సమ్మె గడువు ముగిసినా స్పందించని ప్రభుత్వం
నిరవధిక సమ్మెను ప్రకటించిన అంగన్‌వాడీలు
ఇబ్బందుల్లో గర్భిణులు, బాలింతలు..
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీలు నెల రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. ముఖ్యంగా ఫిబ్రవరి 17 వ తేదీ నుంచి 22 వరకు అంగన్‌వాడీ కేంద్రాలను మూసి వేసి నిరసన తెలుపుతున్నా అధికారులు మాత్రం స్పందించలేదు. ముందే ప్రకటించిన ప్రకారం సమ్మె ముగిసినా అధికారులు స్పందించకపోవడంతో అంగన్‌వాడీ మరింత ఉధృతంగా ఆందోళన చేసేందుకు నిర్ణయించారు. మళ్లీ నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే నెల రోజులుగా సరైన సేవలు అందక ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, బాలింతలు మరిన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.
అంగన్‌వాడీల డిమాండ్లు ఇవే...
- పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ. 10వేలు చెల్లించాలని, ఐసీడీస్‌లో ఐకేపీ జోక్యాన్ని నివారించాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఇంకా వివిధ రకాలైన 11 డిమాండ్లతో సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు నెల రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. ఖమ్మంజిల్లాలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తొలుత కలెక్టరేట్ ఎదుట, మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించి నిరసన తెలిపారు.తర్వాత కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్‌లో నిరవధిక దీక్షలు చేపట్టారు. భారీగా అంగన్‌వాడీ కార్యకర్తలను సమీకరించి కలెక్టరేట్‌ను ముట్టడించారు. సుమారు 1000 మందికిపైగా అంగన్‌వాడీలు ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో అదికాస్తా ఉద్రిక్తంగా మారింది. దీంతో అధికారుల్లో చలనం వస్తుందని భావించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చివరి ప్రయత్నంగా ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోవడంతో దానిని నిరవధిక సమ్మెగా మార్చి తమ ఆందోళనను కొనసాగిస్తున్నట్లు యూనియన్ నేతలు ప్రకటించారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో
నిలిచిన సేవలు...
ఇదిలా ఉండగా జిల్లాలో 23 ప్రాజెక్టులకు సంబంధించిన సిబ్బంది మండల కేంద్రాల్లో ఎక్కడిక్కడే శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఆరు రోజులుగా సమ్మె చేశారు. దీంతో జిల్లాలోని 4,888 అంగన్‌వాడీల సెంటర్లు మూతపడ్డాయి. మొత్తం అంగన్‌వాడీ సెంటర్లలో పని చేస్తున్న సుమారు 10 వేల మంది సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో ఆయా కేంద్రాల్లో 1,79,159 మంది చిన్నారులు, 57,773 మంది బాలింతలు, గర్భిణులకు సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎలాగైనా గర్భిణులకు, బాలింతలకు సేవలు అందిస్తామని చెప్పిన ఐసీడీఎస్ అధికారులు ఆ మాటను మాత్రం అమలు చేయలేదు. ఇప్పటికే వైద్యసేవలు, పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్న బాలింతలు, గర్భిణులు ఈ సమ్మె కారణంగా మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరో పక్క ప్రభుత్వ కార్యకలాపాలు కూడా కొన్ని వారి చేతుల్లో ఉండడంతో పథకాల నిర్వహణకు ఆటంకం కలుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
సమస్యల పరిష్కారం మా పరిధిలో లేవు
ప్రస్తుతం అంగన్‌వాడీల డిమాండ్లు ఏవీ ఐసీడీఎస్ పరిధిలో కానీ, కలెక్టర్ పరిధిలో కానీ లేవు. వాటన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలి. కొన్నిచోట్ల ఐకేపీ సిబ్బంది సహకారం తీసుకుని అంగన్‌వాడీల సెంటర్లను తెరిపించి నడిపిస్తున్నాం. వారి సమ్మెకు ప్రభుత్వం వీలైనంత త్వరగా స్పందించాలని ఉన్నతాధికారుల తరుపున లేఖలు రాస్తాం.
-ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు
ఒక్క మెట్టూ దిగలే..!
Published Sun, Feb 23 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM
Advertisement
Advertisement