సోమవారం ఉదయం మాట్లాడుతున్న మమత, ఆమె తల్లి
కారేపల్లి: పొలం గట్టు తగాదాపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ మహిళతో సీఐ పెడార్థం వచ్చేలా మాట్లాడారన్న ఆరోపణ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో కలకలం రేపింది. ‘నీవు మంచిగనే ఉన్నావ్ కదా! నువ్వు నాకు నచ్చినవ్!!’అంటూ సీఐ అనుచితంగా మాట్లాడాడని బాధితురాలు ఆరోపించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయాన్ని పాత్రికేయులకు వెల్లడించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ మహిళ వారికి ఫోన్ చేసి ‘సమస్య పరిష్కారానికి అధికారులు హామీ ఇచ్చారు. నేను చెప్పినవేవీ పేపర్లలో రాయకండి’అని కోరడం గమనార్హం. బాధితురాలి కథనం ప్రకారం... కారేపల్లి మండలం రేలకాయలపల్లి గ్రామానికి చెందిన భూక్యా కాంతమ్మ, భూక్యా మమత తల్లీకుమార్తెలు. పెళ్లయిన మమత భర్తతో గొడవ కారణంగా తల్లి ఇంట్లోనే ఉంటోంది.
మమత బాబాయి భూక్యా లక్ష్మణ్ ఇటీవల తమ చేను గట్టు ఆక్రమించి దున్నుతుండగా ప్రశ్నించడంతో కొట్టాడని మమత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ లక్ష్మణ్ మరోసారి పత్తి చేను గట్టు దాటి వచ్చి అర ఎకరం వరకు ఆక్రమించి దున్నుతుండగా శనివారం రాత్రి 7 గంటలకు కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మమత వెళ్లింది. అప్పుడే సీఐ అనుచితంగా మాట్లాడినట్లు మమత సోమవారం విలేకరులకు వెల్లడించింది. అంతేకాకుండా రాత్రి 11.30 వరకు ఒక్కదాన్నే పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టారని, పెద్దవాళ్లతో గొడవలు ఎందుకు అని చెప్పారని ఆరోపించింది. అయితే సోమవారం సాయంత్రం మాత్రం ఈ విషయాలేవీ పత్రికల్లో రాయొద్దని కోరింది. ‘అనుకోకుండా జరిగింది. ఏదీ మనసులో పెట్టుకోకు. నీ సమస్య మొత్తం పరిష్కరిస్తాం. మీ బాబాయ్‌ను పిలిపించి నీ భూమి హద్దులు పెట్టిస్తాం’అని పోలీసులు చెప్పారని తెలిపింది. మమత ఆరోపణలపై కారేపల్లి సీఐ బి. శ్రీనివాసులును వివరణ కోరగా మమత ఫిర్యాదు పత్రం ఇష్టారీతిన ఉండడంతో మార్చి రాయాలని దబాయించిన మాట వాస్తవమేనని, కానీ అనుచితంగా మాట్లాడలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment