khamma district
-
ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉద్రిక్తత
-
ఖమ్మంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణలు..
సాక్షి, ఖమ్మం జిల్లా: కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆర్టీ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన హనుమంతరావు, అతని అనుచరులతో కలిసి కాంగ్రెస్‌కు చెందిన మేకపోతుల మహేష్ గౌడ్‌పై కత్తులతో, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మహేష్‌కు తీవ్ర గాయాలవ్వడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా గతంలోనూ మహేష్‌పై అనేకసార్లు దాడికి యత్నించినట్లు తెలిసింది. పలుమార్లు పలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలో పండితాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. -
ఆ జిల్లాపై హరీష్ రావు కన్నేసి ఉంచారా?
గులాబీ బాస్ ఆశించిన విధంగానే ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఖమ్మం బీఆర్ఎస్ గందరగోళంగా తయారైంది. పలువురు సీనియర్లు పార్టీ వీడతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగ ప్రవేశం చేయడంతోనే అంతా సర్దుకుందనే టాక్ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో సైతం హరీష్ రావు ఖమ్మం జిల్లాపై ఓ కన్నేస్తారా? భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ తెలంగాణ సరిహద్దులో ఏపీకి ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లాలో విజయవంతంగా జరిగింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపేవిధంగా ఉంటుందని, అదే సమయంలో ఖమ్మం జిల్లా పార్టీలోని అసమ్మతిని కూడా దారికి తెచ్చుకున్నట్లుగా ఉంటుందనే వ్యూహంతోనే కేసీఆర్ ఖమ్మంను ఎంపిక చేశారని తెలుస్తోంది. పార్టీ అనుకున్న సంఖ్యలో కాకపోయినా.. భారీగా తరలివచ్చిన ప్రజలు గులాబీ దళపతికి సంతోషం కలగచేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఢిల్లీలో గ్రాండ్‌గా నిర్వహించాలని మొదట్లో భావించారు. అయితే అనూహ్యంగా వేదిక ఖమ్మంకు మారింది. వేదిక మార్పు వెనుక కేసీఆర్ రాజకీయ సమీకరణాల వ్యూహం కూడా సక్సెస్ అయిందని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో అసంతృప్తితో ఉన్న కొందరు సీనియర్ బీఆర్ఎస్ నేతలు పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఖమ్మం జిల్లాపై బిజేపి కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ పూర్వరంగంలో ఖమ్మంలో ఆవిర్భావ సభ పెట్టడం ద్వారా పార్టీలోని అసంతృప్త నేతలు చేజారకుండా చూసుకోవడమే కాకుండా పార్టీని బలోపేతం చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఖమ్మం వేదికను ఎంచుకున్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది. అయితే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లు, జన సమీకరణ బాధ్యతను ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు ఖమ్మంలోనే మకాం వేసిన హరీష్‌రావు.. జన సమీకరణ ఏర్పాట్లు చూసుకున్నారు. ఖమ్మంకు వచ్చీ రావడంతోనే అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే బాధ్యతను చేపట్టారు. జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంకి వెళ్లి చర్చలు జరిపారు. తాజా రాజకీయ పరిణామాలపై తుమ్మలతో చర్చించారు. రానున్న రోజుల్లో జిల్లాలో ఖచ్చితంగా తుమ్మలకు ప్రయారిటీ ఉంటుందన్న సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్ని ఆయనకు హరీష్ వివరించారని చెబుతున్నారు. హరీష్ రావు తో జరిపిన చర్చలు విశ్వాసం కలిగించడంతో..తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో మళ్ళీ యాక్టివ్ అయ్యారు. పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాలను మంత్రి హరీష్ రావుతో కలిసి జిల్లా అంతటా నిర్వహించారు. జన సమీకరణకు అన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక నేతలతో పాటుగా.. తన అనుచరులను కూడా పురమాయించారు. తుమ్మలతోనే కాకుండా జిల్లా అంతటా అసంతృప్తితో ఉన్న ముఖ్య నాయకులతో హరీష్‌రావు రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. కొత్తగూడెంలో గత రెండేళ్ల నుంచి అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెంలో మళ్లీ యాక్టివ్ కావాలని ఆవిర్భావ సభకు రావాలని కేసీఆర్ సూచించిన నేపద్యంలోనే జలగం వెంకట్రావు సభకు వచ్చారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాయకులు, కేడర్ మొత్తం వర్గ విభేదాలు పక్కనపెట్టి బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రావడంతో సభ అనుకున్న స్థాయిలో సక్సెస్ అయిందన్న వాదన వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు సైతం వచ్చారు. సభ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలకు వర్గ విభేదాలను పక్కనపెట్టి వచ్చే ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ సీట్లు.. రెండు లోకసభ స్థానాలు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేశారట. జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మళ్లీ రిపీట్ కావద్దని సూచించారట. ఆవిర్భావ సభను విజయవంతం చేసినందుకు మంత్రి హరీష్ రావును సీఎం కేసీఆర్ ప్రశంసించారు. మొత్తానికి ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభతో అసంతృప్త నేతలు పార్టీ నుంచి చేజారకుండా సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ నాయకులందరూ చివరి వరకు వర్గ విభేదాలను పక్కనపెట్టి పని చేస్తారా... లేకుంటే మధ్యలో హ్యాండ్ ఇస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.. -
'పార్టీ కార్యకర్తలు తాలిబన్లు, నక్సలైట్లుగా ఉద్యమించాలి'
-
నువ్వు మంచిగున్నవ్!..సీఐ అనుచిత వ్యాఖ్యలు
కారేపల్లి: పొలం గట్టు తగాదాపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ మహిళతో సీఐ పెడార్థం వచ్చేలా మాట్లాడారన్న ఆరోపణ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో కలకలం రేపింది. ‘నీవు మంచిగనే ఉన్నావ్ కదా! నువ్వు నాకు నచ్చినవ్!!’అంటూ సీఐ అనుచితంగా మాట్లాడాడని బాధితురాలు ఆరోపించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయాన్ని పాత్రికేయులకు వెల్లడించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ మహిళ వారికి ఫోన్ చేసి ‘సమస్య పరిష్కారానికి అధికారులు హామీ ఇచ్చారు. నేను చెప్పినవేవీ పేపర్లలో రాయకండి’అని కోరడం గమనార్హం. బాధితురాలి కథనం ప్రకారం... కారేపల్లి మండలం రేలకాయలపల్లి గ్రామానికి చెందిన భూక్యా కాంతమ్మ, భూక్యా మమత తల్లీకుమార్తెలు. పెళ్లయిన మమత భర్తతో గొడవ కారణంగా తల్లి ఇంట్లోనే ఉంటోంది. మమత బాబాయి భూక్యా లక్ష్మణ్ ఇటీవల తమ చేను గట్టు ఆక్రమించి దున్నుతుండగా ప్రశ్నించడంతో కొట్టాడని మమత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ లక్ష్మణ్ మరోసారి పత్తి చేను గట్టు దాటి వచ్చి అర ఎకరం వరకు ఆక్రమించి దున్నుతుండగా శనివారం రాత్రి 7 గంటలకు కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మమత వెళ్లింది. అప్పుడే సీఐ అనుచితంగా మాట్లాడినట్లు మమత సోమవారం విలేకరులకు వెల్లడించింది. అంతేకాకుండా రాత్రి 11.30 వరకు ఒక్కదాన్నే పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టారని, పెద్దవాళ్లతో గొడవలు ఎందుకు అని చెప్పారని ఆరోపించింది. అయితే సోమవారం సాయంత్రం మాత్రం ఈ విషయాలేవీ పత్రికల్లో రాయొద్దని కోరింది. ‘అనుకోకుండా జరిగింది. ఏదీ మనసులో పెట్టుకోకు. నీ సమస్య మొత్తం పరిష్కరిస్తాం. మీ బాబాయ్‌ను పిలిపించి నీ భూమి హద్దులు పెట్టిస్తాం’అని పోలీసులు చెప్పారని తెలిపింది. మమత ఆరోపణలపై కారేపల్లి సీఐ బి. శ్రీనివాసులును వివరణ కోరగా మమత ఫిర్యాదు పత్రం ఇష్టారీతిన ఉండడంతో మార్చి రాయాలని దబాయించిన మాట వాస్తవమేనని, కానీ అనుచితంగా మాట్లాడలేదన్నారు. -
సైకిల్‌పై పువ్వాడ: చక్కర్లు కొడుతూ.. సూచనలిస్తూ
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం నుంచి వైరా రోడ్ మీదుగా సైకిల్‌పై నగరంలోని ప్రధాన సెంటర్లలో పర్యటించారు. కొత్త మున్సిపల్ భవనం వరకు సైకిల్‌పై పర్యటించి రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన సైడు డ్రెయిన్లు, రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ అంతర్గత పైపులైన్, పారిశుద్ధ్య పనులను మంత్రి పరిశీలించారు. పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి పనుల కొనసాగింపు కుదరదని, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రజా రవాణాకు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మంకు ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగరాభివృద్ధిలో విద్యుత్ శాఖ అధికారులు అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. నగరాభివృద్ధికి రూ.30కోట్ల ఎస్డీఎఫ్ నిధులను సీఎం మంజూరు చేశారని, ఆ నిధులను రోడ్ల మరమ్మతులు, డ్రెయిన్ల నిర్మాణానికి ఖర్చు చేస్తామన్నారు. బడ్జెట్లో ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.150కోట్లు కేటాయించారని, ఆ నిధులను వినియోగించుకొని నగరంలోని మట్టి రోడ్లన్నింటినీ సీసీ రోడ్లుగా ఆధునికీకరించడంతోపాటు అన్ని ప్రాంతాల్లో డ్రెయిన్లు నిర్మిస్తామన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని, మరిన్ని అభివృద్ధి పనులు చేసేలా ప్రజలు తమను ఆశీర్వదించాలన్నారు. ఇంకా మంత్రి వెంట మున్సిపల్, విద్యుత్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ శాఖల అధికారులు ఉన్నారు. చదవండి: మంత్రి జగదీశ్ కంటతడి -
ఆ గ్రామంలో వరుస మరణాలు.. కారణం ఇదేనా!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరుస మరణాలతో ఆ గ్రామం అల్లాడుతోంది. కారణం తెలియకుండానే కన్నుమూస్తున్న వారిని చూసి గ్రామం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎప్పుడు ఏ చావు వార్త వినాల్సి వస్తుందో.. రేపు ఎవరివంతో అనుకుంటూ.. దినదినగండంగా గడుపుతోంది. ఇదీ.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామం పరిస్థితి. గ్రామంలో జ్వరాల వ్యాప్తి విస్తృతంగా ఉన్నా.. ఎవరికి వారే వైద్యం చేయించుకోవడం, జ్వర తీవ్రత పెరిగితే జిల్లా కేంద్రమైన ఖమ్మం ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ప్రతి గ్రామంలో కోవిడ్ మొబైల్ వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నా.. తమ గ్రామానికి ఎందుకు రావడంలేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వ్యవసాయాధారిత ప్రాంతమైన పెద్ద పోచారంలో ఒక్కొక్కరుగా కన్ను మూస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు గ్రామంలో 12 మంది మృత్యువాత పడ్డారు. కారణాలు ఏమైనా.. వరుస మరణాలు సంభవిస్తుండటంతో తమను పట్టించుకునే వారే లేరా.. అనే ఆవేదన గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది. మరణించిన వారిలో కరోనా వైరస్ సోకిన వారు, వృద్ధాప్యంలో ఉన్న వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారు. సెప్టెంబర్ 15 నుంచి వరుసగా మరణాలు సంభవించడం, మరో వైపు జ్వరాల తీవ్రత పెరగడం.. అది ఏ జ్వరమో.. చికిత్స ఎక్కడ చేయించుకోవాలో..? ఎలాంటి మందులు వాడాలో.. చెప్పే వారే కరువయ్యారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరం అని చెబితే కరోనా.. అని అంటారనే భయంతో అనేక మందికి జ్వరాలు వచ్చినా బయటకు రాక అందుబాటులో ఉన్న వైద్యంతో సరిపెడుతున్నారని.. ఇది ఎటువైపు దారి తీస్తుందోనని భయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాధి నియంత్రణకు అన్ని ప్రాం తాల్లో చర్యలు చేపడుతున్నా.. తమ గ్రామంలో ప్రభుత్వ వైద్యం అందని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. గ్రామ ప్రజల్లో మనో ధైర్యం కలగాలంటే జ్వరపీడితులకు సరైన వైద్యం అందించడంతోపాటు కరోనాపై వారికి ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని గ్రామపెద్దలు అభిప్రాయ పడుతున్నారు. కాగా, ఇటీవల గ్రామంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. -
‘మా సమాధులపై రోడ్డు వేయండి’
సాక్షి, ఖమ్మం: మా భూములు లాక్కుంటే చావుకూడా వెనకాడం, మా శవాలను పూడ్చి సమాధులపై నుంచి రహదారి నిర్మించండి అంటూ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బాధిత రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణకు గాను అధికార యంత్రాంగం చింతకాని మండలం బస్వాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని రైతులతో శుక్రవారం ఉదయం నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొలుత రైతులు తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించారు. దీంతో బస్వాపురానికి చెందిన దొబ్బల వెంగళరావు మాట్లాడుతూ.. తమ ప్రాంతం నుంచి గతంలో సాగర్ కాల్వను తీశారని, ఈ క్రమంలో అనేక మంది రైతులు తమ భూములు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకి సైతం అవే రైతులకు సంబంధించిన భూములు కోల్పోవాల్సి వస్తుందని, దీంతో తాము భవిష్యత్తులో ఏమి చేయాలో అర్థంకావటం లేదన్నారు. గతంలో చేసిన అలైన్‌మెంట్‌ను రాజకీయ నాయకులు వారివారి స్వార్థం కోసం మార్చారని ఆరోపించారు. రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా భూములను లాక్కునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం మరికొంతమంది రైతులు మాట్లాడి, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు. సామరస్యంగా పరిష్కరించుకుందాం రైతులు అధైర్యపడొద్దని అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు తమవంతుగా ప్రయత్నం చేస్తామని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్నారు. అనంతరం ఎన్హెచ్ఏఐ డిప్యూటీ మేనేజర్ జానకిరామ్ మాట్లాడారు. గతంలో 70మీటర్లు ఉన్న రహదారిని 60మీటర్లకు కుదించటం జరిగిందన్నారు. సాయంత్రం కొదుమూరు గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో ఖమ్మం ఆర్డీఓ రవీంధ్రనా«థ్, చింతకాని తహసీల్దార్ తిరుమలచారి, భూ సేకరణ విభాగం డిప్యూటీ తహసీల్దార్ రంజిత్ పాల్గొన్నారు. – మధుసూదన్, అదనపు కలెక్టర్ -
రైతులను బ్లాక్మెయిల్ చేస్తారా?
సాక్షి, వైరా: కరోనా కష్టకాలంలో తెలంగాణ రైతాంగాన్ని తరుగు పేరుతో మిల్లర్లు, సొసైటీలు వేధిస్తున్నాయని.. ఇది ఎంతమాత్రం ఆయోదయోగ్యం కాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం ఖమ్మం జిల్లా వైరాలో పర్యటించిన ఆయన వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైరా సొసైటీకి సంబంధించి కాంటా వేసి, బస్తాలు వరంగల్ మిల్లుకు పంపితే.. ఆరేడు రోజులుగా వాటిని దించకుండా క్వింటాలకు ఏడెనిమిది కిలోలు తరుగు తీయాలని రైతులను పిలిపించారు. అలాగే మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండంలోని సఖినవీడు కొనుగోలు కేంద్రంనుంచి కొసుగోలు చేసిన ధాన్యాన్ని పెద్దపల్లి మిల్లుకు పంపారు. అక్కడా ఒక లోడుకు 14 క్వింటాల తరుగు తీస్తామని రైతులతో అన్నారని భట్టి విక్రమార్క చెప్పారు. ఇది ముమ్మాటికి రైతులను భయభ్రాంతులను చేయడమేనని సీఎల్పీ నేత అన్నారు. ఈ పరిణామాలు ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. (సాయం అంతలోనే మాయం!) సాధారణంగా ఒక్కసారి కాంటా వేసిన తరువాత ఆ ధాన్యంతోనూ, బస్తాలతో రైతులకు సంబంధం ఉండదని భట్టి చెప్పారు. కేవలం ఆ సొసైటీ లేదా కాంటా వేసే ఆర్గనైజేషన్ దీనికి బాధ్యత తీసుకోవాలన్నారు. రవాణా నుంచి లేదా మిల్లర్లకు అందించే వరకూ.. ధాన్యం తరుగుతోనూ ఇక వారిదే బాధ్యత తప్ప రైతులకు ఉండదని భట్టి స్పష్టం చేశారు. చాలాగ్రామాల్లో కాంటా వేసి, రవాణ జరిగి, మిల్లర్లకు చేరిన తరువాత కూడా తరుగు తీస్తున్నారని రైతులను నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది రైతులను బ్లాక్ మెయిల్ చేయడమేనని భట్టి చెప్పారు. వీటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఈ విషయంలో కిందిస్థాయి సిబ్బందినుంచి మొత్తం యంత్రాంగం వరకూ స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేయాలని అన్నారు. (తెలంగాణ: రాగల మూడు రోజులు వర్ష సూచన) -
నెగెటివ్ వచ్చినా క్వారంటైన్కే..
సాక్షి, ఖమ్మం: జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గత వారం పెద్దతండాకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికారులు అతడితో కాంటాక్ట్ అయిన వారి ఆచూకీ తెలుసుకుని 50 మందికి పైగా వ్యక్తులను పరీక్షల కోసం ఐసోలేషన్ తరలించారు. స్వాబ్ శాంపిళ్లు సేకరించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించగా వైద్య పరీక్షల్లో మోతీ నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈనెల 11వ తేదీన పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐదు రోజుల కిందట ఖమ్మం ఖిల్లా బజార్లో ఒకరికి పాజిటివ్ రాగా..శనివారం అతడి కుటుంబంలోని మరో మహిళకు కూడా సోకినట్లు తేలింది. తాజాగా ఆమె తొమ్మిదేళ్ల కూతురికి కూడా కరోనా ఉన్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలో కరోనా రోగుల సంఖ్య ఐదుకు చేరుకుంది. క్రమంగా సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. లాక్డౌన్ నిబంధనలను ఇంకా కఠినతరం చేశారు. మోతీ నగర్, ఖిల్లా, పెద్దతండా ప్రాంతాల్లో ఇంటింటినీ జల్లెడ పడుతున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తుల ఫోన్‌కాల్స్ ఆధారంగా ఎవరెవరిని కలిశారు అనే అంశంపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఏయే ప్రాంతాలకు వెళ్లారు? ఇతరులను కలిశారా? వారెంత మంది? వంటి విషయాలను కూపీ లాగుతున్నారు. అయితే ఖిల్లా ప్రాంతం వ్యక్తికి ఎలా పాజిటివ్ వచ్చిందనే విషయం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఇంకా అంతుచిక్కట్లేదు. ఒక్కరోజే 100 అనుమానిత కేసులు ఖమ్మంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని కరోనా వార్డుకు ఆదివారం ఒక్కరోజే 100కుపైగా అనుమానిత కేసులు వచ్చాయి. డాక్టర్లు వారిని పరీక్షించి లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్ వార్డుకు పంపారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది. నెగెటివ్ వచ్చినా క్వారంటైన్కే.. స్వాబ్ టెస్టులో నెగెటీవ్ వచ్చినా వారిని ఇంటికి పంపించకుండా శారద కళాశాలలో కానీ, మద్దులపల్లి వైటీసీ ప్రత్యేక క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో తొలుత నెగెటివ్ వచ్చి, కొన్ని రోజలకు పాజిటీవ్ వచ్చిన సంఘటనలు ఉండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇదీ లెక్క.. జిల్లాలో 304 శాంపిళ్లను హైదరాబాద్‌కు పంపించగా 202 టెస్టులు నెగెటీవ్ వచ్చాయి. మరో 97 కేసులకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది. విదేశాల నుంచి వచ్చిన 585 మందిని హోం క్వారెంటైన్లో ఉంచారు. శారద కళాశాలోని ప్రత్యేక క్వారంటైన్లో 25 మంది, వైటీసీలో మరో 8 మందిని ఉంచారు. పెద్దాస్పత్రిలోని కరోనా వార్డులో ఇంత వరకు 1,192 మందికి ఓపీ, 325 మందికి ఇన్‌పేషెంట్ సేవలు అందించారు. ఈ మేరకు డీఎంహెచ్ఓ డాక్టర్ బి. మాలతి ఆదివారం హెల్త్ బులిటెన్‌లో వివరాలు వెల్లడించారు. ఖిల్లాలో..కట్టుదిట్టం నగరంలోని ఖిల్లా ప్రాంతంలోనే మూడు కేసులు నమోదవడంతో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడి వారు బయటకు వెళ్లకుండా, ఇతర ప్రాంతాల వారు లోనికి రాకుండా నిఘా పెట్టారు. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. -
కొత్త సార్లొస్తున్నారు..
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు రానున్నారు. పెండింగ్‌లో ఉన్న టీఆర్టీ(టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) పోస్టులను భర్తీ చేసేందుకు రెండు రోజుల క్రితం జీఓ రాగా, అనంతరం షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటివరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్లతో నెట్టుకురాగా.. ఆయా పోస్టుల్లో కొత్త టీచర్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో 130 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో టీఆర్టీ ప్రకటన చేసింది. 2018 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించింది. అదే ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి.. విడతలవారీగా సెప్టెంబర్ 2018, ఏప్రిల్ 2019లో జాబితా విడుదల చేసింది. అయితే టీఆర్టీ నియామకాలపై మార్గదర్శకాలు జారీ చేసి.. అభ్యర్థుల ఎంపిక చేపట్టకపోవడంతో దాదాపు 20 నెలలపాటు అభ్యర్థులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం నియామక పత్రాలపై జీఓను విడుదల చేయడంతో త్వరలోనే అభ్యర్థులు టీచర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు.. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి జిల్లాకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్.. కార్యదర్శిగా డీఈఓ మదన్మోహన్ వ్యవహరించనున్నారు. పలువురు జిల్లాస్థాయి అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. పాఠశాల విద్యాశాఖ టీఆర్టీ జాబితాను ఇప్పటికే జిల్లా కమిటీకి సమర్పించింది. రోస్టర్, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో జిల్లా కమిటీలు తమ పరిధిలోని సబ్జెక్టులవారీగా ఖాళీలను గుర్తించి.. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ ఇలా.. టీఆర్టీ నియామకాలకు సంబంధించి షెడ్యూల్ ఇలా ఉంది. ఎంపికైన అభ్యర్థుల లిస్టును కేటగిరీ, మీడియంవారీగా ఈనెల 10న ప్రదర్శించనున్నారు. 11న జిల్లాస్థాయి కమిటీ సమావేశమై ఖాళీల పరిస్థితిని తెలుసుకొని కేటగిరీ, మీడియంలవారీగా ఖాళీలను వెల్లడిస్తారు. 13, 14వ తేదీన అభ్యర్థులకు కేటగిరీ, మీడియంవారీగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పోస్టింగ్ పొందిన కొత్త టీచర్లు ఈనెల 15న పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 17న జాయిన్ కానీ, రిపోర్టు చేయని అభ్యర్థుల వివరాలను గుర్తిస్తారు. 19న ఎంపికైన టీచర్లు జాయినింగ్ రిపోర్టును ఎంఈఓలు, హెచ్ఎంలకు అందజేయాలి. వేగవంతం చేస్తున్నాం.. టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పూర్వ ఖమ్మం జిల్లా నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశాల మేరకు త్వరలోనే నియామకాలు చేపట్టనున్నాం. మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నాం. – పి.మదన్మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి -
భయం.. భయంగా..
సాక్షి, సత్తుపల్లి(ఖమ్మం జిల్లా): సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీలో బొగ్గు తవ్వకాలతో ఎన్టీఆర్ కాలనీకి ముప్పు ఏర్పడింది. కాలనీ ఓపెన్‌కాస్ట్‌కు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఎన్టీఆర్ కాలనీలో సుమారు 579 ఇళ్లు ఉన్నాయి. వీటిలో ముప్పావంతుకు పైగా దెబ్బతిన్నాయి. గనిలో బొగ్గు వెలికితీతకు బాంబులు పేల్చేటప్పుడు భూమి కంపిస్తోంది. శ్లాబులు పెచ్చులూడి పడిపోతున్నయి. ఇళ్లు ఊగిపోతున్నాయి. చాలా మంది కర్రలు పోటుపెట్టి బతుకీడుస్తున్నారు. బాంబుల తీవ్రత తగ్గిం చాలని పలుమార్లు ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈసమస్యను స్థానిక ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలో ప్రస్తావించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి శాసన మండలిలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయినా ప్రభుత్వం కానీ, సింగరేణి సంస్థ కానీ స్పందించడంలేదు. సీఎం క్యాంప్ ఆఫీస్, సింగరేణి సీఎండీ శ్రీధర్, సింగరేణి డైరెక్టర్‌కు పలు మార్లు విజ్ఞప్తులు పంపించామని, అయినా ఫలి తం కన్పించటం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలనలతోనే సరి ఎన్టీఆర్నగర్ కాలనీ వాసులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. అధికారులు మొక్కబడిగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి పోతున్నారు. ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. సింగరేణి ఏరియా జీఎం, పీఓ వచ్చి పరిశీలించి వెళ్లారు. కానీ ఎలాం టి చర్యలూ తీసుకోలేదు. ఇటీవల స్థానికులు ఖమ్మం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో బుధవారం రెవెన్యూ, మైనింగ్, సర్వే సిబ్బంది దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. న్యాయం చేస్తామని కానీ, పరిహారం ఇస్తామనికానీ హామీ ఇవ్వలేదు. ఇంటింటి సర్వే నిర్వహించి ఆర్అండ్బీ ఇంజనీర్లతో పరిశీలన చేయించాలని, ఇల్లు ఎంతమేరకు దెబ్బతిన్నాయి..? నివాస యో గ్యానికి పని చేస్తాయా..? తదితర అంశాలను స్పష్టంగా తేల్చాలని బాధితులు కోరుతున్నారు. దెబ్బతిన్న ఇళ్లను తొలగించి కొత్త ఇళ్లను కట్టించాలని, లేని పక్షంలో సింగరేణి స్వాధీనం చేసుకొని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యంతో జబ్బులు సింగరేణి బొగ్గు తవ్వకాలతో వాతావరణం కలుషితమై కాలుష్యం పెరిగిపోయి రోగాల బారినపడుతున్నారు. ఛర్మ వ్యాధులు, కిడ్ని, శ్వాసకోశ, కణితులు, దృష్టిలోపం, లీవర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే బొగ్గు నుసితో నల్లగా మారిపోతున్నాం. మంచినీళ్లతో సహా అన్నీ కలుషితం అవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సింగరేణి యాజమాన్యానికి పలుమార్లు మొరపెట్టుకోగా కంటితుడుపు చర్యగా మెడికల్ క్యాంప్‌లు నిర్వహించారు కానీ ఎటువంటి ప్రయోజనం కలగలేదు. సింగరేణి సంస్థ ఇంటింటి సర్వే నిర్వ హించి హెల్త్‌కార్డులు ఇచ్చి సింగరేణి ఆస్పత్రిలో ఉచిత వైద్యం సహాయం అందించాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. -
దొంగ ఓట్లు వేయించారు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం నగరంలోని సిద్ధారెడ్డి కళాశాల పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు దొంగ ఓట్లు వేయించారని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ఆరోపించారు. గురువారం పోలింగ్ జరుగుతున్న తరుణంలో కొద్ది మంది దొంగ ఓట్లు వేస్తున్నారనే సమాచారం అందటంతో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించానని తెలిపారు. అనంతరం ఆమె పోలింగ్ సరళిని తెలుసుకొని అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో పసి పిల్లలతో వచ్చిన వాళ్లను, వృద్ధులను పోలింగ్ కేంద్రంలోకి పంపించాలన్నారు. ఈ క్రమంలోనే సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించగా.. దొంగ ఓట్లు వేస్తున్నారని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. -
జెడ్పీకి గుడ్‌బై..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి గడిపల్లి కవిత రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 2014 ఆగస్టు 7వ తేదీన బాధ్యతలు చేపట్టిన ఆమె సుమారు 54 నెలలపాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. కవిత రాజీనామా జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా టీడీపీలో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె గతంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోటీ చేసి ఓటమి చెందారు. టీడీపీలో ఉన్నంతకాలం తుమ్మల అనుచరురాలిగా ఉన్న కవిత.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం(ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా) జెడ్పీటీసీగా గెలుపొందారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళలకు రిజర్వ్ కావడంతో.. టీడీపీలో అప్పుడు కీలకంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో అనూహ్యంగా కవితను ఆ పదవి వరించింది. తన రాజకీయ గురువుగా భావించే తుమ్మల నాగేశ్వరరావుతోపాటే ఆమె 2014 సెప్టెంబర్‌లో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మధిర ‘అసెంబ్లీ’పై ఆసక్తి చూపి.. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధిర నుంచి పోటీ చేయడానికి ఆమె ఆసక్తి ప్రదర్శించారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థిత్వం లింగాల కమల్రాజుకు ఖరారైంది. శాసనసభ ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేక తనకు రాజకీయ అండదండలు అందించిన వ్యక్తి ఓటమి చెందడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు కవిత శనివారం తనను కలిసిన విలేకరులకు వివరించారు. వెంకటాపురం జెడ్పీటీసీ పదవికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి తాను రాజీనామా చేశానని, అయితే టీఆర్ఎస్ పార్టీలో ఇక మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తానని రాజీనామా చేయడానికి రాజకీయ కారణాలతోపాటు కొన్ని వ్యక్తిగత కారణాలు సైతం ఉన్నాయని ఆమె వివరించారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి సాధారణ కార్యకర్తగా నిరంతరం కృషి చేస్తానన్నారు. చైర్‌పర్సన్‌గా తనను ఆదరించి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడా పదవి ఎవరికి..? జెడ్పీ చైర్పర్సన్ పదవికి కవిత ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవి ఎవరిని వరిస్తుంది..? ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీ వరకు జిల్లా పరిషత్ పాలక వర్గ పదవీ కాలం ఉంది. ఈలోపే జెడ్పీ చైర్పర్సన్ పదవికి కవిత రాజీనామా చేయడంతో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా ఉన్న వారు చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బరపటి వాసుదేవరావు పాల్వంచ జెడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ తరఫున ఎన్నికై తుమ్మల నాగేశ్వరరావుతోపాటు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. తుమ్మల సన్నిహితుడిగా పేరొందిన బరపటి వాసుదేవరావును జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లా పరిషత్ పదవీ కాలం ముగిసే లోపు చైర్మన్ రాజీనామా చేస్తే వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీనేనని.. అదే తరహా సంప్రదాయం కొనసాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టీడీపీ గెలుపొందడంతో గడిపల్లి కవిత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశం లభించింది. 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకుంది. పలు కీలక మండలాల జెడ్పీటీసీ పదవులను కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరమైన చర్చ కొనసాగుతోంది. మిగిలిన పదవీ కాలం రెండు నెలలే.. రెండునెలల్లో జిల్లా పరిషత్ పదవీకాలం ముగుస్తుండటంతో కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. వైస్ చైర్మన్‌కు చైర్మన్‌గా బా§ధ్యతలు అప్పగించే అవకాశం సైతం లేకపోలేదని చర్చ జరుగుతోంది. 2014లో 46 మండలాల జెడ్పీటీసీ పదవులకు ఎన్నికలు జరగ్గా.. రాష్ట్ర విభజన అనంతరం ఐదు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో 41 మండలాల జెడ్పీటీసీలు జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి పలువురు జెడ్పీటీసీలు టీఆర్ఎస్లో చేరడంతో జిల్లా పరిషత్‌లో టీఆర్ఎస్ మెజార్టీ కలిగి ఉంది. వాసుకు చైర్మన్ గిరి దక్కేనా? పాల్వంచరూరల్: జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి గడిపల్లి కవిత రాజీనామా చేయడంతో వైస్ చైర్మన్‌కు ఆ పదవి దక్కుతుందనే చర్చ సాగుతోంది. పాల్వంచ జెడ్పీటీసీ సభ్యుడు బరపటి వాసుదేవరావు ప్రస్తుతం జెడ్పీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. 2014లో పాల్వంచ జెడ్పీటీసీగా టీడీపీ నుంచి విజయం సాధించిన ఆయన తుమ్మల నాగేశ్వరరావుతోపాటే టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. తుమ్మలకు సన్నిహితుడనే పేరు కూడా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది. -
85.05 శాతం పోలింగ్..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం రెండు నెలలుగా పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో జిల్లావ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటలు మాత్రం జిల్లాలోని అనేక పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. కొన్నిచోట్ల ఉదయం 10 గంటల వరకు పనిచేయకపోవడంతో అధికారులు హుటాహుటిన ప్రత్యామ్నాయ ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఈసారి పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పెట్టిన నిబంధనల వల్ల పార్టీల శిబిరాలు పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఏర్పాటు చేశారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ శాతం పెరుగుతుందని భావించినా.. వికలాంగుల పోలింగ్ శాతం కొంత పెరిగినా.. సాధారణ పోలింగ్ శాతం మాత్రం గతంకన్నా కొంత తగ్గింది. ఓటర్లలో అనాసక్తి పెరగడానికి గల కారణాలపై ఎవరికి వారు తమదైన రీతిలో విశ్లేషిస్తున్నారు. పలు రాజకీయ పక్షాలు ఓటర్లను పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ప్రలోభాలకు గురిచేయడం.. అవి అందరికీ చేరకపోవడం సైతం పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తగ్గడానికి ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నోటాకు ఎక్కువ సంఖ్యలో ఓట్లుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నోటు రాలేదని నోటాపై మక్కువ చూపినట్లు రాజకీయ పక్షాలు చమత్కార వాగ్బాణాలు వదులుతున్నాయి. దీంతో ఏ రాజకీయ పక్షానికి ప్రయోజనం.. ఎవరి ఓట్లు నోటాకు పడ్డాయి.. అనే కోణంలో రాజకీయ కూడికలు, తీసివేతల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. విశిష్టతను చాటిన పోలింగ్ సరళి పోలింగ్ సరళి ఈసారి విశిష్టతను చాటింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు ఒక మోస్తారుగా కొనసాగగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి క్రమేణా పెరుగుతూ వచ్చింది. సాధారణంగా 5 గంటల వరకే పోలింగ్ సమయం కాగా.. తిరుమలాయపాలెం మండలం హైదర్‌సాయిపేట, సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సమయం ఇచ్చారు. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయా పార్టీల అభ్యర్థులు సందర్శించి.. ఓటింగ్ సరళిని పరిశీలించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తదితరులు ఖమ్మంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్లూరు మండలం నారాయణపురంలో ఓటు హక్కును వినియోగించుకోగా.. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అదే పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రధాన సంఘటనలు ఏమీ జరగకపోవడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అయితే రఘునాథపాలెం మండలంలో కార్యకర్తలను చెదరగొడుతున్న సమయంలో ఒక పోలీస్ అధికారి లాఠీ కాంగ్రెస్ కార్యకర్తకు తగలడంతో తల పగిలింది. ఇక పోలింగ్ జరిగిన తీరుపై జిల్లాలోని పలు రాజకీయ పక్షాలు తమదైన రీతిలో స్పందించాయి. ఖమ్మంలోని ఒక పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు పోలయ్యాయని, దీనికి ఆధారాలు సైతం లభించాయంటూ టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు సదరు పోలింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడి.. నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేశారని, వారిపై చర్య తీసుకోవాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. నగరంలోని ఓ పోలింగ్ బూత్‌లో పోలింగ్ స్లిప్‌లపై ఫొటోలు మార్చి జిరాక్స్ పత్రాల ద్వారా ఓటు వేసే ప్రయత్నం చేశారంటూ టీడీపీ అభ్యర్థి నామా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయగా.. ఫిర్యాదును పరిశీలించి చర్య తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. 85.05 శాతం పోలింగ్.. ఈ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 85.05 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. ఉదయం 6 గంటల వరకు ఎన్నికల సిబ్బంది సామగ్రిని సిద్ధం చేసుకుని.. 6.30 గంటలకు ఆయా పార్టీల ఏజెంట్ల ఎదుట మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో.. ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పూర్తయ్యాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ పోలింగ్ సరళిని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. కలెక్టర్ నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల పోలింగ్ బూత్.. సిద్ధారెడ్డి కళాశాలలోని పోలింగ్ బూత్‌లను పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి పరిశీలించారు. మొరాయించిన ఈవీఎంలు.. జిల్లావ్యాప్తంగా పలు పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. సత్తుపల్లిలోని జేవీఆర్ డిగ్రీ కళాశాల పోలింగ్ బూత్, కిష్టారంలోని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. వైరా నియోజకవర్గ కేంద్రమైన వైరాతోపాటు గుండ్రాతిమడుగు, కారేపల్లి, కొణిజర్ల ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ ఏజెంట్లు అధికారులకు సమాచారం ఇచ్చి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూశారు. తిరుమలాయపాలెం మండలం హైదర్‌సాయిపేట పోలింగ్ బూత్ వద్ద సాయంత్రం 5 గంటలకు ఈవీఎం మొరాయించింది. దీంతో అప్పటి వరకు పోలింగ్ బూత్‌లో 300 మంది వరకు క్యూలో ఉన్నారు. మళ్లీ 6 గంటలకు ఈవీఎంలు పనిచేయడంతో వారితో ఓట్లు వేయించారు. మధిర మండలం మహదేవపురం, మధిరలోని హరిజనవాడ, మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో వాటి స్థానంలో కొత్తవి అమర్చి ఉదయం 8.30 గంటలకు మళ్లీ పోలింగ్ ప్రారంభించారు. ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంప్ నిర్మల్ హృదయ్ ప్రాథమిక పాఠశాలలోని 109 పోలింగ్ బూత్‌లో ఈవీఎం ఉదయం 40 నిమిషాలపాటు మొరాయించింది. మహిళా డిగ్రీ కళాశాలలోని 179వ పోలింగ్ బూత్‌లో ఉదయం 9.17 గంటల సమయంలో ఈవీఎం మొరాయించడంతో అధికారులు ఓటింగ్ ప్రక్రియను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి నామా బూత్‌లోకి వెళ్లి ప్రిసైడింగ్ అధికారితో మాట్లాడారు. ఎంత సేపటికీ మిషన్ పనిచేయకపోవడంతో మరో ఈవీఎంను ఏర్పాటు చేసి.. 45 నిమిషాల తర్వాత ఓటింగ్‌ను ప్రారంభించారు. ఆందోళనలు .. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఓట్లు వేసే ప్రసక్తి లేదని కొందరు ప్రజలు ఆందోళనకు దిగారు. ఖమ్మంలోని 26వ డివిజన్లో స్థానికులు తమ ప్రాంత సమస్యలను పరిష్కరించలేదని.. ఓటింగ్‌ను బహిష్కరిస్తామని ఆందోళన చేపట్టారు. స్థానిక నేతల హామీతో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించే వరకు ఓటు వినియోగించుకోమన్నారు. ఏన్కూరు మండలం పీకే తండాలో సీసీ రోడ్డు నిర్మించాలంటూ ఆందోళన చేయడంతో ఎస్సై పవన్ హామీతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూలూరుపాడు మండలం నల్లబండబోడు గ్రామస్తులు అనంతారం–నల్లబండబోడు గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ సుమారు రెండు గంటలపాటు ఆందోళనకు దిగారు. తహసీల్దార్ రమేష్ హామీతో ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్నా రు. బేతాళపాడు, పాపకొల్లు గ్రామస్తులు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ ఆందోళన చేసి.. నిరసన వ్యక్తంచేశారు. అధికారుల హామీతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
పేదలందరికీ సంక్షేమ పథకాలు
సాక్షి,సత్తుపల్లిరూరల్: కారు గుర్తుకు ఓటు వేస్తేనే అభివృద్ధి, సంక్షేమం అందుతుంది మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. మండలంలోని రామానగరం, గంగారం, పాకలగూడెం, బేతుపల్లి గ్రామాలలో ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మట్టా దయానంద్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ పాలనలో పేదలందరికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయన్నారు. పిడమర్తి రవిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. పిడమర్తి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే గంగారంలో వెయ్యి ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. పలు కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరాయి. కార్యక్రమంలో ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, మండల అధ్యక్షుడు చల్లగుళ్ల నర్సింహారావు, గాదె సత్యనారాయణ, సోమరాజు సీతారామరాజు, రాచమళ్ల కృష్ణమూర్తి, మాదిరాజు వాసు, మోరంపూడి ప్రభాకర్, వినుకొండ కృష్ణ, మందపాటి రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి, ఎస్కె ఖాసీం, దేవళ్ల దాసు, కొత్తూరు ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. -
అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ కండువాలు
సాక్షి,అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో గల అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం టీఆర్ఎస్ కండువాలు వేశారు. ఈ చర్యతో అంబేడ్కర్‌ను అవమానపరిచారని, బాధ్యులపై కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీతో పాటు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విగ్రహానికి టీఆర్ఎస్ కండువాలు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో అధికారులు స్పందించారు. తహసీల్దార్ అరుణ ఆదేశాల మేరకు ఎన్నికల నియమావళి అధికారి కె.ఈదయ్య కండువాలు తొలగించారు. -
ఎన్నికలపై పోలీసుల ప్రత్యేక దృష్టి
సాక్షి, నేలకొండపల్లి: ఎన్నికల కోడ్ నేపథ్యంలో పాత నేరస్తులు...నాటు సారా విక్రయదారులు...బెల్ట్‌షాపు నిర్వాహకులు, రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై పోలీసులు దృష్టి సారించా రు. సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవటంతో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు ముందస్తు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో ని అన్ని పోలీస్స్టేషన్లు, సర్కిల్, డివిజన్, జిల్లా కార్యాలయాల వారీగా పలువురిని పిలిపించి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తున్నారు. మద్యం సేవించి ఎన్నికల సమయంలో గోడవలు సృష్టించే వారిని, రాజకీయ కక్ష సాధింపు అల్లర్లు చేసే వారిని బైండోవర్ చేస్తున్నారు. పాత నేరస్తులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వారం వారం పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. పల్లెలు ప్రశాంతం జిల్లాలోని ప్రతీ మారుమూల గ్రామంలో ఉన్న బెల్ట్‌షాపులు మూసివేయటంతో పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నందున్న గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా మద్యం, సారా ఇతరత్రా పదార్థాలు విక్రయాలు లేకుండా పోలీసులు గట్టి నిఘా ఉంచారు. గ్రామాల్లో మందు లేకపోవటంతో మద్యం ప్రియులు పొద్దుగూక ముందే ఇంటికి చేరుతున్నారు. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బైండోవర్ చేస్తున్నాం అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా జరిపించేందుకు పాత నేరస్తులను ముందస్తుగా బైండోవర్ చేస్తున్నాం. ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాం తంగా వినియోగించుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టాం. పాత నేరస్తులు, బెల్ట్‌షాపు నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు 17 కేసు లు నమోదు చేసి 407మందిని బైండోవర్ చేశాం. ఓటు హక్కు వినియోగంపై కళాజాతా ద్వారా చైతన్యం చేస్తున్నాం. ఎక్కడైనా మద్యం, సారా విక్రయాలు జరిపితే సహించేది లేదు. –ఎన్.గౌతమ్, ఎస్సై, నేలకొండపల్లి -
అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారం
సాక్షి, ఇల్లెందు(ఖమ్మం):ఇల్లెందు పట్టణం, మండలంలో టీఆర్ఎస్తో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తమ తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మంగళవారం వేర్వేరుగా ప్రచారాలు నిర్వహించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పూబెల్లి, కొల్లాపురం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటు అభ్యర్థించారు. టీఆర్ఎస్ జిల్లా నాయకులు మడత వెంకట్‌గౌడ్ సారధ్యం చేపట్టిన ప్రచారంలో మండల కో ఆఫ్సన్ సభ్యులు జానీబాబా, మాజీ సర్పంచ్ చీమల నాగరత్నం, రావుల ఐలయ్య, కల్తీ పద్మ, ధనుంజయ, సుకనకయ్య, ఆత్మకమిటీ చైర్మన్ ముక్తి కృష్ణ, ఎంపీటీసీలు మండల రాము, గోపాల్, నేతలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలో ఆర్అండ్ఆర్ 16వ వార్డులో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సిలివేరు సత్యనారాయణ, కోటిరెడ్డి, జేకే శ్రీను, మేకల శ్యాం, అక్కిరాజు గణేష్, మడుగు సాంబమూర్తి, తిరుపతిరావు తదితరలు పాల్గొని అభ్యర్థి కోరం కనకయ్యను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో బీజేపీ ప్రచారం.. పట్టణంలోని బస్టాండ్ సెంటర్, వివిధ వార్డులో బీజేపీ అభ్యర్ధి మోకాళ్ల నాగ స్రవంతి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓటు అభ్యర్థించారు. ఇప్పటి వరకు ఎన్డీ, సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్‌లకు అవకాశం ఇచ్చారని, ఈ దఫా తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. నాయకులు బిందె కుటుంబరావు,బలగాని గోపీకృష్ణ, తెప్పల శ్రీనివాస్, విజయారాణి, పట్నం మహిపాల్, అజయ్, సంకెళ్ల శారద తదితరులు ఆమె వెంట ఉన్నారు. మంగ్యతండాలో .. టేకులపల్లి: మండలంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే మండలంలోని మంగ్యతండాలో జెడ్పీటీసీ సభ్యుడు లక్కినేని సురేందర్‌రావు ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు. కోరం కనకయ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పూనెం సురేందర్, బుర్ర ధర్మయ్య, దేవ్‌సింగ్, మంగ్య, కోటి, రామకృష్ణ, మురళి, డాలయ్య తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరికలు .. ఇల్లెందు: తాజా, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ కో ఆఫ్సన్ సభ్యులు మడత వెంకట్‌గౌడ్ సమక్షంలో వార్డు కౌన్సిలర్ పి. స్వర్ణలత, పర్రె శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో వార్డుకు చెందిన 60 కుటుంబాలు వారు టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్, టీడీపీ, ఎన్డీల నుంచి పి.నరేందర్, తరాల రమేష్, రాజేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, బోగ రవి, ఉపేంద్ర, లక్ష్మి, యశోద, విజయ, దన్నా, వాహేద, దుర్గయ్యలతో పాటు 60 కుటుంబాలు చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కనకయ్య, వెంకట్‌గౌడ్‌లు మాట్లాడుతూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పర్రె స్వర్ణలత, పర్రె శ్రీనివాస్, నాయకులు అక్కిరాజు గణేష్, సిలివేరు సత్యనారాయణ, గందె సదానందం, ఎంపీటీసీ సురేందర్, రాము, జేకే శ్రీను, మన్నాన్, బస్తీ ప్రజలు పాల్గొన్నారు. -
అడవిలో ఎమ్మెల్యే...
టేకులపల్లి : మండలంలోని కొప్పురాయి పంచాయతీ మొట్లగూడెం గ్రామాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య సందర్శించారు. ఈ మేరకు గ్రామానికి చెందిన గిరిజనులకు అటవీ శాఖాధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో జెడ్పీటీసీతో కలిసి శనివారం సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. రైతులు ఎవరూ భయపడొద్దని అందరికీ అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫారెస్టు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు లక్కినేని సురేందర్‌రావు, నాయకులు కణతాల వసంతరావు, ఇస్లావత్ దేవ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం రవాణా వేగవంతం చేయాలి
సత్తుపల్లిటౌన్ : జిల్లాలో మార్కెఫెడ్, సివిల్ సప్లయ్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కల రవాణాను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. సత్తుపల్లి మార్కెట్ యార్డులోని మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో 20 రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారని.. ఈ విషయాన్ని కలెక్టర్‌తోపాటు మార్క్‌ఫెడ్, సివిల్ సప్లైయ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వాతావరణం బాగాలేనందున అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకపోవటం, ఇన్చార్జ్ కలెక్టర్‌కు అవగాహన లేనందున అధికార యంత్రాంగం ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారన్నారు. మిర్చి, మామిడి పంటలు కూడా అకాల వర్షానికి దెబ్బతిన్నాయని, వీరిని ప్రభుత్వ ఆదుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతాంగానికి తాగునీరు, టెంట్, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రామ్మోహన్, కూసంపూడి మహేష్, దూదిపాల రాంబాబు, వెలిశాల లక్ష్మాచారి, అద్దంకి అనిల్, చక్రవర్తి, పుచ్చా వెంకటేశ్వరరావు, వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కురిటి రాఘవులు, వినోద్, చంటి, మోటపోతుల నాగేశ్వరరావు, షట్రక్, నాని పాల్గొన్నారు. -
‘మేరా భారత్’ పోస్టర్ ఆవిష్కరణ
ఖమ్మంమయూరిసెంటర్ : వీధి బాలల జీవితాన్ని కళ్లకు కట్టేలా మేరా భారత్ మహాన్ షార్ట్ ఫిలిం నిర్మించడం అభినందనీయమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మేరా భారత్ షార్ట్ ఫిలిం పోస్టర్‌ను శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ భారతదేశ చరిత్రను భావి తరాలకు తెలియచేస్తూ, స్ఫూర్తిదాయకమైన, సందేశాత్మకమైన షార్ట్‌ఫిలింలను నిర్మించాలని ఈ సందర్భంగా ఎంపీ వారికి సూచించారు. చిన్నారులతో షార్ట్‌ఫిలిం నిర్మించిన దర్శక నిర్మాతలను ఎంపీ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలను నిర్మించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లింగాల కమలరాజు, కొప్పురావూరి వెంకటకృష్ణ, అజ్మీరా అశోక్‌నాయక్, ఫిలిం డైరెక్టర్ బేతంపూడి శ్రీకాంత్, నిర్మాత మండె రమణ నటీనటులు అశ్విన్, ప్రదీప్, కెమెరామెన్ లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫీ సరదా.. ప్రాణాలు తీసింది
ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని ప్రయివేట్ కళాశాల ఇంటర్ సెకండియర్ విద్యార్థులైన నగరానికి చెందిన ఆ తొమ్మిదిమంది మిత్రులు బుధవారం చివరి పరీక్ష రాశారు. ఆనందంగా ఇళ్లకెళ్లారు. భోజనాలు ముగించుకున్నారు. - ‘హమ్మయ్య.. పరీక్షలు అయిపోయాయి. ఎవరెవరం ఎక్కడ చదువుతామో, ఏ స్థాయిలో ఉంటామో తెలియదు. అందుకే, ఈ చివరి రోజున సెల్ఫీలు దిగుదాం.. జ్ఞాపకాలుగా దాచుకుందాం’ అని ముందే అనుకున్నారు. అంతా ఒకచోట కలుసుకున్నారు. మంచి లొకేషన్ కోసం మూడు బైక్‌లపై నగరంలోగల మున్నేటి వద్దకు వెళ్లారు. సెల్ఫీలు దిగుతున్నారు. - ముస్తాఫానగర్‌కు చెందిన మాడుగు ప్రణయ్(17) కాలుకు మట్టి అంటింది. నీటిలోకి దిగి శుభ్రం చేసుకుంటున్నాడు. ఇంతలో కాలు జారింది... నీటిలో పడిపోయాడు. స్నేహితులంతా నిశ్చేష్టులై చూస్తున్నారు. భయంతో వారి గొంతులు పెగల్లేదు. - ఇందిరానగర్‌కు చెందిన కత్తుల రాహుల్(17) ఏమాత్రం ఆలోచించలేదు. మిత్రుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడు కూడా నీటిలోకి జారి పడిపోయాడు. క్షణాల్లోనే ఇద్దరూ గల్లంతయ్యారు. - మిగతా మిత్రులు తేరుకున్నారు. వారికి ఈత రాదు. దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నారు.. గట్టిగా అరుస్తున్నారు. అక్కడకు దగ్గరలో ఉన్న కొందరు పరుగు పరుగున వచ్చారు. - అర్బన్ సీఐ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఎస్ఐలు మోహన్‌రావు, అశోక్ చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీయించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. - ఆ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆ ఏడుగురు మిత్రులకు కన్నీళ్లు ఆగడం లేదు. రాహుల్ తండ్రి ప్రసాద్, ఐసీడీఎస్ ఉద్యోగి. ఫ్రెండ్స్‌తో బయటికెళుతున్నానని అమ్మతో చెప్పి వెళ్లాడని, ఇక తిరిగి రాడని అనుకోలేదని అంటూ తల్లి రాధిక గుండె బాదుకుంటోంది. ప్రణయ్ తండ్రి బీమా కంపెనీలో చిరుద్యోగి. -
పొలిటికల్ వేడిని రగిలించిన 2017
ఈ ఏడాది రాజకీయాలు మరింత వేడెక్కాయి. అన్ని పార్టీలు క్రియాశీలకంగా వ్యవహరించాయి. ముఖ్యమంత్రి జిల్లాపై మరింత శ్రద్ధ పెట్టారు. అధికార పార్టీ అభివృద్ధి పేరిట..మంత్రులతో చక్కర్లు కొట్టించింది. లోపాలు, వైఫల్యాలపై కమ్యూనిస్టులు కాస్త గుర్రుమన్నారు. టీడీపీలో ఆటుపోట్లు, కాంగ్రెస్‌లో సమన్వయానికి దిద్దుబాట్లు, వైఎస్సార్సీపీ పాతబలాన్ని పొందేందుకు కసరత్తుతో.. రాజకీయ వేడి రగులుకుంది. భవిష్యత్‌లో సై..అనేందుకు సిద్ధమనే సంకేతాలనిచ్చింది. సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజకీయ చైతన్యానికి గుమ్మంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ అభివృద్ధి మంత్రాన్ని ఆద్యంతం పటించగా.. విపక్ష రాజకీయ పక్షాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, సంస్థాగత అంశాలపై దృష్టి సారించి ఈ సంవత్సరం జిల్లా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. నూతన సంవత్సరం 2017 ఆరంభంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖమ్మంజిల్లాకు విచ్చేసి తిరుమలాయపాలెం వంటి కరువుపీడిత ప్రాంతంలో సాగునీటిని ప్రవహింపచేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలోచనతో రూపుదిద్దుకున్న జలసిరులు కురిపించే భక్తరామదాసు ప్రాజెక్టును ప్రారంభించారు. చైతన్య రాజకీయాలకు చిరునామా అయిన ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో కీలకమైన భక్తరామదాసు ప్రాజెక్టు మొదటిదశను సీఎం ప్రారంభించగా.. మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో ఏడాది లోపే రెండో దశను సైతం పూర్తి చేయించి సాగునీటిని అందించేందుకు అధికారులను సమాయత్తం చేయించారు. ఇప్పటికే ట్రయల్‌రన్ పూర్తికాగా.. మరికొద్ది రోజుల్లో భక్తరామదాసు రెండో దశనుంచి సాగునీరు ఆయా ప్రాంతాలకు అందనున్నది. పాలేరు ప్రాంతంలో వందలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు గతంలో రూపొందించి నిరుపయోగంగా ఉన్న పాలేరు పాతకాల్వను ఆధునిక హంగులతో పునరుద్ధరింప చేయగా.. పాతకాల్వను మంత్రి హరీష్‌రావు అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రూపొందించిన సీతారామ సాగర్ ప్రాజెక్టు పనులు కొంతమేరకు ఊపందుకున్నా.. ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉందన్న భావనను ఈ సంవత్సరం పనులు కలిగించాయి. ఎన్నికల వాతావరణం.. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో అప్పుడే ఎన్నికల వాతావరణం ఏర్పడింది. అనేక నియోజకవర్గాల్లో వివిధ రాజకీయ పక్షాల మధ్య పరస్పర ఆరోపణలు, సవాల్, ప్రతిసవాళ్లు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సున్నం రాజయ్య, సండ్ర వెంకటవీరయ్య, మల్లు భట్టి విక్రమార్కలు ఆయా పార్టీల బలోపేతానికి, పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఈ సంవత్సరం అంతా తామై నిలిచారు. సీపీఎం జిల్లా మహాసభలను ఈ సంవత్సరం వైరాలో ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు ప్రజా సమస్యలపై చేయాల్సిన పోరాటాలపై దిశానిర్దేశం చేసింది. సీపీఐ సైతం పార్టీ నిర్మాణంపై దృష్టి సారించడంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలుపుకుని పోరుబాట బస్‌యాత్రను నిర్వహించింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరు నిర్వహించడం ద్వారా ఈ సంవత్సరం కీలకంగా నిలిచింది. ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం జిల్లా అధ్యక్షులు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. అగ్రనేతలు కదిలొచ్చారు. కాంగ్రెస్ పార్టీ..: ఖమ్మంలో నిర్వహించిన సదస్సు ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. అలాగే డిసెంబర్ మొదటివారంలో ఖమ్మం అర్బన్ మండలం రఘునాథపాలెంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో ప్రజా చైతన్య సభను నిర్వహించింది. టీడీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా తుళ్లూరి బ్రహ్మయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా కోనేరు సత్యనారాయణ (చిన్ని)లను పార్టీ అధిష్టానం నియమించింది. ఐటీ అడుగులు.. ఖమ్మం కేంద్రంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తృతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఖమ్మంకు మంజూరు చేసిన ఐటీ హబ్‌కు జూన్ 15వ తేదీన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. జిల్లాకు పారిశ్రామిక పరంగా ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తామన్న భరోసా జిల్లా ప్రజలకు కొత్త ఆశలను చిగురింప చేసింది. అధికార పార్టీలో నేతల మధ్య అభిప్రాయ బేధాలు ఈ సంవత్సరం సైతం యథావిధిగానే కొనసాగినా అవి బహిర్గతం కాకుండా ఆ ప్రభావం పార్టీపై, పార్టీ శ్రేణులపై పడకుండా ఎవరికి వారే తమదైన రీతిలో రాజకీయ చతురత ప్రదర్శించారు. విపక్షాల ఎక్కు.. కాంగ్రెస్ పార్టీతోపాటు జిల్లాలో ఉన్న సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై దృష్టి సారిస్తూనే సంస్థాగతంగా బలోపేతం కావడానికి, పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరింపచేయడానికి తమదైన రీతిలో ప్రయత్నాలు కొనసాగించాయి. బీజేపీ: భారతీయ జనతా పార్టీ ఈ సంవత్సరం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర, జాతీయ నేతలను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తీసుకొచ్చి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కల్పించేందుకు ప్రయత్నం చేసింది. జనవరిలో భద్రాచలంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ గంగారాం, బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి,రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. బీజేపీ తెలంగాణ విమోచన యాత్ర జిల్లాలోని మ«ధిర నియోజకవర్గంలో కొనసాగింది. రాష్ట్ర అ«ధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగింది. టీడీపీ: తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఈ సంవత్సరం మరింత రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీకి మూలస్తంభాలుగా వ్యవహరించే ముఖ్య నేతలు అనేకమంది తమ రాజకీయ భవిష్యత్తు కోసం అధికార పార్టీవైపు అడుగులు వేయగా.. మరికొందరు ముఖ్యనేతలు అదే దారిలో నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దీంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు అలముకుంటున్నాయి. కమ్యూనిస్టులు.. సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీలు: రైతు సమస్యలపై రౌండ్‌టేబుల్ సమావేశాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయన్న భావన సాధారణ ప్రజల్లో వ్యక్తమైంది. దక్కిన పదవులు.. ఉద్యమనేతగా ఉన్న పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అశ్వారావుపేట శాసనసభ్యుడు తాటివెంకటేశ్వర్లుకు ట్రైకార్ చైర్మన్ పదవి, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుడాన్‌బేగ్‌కు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కొండబాల కోటేశ్వరరావుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఈ సంవత్సరం లభించాయి. ఇక ఎంతో కాలంగా పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులను సైతం ప్రభుత్వం భర్తీ చేసింది. జిల్లాలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవులు భర్తీ కాలేదు. దీంతో అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో ఈ పదవుల భర్తీపై ఆశలు నెలకొని ఉన్నాయి. టీఆర్ఎస్కు ఝలక్.. టీఆర్ఎస్ పార్టీలో ఈ సంవత్సరం సైతం అనేక మంది ముఖ్యులు తీర్థం పుచ్చుకోగా.. ఆ పార్టీలో ముఖ్యనేతగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు టీఆర్ఎస్ను వీడటం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. ఆయన కాంగ్రెస్‌లో చేరడానికి పార్టీని వీడారని ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకు ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోలేదు. -
30 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత
ములకలపల్లి: ఖమ్మం జిల్లా ములకలపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆహారం విషతుల్యమైంది. దీంతో 30 మందికిపైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఇక్కడి వసతి గృహంలో సుమారు 80 మంది వరకు విద్యార్థినులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం వీరికి భోజనంలో వంకాయ కూర, సాంబారు వడ్డించారు. ఇది తిన్న తర్వాత తీవ్ర దగ్గు, కడుపునొప్పితో 30 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు లోనుకాగా సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థినులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు బత్తుల అంజి, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దండి కొమరయ్య పరామర్శించారు. విద్యార్థినులను ఆస్పత్రికి తరలించడంలో సాయం అందించారు.