కర్నూల్ : జన్మభూమి ఒక ప్లాప్ షో అని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. కర్నూలు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనకు జన్మభూమిలో వస్తున్న లక్షలాది దరఖాస్తులే నిదర్శనమన్నారు. నాలుగువిడతల్లో వచ్చిన ప్రజాసమస్యలలో పరిష్కార జరిగింది 10శాతం మాత్రమేనన్నారు. నాలుగు దశల్లో కూడా ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోవడం ఈ టీడీపీ ప్రభుత్వ వైఫల్యమేనని పేర్కొన్నారు. తమ నాయకుడు చేస్తోన్న సంకల్ప యాత్ర నుంచి ప్రజలను దారి మళ్లించేందుకే ఈ జన్మభూమి నాటకం ఆడుతున్నాడని ఆరోపించారు.
జన్మభూమి కార్యక్రమం అంటే టీడీపీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నియోజకవర్గాల్లో పర్యటించడానికి అధికారపార్టీ ఎమ్మెల్యేలు హడలిపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సైతం గ్రామాల్లో వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం గత నాలుగు విడతల్లో జిల్లా వ్యాప్తంగా అందిన అర్జీలు 6,18,839 అని, పరిష్కారం అయినట్టు చెబుతున్నవి 1,90,953 అని, పరిశీలన చేసినా పరిష్కారం కానీ దరఖాస్తులు 2,99,075 అని చెప్పారు. గత నాలుగు విడతల్లో జిల్లాలో మూడు లక్షల ప్రజా సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదో ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో ముఖ్యమంత్రి చేసిన ఐదు సంతకాలకే దిక్కులేదు కానీ...నూతన సంవత్సరం రోజున తొలి సంతకం అంటూ గృహానిర్మాణానికి సంబంధించిన ఫైల్ పై సంతకం అంటూ చంద్ర బాబు కొత్త డ్రామా ఆడుతున్నాడని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కట్టని బాబు రానున్న సంవత్సరంలో ఏంచేస్తాడో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడం, లేకపోతే బెదిరించడం టీడీపీ నైజంగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు తీరాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment