సాక్షి, ఖమ్మం: మా భూములు లాక్కుంటే చావుకూడా వెనకాడం, మా శవాలను పూడ్చి సమాధులపై నుంచి రహదారి నిర్మించండి అంటూ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బాధిత రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణకు గాను అధికార యంత్రాంగం చింతకాని మండలం బస్వాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని రైతులతో శుక్రవారం ఉదయం నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొలుత రైతులు తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించారు. దీంతో బస్వాపురానికి చెందిన దొబ్బల వెంగళరావు మాట్లాడుతూ.. తమ ప్రాంతం నుంచి గతంలో సాగర్ కాల్వను తీశారని, ఈ క్రమంలో అనేక మంది రైతులు తమ భూములు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకి సైతం అవే రైతులకు సంబంధించిన భూములు కోల్పోవాల్సి వస్తుందని, దీంతో తాము భవిష్యత్తులో ఏమి చేయాలో అర్థంకావటం లేదన్నారు. గతంలో చేసిన అలైన్‌మెంట్‌ను రాజకీయ నాయకులు వారివారి స్వార్థం కోసం మార్చారని ఆరోపించారు. రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా భూములను లాక్కునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం మరికొంతమంది రైతులు మాట్లాడి, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు.
సామరస్యంగా పరిష్కరించుకుందాం
రైతులు అధైర్యపడొద్దని అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు తమవంతుగా ప్రయత్నం చేస్తామని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్నారు. అనంతరం ఎన్‌హెచ్‌ఏఐ డిప్యూటీ మేనేజర్ జానకిరామ్ మాట్లాడారు. గతంలో 70మీటర్లు ఉన్న రహదారిని 60మీటర్లకు కుదించటం జరిగిందన్నారు. సాయంత్రం కొదుమూరు గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో ఖమ్మం ఆర్డీఓ రవీంధ్రనా«థ్, చింతకాని తహసీల్దార్ తిరుమలచారి, భూ సేకరణ విభాగం డిప్యూటీ తహసీల్దార్ రంజిత్ పాల్గొన్నారు. – మధుసూదన్, అదనపు కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment