ఆ జిల్లాపై హరీష్‌ రావు కన్నేసి ఉంచారా? | Minister Harish Rao Focus On Khammam District Politics | Sakshi
Sakshi News home page

ఆ జిల్లాపై హరీష్‌ రావు కన్నేసి ఉంచారా?

Published Wed, Jan 25 2023 5:05 PM | Last Updated on Wed, Jan 25 2023 5:43 PM

Minister Harish Rao Focus On Khammam District Politics - Sakshi

గులాబీ బాస్ ఆశించిన విధంగానే ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఖమ్మం బీఆర్ఎస్ గందరగోళంగా తయారైంది. పలువురు సీనియర్లు పార్టీ వీడతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగ ప్రవేశం చేయడంతోనే అంతా సర్దుకుందనే టాక్ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో సైతం హరీష్ రావు ఖమ్మం జిల్లాపై ఓ కన్నేస్తారా? 

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ తెలంగాణ సరిహద్దులో ఏపీకి ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లాలో విజయవంతంగా జరిగింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపేవిధంగా ఉంటుందని, అదే సమయంలో ఖమ్మం జిల్లా పార్టీలోని అసమ్మతిని కూడా దారికి తెచ్చుకున్నట్లుగా ఉంటుందనే వ్యూహంతోనే కేసీఆర్ ఖమ్మంను ఎంపిక చేశారని తెలుస్తోంది. పార్టీ అనుకున్న సంఖ్యలో కాకపోయినా.. భారీగా తరలివచ్చిన ప్రజలు గులాబీ దళపతికి సంతోషం కలగచేశారు.

బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఢిల్లీలో గ్రాండ్‌గా నిర్వహించాలని మొదట్లో భావించారు. అయితే అనూహ్యంగా వేదిక ఖమ్మంకు మారింది. వేదిక మార్పు వెనుక కేసీఆర్ రాజకీయ సమీకరణాల వ్యూహం కూడా సక్సెస్ అయిందని చెబుతున్నారు.  ఖమ్మం జిల్లాలో అసంతృప్తితో ఉన్న కొందరు సీనియర్ బీఆర్ఎస్ నేతలు పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఖమ్మం జిల్లాపై బిజేపి కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ పూర్వరంగంలో ఖమ్మంలో ఆవిర్భావ సభ పెట్టడం ద్వారా పార్టీలోని అసంతృప్త నేతలు చేజారకుండా చూసుకోవడమే కాకుండా పార్టీని బలోపేతం చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఖమ్మం వేదికను ఎంచుకున్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది.  

అయితే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లు, జన సమీకరణ బాధ్యతను ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు ఖమ్మంలోనే మకాం వేసిన హరీష్రావు.. జన సమీకరణ ఏర్పాట్లు చూసుకున్నారు. ఖమ్మంకు వచ్చీ రావడంతోనే అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే బాధ్యతను చేపట్టారు. జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంకి వెళ్లి చర్చలు జరిపారు. తాజా రాజకీయ పరిణామాలపై తుమ్మలతో చర్చించారు.

రానున్న రోజుల్లో జిల్లాలో ఖచ్చితంగా తుమ్మలకు ప్రయారిటీ ఉంటుందన్న సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్ని ఆయనకు హరీష్ వివరించారని చెబుతున్నారు. హరీష్ రావు తో జరిపిన చర్చలు విశ్వాసం కలిగించడంతో..తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో మళ్ళీ యాక్టివ్ అయ్యారు. పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాలను మంత్రి హరీష్ రావుతో కలిసి జిల్లా అంతటా నిర్వహించారు. జన సమీకరణకు అన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక నేతలతో పాటుగా.. తన అనుచరులను కూడా పురమాయించారు. తుమ్మలతోనే కాకుండా జిల్లా అంతటా అసంతృప్తితో ఉన్న ముఖ్య నాయకులతో హరీష్రావు రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం.

కొత్తగూడెంలో గత రెండేళ్ల నుంచి అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెంలో మళ్లీ యాక్టివ్ కావాలని ఆవిర్భావ సభకు రావాలని కేసీఆర్ సూచించిన నేపద్యంలోనే జలగం వెంకట్రావు సభకు వచ్చారని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాయకులు, కేడర్ మొత్తం వర్గ విభేదాలు పక్కనపెట్టి బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రావడంతో సభ అనుకున్న స్థాయిలో సక్సెస్ అయిందన్న వాదన వినిపిస్తోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు సైతం వచ్చారు. సభ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలకు వర్గ విభేదాలను పక్కనపెట్టి వచ్చే ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ సీట్లు.. రెండు లోకసభ స్థానాలు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేశారట. జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మళ్లీ రిపీట్ కావద్దని సూచించారట. ఆవిర్భావ సభను విజయవంతం చేసినందుకు మంత్రి హరీష్ రావును సీఎం కేసీఆర్ ప్రశంసించారు. మొత్తానికి ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభతో అసంతృప్త నేతలు పార్టీ నుంచి చేజారకుండా సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ నాయకులందరూ చివరి వరకు వర్గ విభేదాలను పక్కనపెట్టి పని చేస్తారా... లేకుంటే మధ్యలో హ్యాండ్ ఇస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement