
సాక్షి, విజయవాడ: దుర్గ గుడిలో తాంత్రిక పూజల వ్యవహారంపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. అనధికార వ్యక్తులు గుడిలో ప్రవేశించినట్టు నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. పర్యవేక్షణ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్వవహరించారని, ఈ ఘటనపై లోతుగా విచారణ జరుగుతోందని చెప్పారు. జరిగిన తప్పిదానికి ఈవో బదిలీ చేశామన్నారు. విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు.
ఈవోపై వేటు!
మరోవైపు దుర్గగుడి తాంత్రిక పూజల వివాదంలో ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేశారు. దుర్గమ్మ గుడిలో అపచారం జరిగినమాట నిజమేనని ..ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు తెలిపారు. తాంత్రిక పూజల వ్యవహారంలో నిజనిర్ధారణ కమిటీతో పాటు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన వెనక ఉన్నది ఈవో సూర్యకుమారి అంటూ...ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో వెంటనే సూర్యకుమారిని బదిలీ చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఇన్‌చార్జ్ ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్‌గా అనురాధకు బాధ్యతలు అప్పగించారు.
పెద్దలు ఎవరో తేలాల్సి ఉంది!
విజయవాడ దుర్గగుడిలో తాంత్రికపూజలు జరిగాయని రుజువైంది కాబట్టి...ఈ పూజలు చేయించిన పెద్దలు ఎవరో తేలాల్సి ఉందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానదేంద్రస్వామి అన్నారు. అనంతపురంలోని రాంనగర్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో ఆయన పాల్గొన్నారు. అసలైన దోషులను వదిలి అర్చకులను వేధించటం సరికాదని... ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాంత్రిక పూజలు జరిగాయో బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తాంత్రికపూజలపై దిద్దబాటు జరక్కపోతే రాష్ట్రానికే అరిష్టమని స్వరూపానదేంద్రస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment