కర్నూలు (ఓల్డ్‌సిటీ): నగరంలో శనివారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఆటోమొబైల్ షాపు పూర్తిగా దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.. బాలాజీనగర్‌కు చెందిన అన్నదమ్ములు ఫయాజ్, రియాజ్ పొట్టిశ్రీరాములు పార్కు ఎదురుగా ఉండే దావూద్ కాంప్లెక్స్‌లోని రెండు గదుల్లో ఎఫ్.ఆర్.ఆటోమొబైల్స్ షాపు నిర్వహిస్తున్నారు. ఇందులో టూవీలర్స్ విడిభాగాలతో పాటు ఆయిల్స్ విక్రయించేవారు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి 9.30 గంటలకు షాపును మూసేశారు. శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో షాపులో నుంచి మంటలు రావడం చూసి స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. జిల్లా అగ్నిమాపక అధికారి భూపాల్‌రెడ్డి, సహాయ అధికారి జయన్న సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలుఆర్పివేశారు. అయితే అప్పటికే షాపులోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రతిరోజు షాపు బంద్ చేయడానికి ముందు తాము మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటామని, ప్రమాదానికి షార్ట్ సర్యూట్ కారణం కానే కాదని, ఎవరో కావాలనే నిప్పు పెట్టినట్లు బాధితుడు ఫయాజ్ అనుమానం వ్యక్తంచేశారు. ప్రమాదంలో రూ.50 లక్షల దాకా నష్టం వాటిల్లింటుందని ఆయన పేర్కొన్నాడు.
బాధితులకు హఫీజ్ ఖాన్ పరామర్శ
వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఘటన స్థలికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితుడిని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment