనేతలు కదిలొచ్చారు. 
కాంగ్రెస్‌ పార్టీ..: ఖమ్మంలో నిర్వహించిన సదస్సు ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. అలాగే డిసెంబర్‌ మొదటివారంలో ఖమ్మం అర్బన్‌ మండలం రఘునాథపాలెంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో ప్రజా చైతన్య సభను నిర్వహించింది. టీడీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా తుళ్లూరి బ్రహ్మయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా కోనేరు సత్యనారాయణ (చిన్ని)లను పార్టీ అధిష్టానం నియమించింది.

ఐటీ అడుగులు.. 
ఖమ్మం కేంద్రంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని విస్తృతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఖమ్మంకు మంజూరు చేసిన ఐటీ హబ్‌కు జూన్‌ 15వ తేదీన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. జిల్లాకు పారిశ్రామిక పరంగా ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తామన్న భరోసా జిల్లా ప్రజలకు కొత్త ఆశలను చిగురింప చేసింది. అధికార పార్టీలో నేతల మధ్య అభిప్రాయ బేధాలు ఈ సంవత్సరం సైతం యథావిధిగానే కొనసాగినా అవి బహిర్గతం కాకుండా ఆ ప్రభావం పార్టీపై, పార్టీ శ్రేణులపై పడకుండా ఎవరికి వారే తమదైన రీతిలో రాజకీయ చతురత ప్రదర్శించారు.


విపక్షాల ఎక్కు.. 
కాంగ్రెస్‌ పార్టీతోపాటు జిల్లాలో ఉన్న సీపీఎం, సీపీఐ, వైఎస్సార్‌సీపీ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, బీజేపీలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై దృష్టి సారిస్తూనే సంస్థాగతంగా బలోపేతం కావడానికి, పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరింపచేయడానికి తమదైన రీతిలో ప్రయత్నాలు కొనసాగించాయి.  

బీజేపీ: భారతీయ జనతా పార్టీ ఈ సంవత్సరం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర, జాతీయ నేతలను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తీసుకొచ్చి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కల్పించేందుకు ప్రయత్నం చేసింది. జనవరిలో భద్రాచలంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి  కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్‌ గంగారాం, బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి,రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులు హాజరయ్యారు. బీజేపీ తెలంగాణ విమోచన యాత్ర జిల్లాలోని మ«ధిర నియోజకవర్గంలో కొనసాగింది. రాష్ట్ర అ«ధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగింది.  

టీడీపీ: తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఈ సంవత్సరం మరింత రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీకి మూలస్తంభాలుగా వ్యవహరించే ముఖ్య నేతలు అనేకమంది తమ రాజకీయ భవిష్యత్తు కోసం అధికార పార్టీవైపు అడుగులు వేయగా.. మరికొందరు ముఖ్యనేతలు అదే దారిలో నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దీంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు అలముకుంటున్నాయి.

కమ్యూనిస్టులు.. సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీలు: రైతు సమస్యలపై రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయన్న భావన సాధారణ ప్రజల్లో వ్యక్తమైంది.

దక్కిన పదవులు.. 
ఉద్యమనేతగా ఉన్న పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అశ్వారావుపేట శాసనసభ్యుడు తాటివెంకటేశ్వర్లుకు ట్రైకార్‌ చైర్మన్‌ పదవి, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుడాన్‌బేగ్‌కు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవి, మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత కొండబాల కోటేశ్వరరావుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవి ఈ సంవత్సరం లభించాయి. ఇక ఎంతో కాలంగా పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పదవులను సైతం ప్రభుత్వం భర్తీ చేసింది. జిల్లాలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ పదవులు భర్తీ కాలేదు. దీంతో అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో ఈ పదవుల భర్తీపై ఆశలు నెలకొని ఉన్నాయి.

టీఆర్‌ఎస్‌కు ఝలక్‌.. 
టీఆర్‌ఎస్‌ పార్టీలో ఈ సంవత్సరం సైతం అనేక మంది ముఖ్యులు తీర్థం పుచ్చుకోగా.. ఆ పార్టీలో ముఖ్యనేతగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ను వీడటం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. ఆయన కాంగ్రెస్‌లో చేరడానికి పార్టీని వీడారని ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకు ఆయన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోలేదు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement