janma bhoomi - maa oru
-
స‘పోర్టు’ పేరిట దగా...
సాక్షి, శ్రీకాకుళం : సువిశాల భావనపాడు తీరంలో చేపల వేట సాగిస్తూ ప్రశాంత జీవితం గడుపుతున్న మత్స్యకారులు, పుడమితల్లినే నమ్ముకుని బతుకుతున్న రైతుల్లో పోర్టు పేరుతో టీడీపీ ప్రభుత్వం వారి జీవితాలను అల్లకల్లోలం చేసింది. మంత్రి అచ్చెన్నాయుడు నాడు ఒక్క ఇటుక కూడా కదలదని చెప్పి తరువాత జరిగిన ‘జన్మభూమి మాఊరు’ కార్యక్రమంలో గ్రామాన్నే ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పడంతో మంత్రి ద్వంద్వ వైఖరిపై మత్స్యకారులు, రైతులు మండిపడుతున్నారు. భావనపాడు పోర్టు నిర్మాణానికి 2015వ సంవత్సరంలో సుమారు 4800 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా మండలంలోని భావనపాడు, మర్రిపాడు పంచాయతీలు, వజ్రపుకొత్తూరు మండలంలోని దేవునల్తాడ, కొత్తపేట, సైనూరు పంచాయతీల్లో భూములు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీనిపై అప్పట్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడంతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొంతమంది మత్స్యకారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం కొంతకాలం మౌనంగా ఉండి చాప కింద నీరులా నయానో భయానో సొంత పార్టీ నేతలకు పరిహారం ఆశ చూపి తమకు అనుకూలంగా మలుచుకుంది. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి నాలుగేళ్లు కావస్తుండడంతో ఈ ప్రాంత రైతులు వారి భూములపై హక్కులు కోల్పోయారు. భూములపై క్రయవిక్రయాలు చేసుకునేందుకు వారికి అవకాశం లేకుండా పోయింది. దీని వల్ల ఇళ్లలో శుభకార్యాలు, విద్య, ఉద్యోగావసరాల కోసం భూములను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ‘జన్మభూమి మాఊరు’ కార్యక్రమంలో ఎకరాకు రూ.12 లక్షల 50 వేలు మాత్రమే ప్రభుత్వం పరిహారం ఇస్తుందని అప్పటి ఆర్డీవో వెంకటేశ్వరరావు మంత్రి అచ్చెన్నాయుడు సాక్షిగా చెప్పడంతో రైతుల్లో ఆందోళన తీవ్రమైంది. బయట మార్కెట్లో ఎకరా భూమి ధర రూ.20లక్షల నుంచి రూ.25 లక్షలు పలుకుతుంటే ఇలాగేనా పరిహారం చెల్లింపు అంటూ సభలో రైతులు నిరసన తెలియజేశారు. యువతకు ప్యాకేజీ అంటూ మభ్యపెట్టి కాలయాపన చేసి మాయచేశారు. ఒకప్పుడు ఒక్క ఇటుక కూడా గ్రామం నుంచి కదలనీయబోనని చెప్పి ఆ తర్వాత గ్రామాన్నే ఖాళీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడంతో మత్స్యకారులు, రైతుల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఇటీవల కొత్త భూసేకరణ నోటిఫికేషన్ సుమారు 18 ఎకరాలకు ఇచ్చినా రైతులకు భూమిపై హక్కులేకుండా పోయింది. ఇలా రైతులు, మత్స్యకారులను పోర్టుపేరుతో దగా చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడుకు బుద్ధి చెప్పేందుకు ఆ ప్రాంతీయులు సిద్ధంగా ఉన్నారు. జీవో రద్దు చేయాలి ప్రభుత్వం విడుదల చేసిన పోర్టు భూసేకరణకు సంబంధించిన జీవోను రద్దు చేయాలి. నాలుగేళ్లుగా రైతులు భూములపై హక్కులు కోల్పోయి అవసరాలకు అమ్ముకోలేక ఇబ్బందులు పడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు ఒక్క ఇటుక కూడా కదలనీయనని చెప్పి ఇప్పుడేమో గ్రామాన్నే ఖాళీ చేయాలని అంటున్నారు. ఇదేనా రాజకీయం. –బి.మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్, భావనపాడు -
‘దారి’చూపని ముఖ్యమంత్రి
సాక్షి,రాజాంపేట: రాజాం ప్రధాన రహదారిని విస్తరిస్తాం. రాజాం పట్టణంలోని చెరువులను పార్కులుగా మారుస్తాం. హైటెక్ సిటీ, శాటిలైట్ సిటీ నిర్మాణం చేపడతాం. తోటపల్లి మిగులు భూములకు నీరు అందిస్తాం.’ అని 2017వ సంవత్సరం జనవరి 6న రాజాంలో నిర్వహించిన ‘జన్మభూమి మా ఊరు’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలివి. అప్పట్లో రాజాం బస్టాండ్ ఆవరణలో జరిగిన ‘జన్మభూమి మా ఊరు’ కార్యక్రమంలో సీఎం ఈ హామీలు ఇవ్వగా రెండేళ్లు దాటినా ఇప్పటికీ అవి పూర్తికాలేదు. రాజాం ప్రధాన రహదారి ఇరుగ్గా ఉండడంతో విస్తరిస్తామని 2017లో సీఎం హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణకు రూ.56 కోట్లు మేర నిధులు కావాల్సి ఉండగా ఇప్పటి వరకూ రూ.10 కోట్లు మేర మాత్రమే వచ్చాయి. ఏడాది కాలంగా అంబేడ్కర్ జంక్షన్ నుంచి బొబ్బిలి జంక్షన్ వరకూ రోడ్డు విస్తరణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకూ ఆ పనులు కొలిక్కి రాలేదు. ఇలాంటి హామీలు ఇచ్చిన బాబును ఎందుకు నమ్మాలి? అని రాజాం పట్టణ ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. -
2050కి నంబర్‌వన్ రాష్ట్రంగా ఏపీ: సీఎం
సాక్షి, రాజమహేంద్రవరం: మూడు విజన్లతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. 2022 నాటికి దేశంలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో, 2050 నాటికి ప్రపంచంలో నంబర్‌వన్ రాష్ట్రంగా నిలిపేందుకు విజన్‌తో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కన్నా రాష్ట్ర అభివృద్ధి 5.57 శాతం అధికంగా ఉందని చెప్పారు. వ్యవసాయంలో బాగా అభివృద్ధి సాధించామన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లిలో నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. త్వరలో రెండు లక్షల మందికి కార్పొరేషన్ల ద్వారా రుణాల్ని ఎంపీడీవో కార్యాలయానికి పిలిపించి ఇస్తామన్నారు. రానూపోనూ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. -
జన్మభూమి సభలో ఏపీ మంత్రికి షాక్
-
నేడు రాష్ట్రవ్యాప్తంగా 5కే రన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారో లేదో పరుగెత్తి పరీక్షించుకోవాలని, అందుకోసం జన్మభూమిలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో 5కే రన్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. దీనిలో అందరూ పాల్గొని పరుగెత్తాలని సూచించారు. 5 కిలోమీటర్లు సునాయాసంగా పరుగెత్తితే ఆరోగ్య సమస్యలు లేనట్లని, పరుగు తీయకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు భావించాలని తెలిపారు. దీనిలో జర్నలిస్టులు ఏమీ మినహాయింపు కాదన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోడూరుపాడు గ్రామంలో శనివారం జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... గడిచిన మూడున్నరేళ్లలో అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని శ్మశానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు. దుర్గ గుడి ఈవోపై బదిలీ వేటు విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో) సూర్యకుమారిపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇన్చార్జి ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధను నియమిస్తున్నట్లు పేర్కొంది. డిసెంబరు 26వ తేదీన గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, ఆ శాఖ కమిషనర్ అనూరాధ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రఘునాథ్ నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ గుర్తించిన అంశాలతో ముఖ్యమంత్రికి నివేదికను అందజేశారు. దుర్గ గుడిలో తాంత్రిక పూçజల వ్యవహారంపై చర్చించారు. అనంతరం మంత్రి మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. ఈవోను తప్పించి, తాంత్రిక పూజల ఆరోపణలపై విచారణ కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. పరిపాలన పరమైన లోపాల కారణంగానే ఈవో తప్పించామని. తాంత్రిక పూజలు జరగలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. -
మార్వాడీలకు పరిశుభ్రతంటే తెలియదు
నంద్యాల అర్బన్: ‘మార్వాడీలకు పరిశుభ్రతంటే తెలియదు. ఇళ్లలోని చెత్తా చెదారాన్ని మురుగు కాలువల్లో వేస్తూ అపరిశుభ్రతకు కారణమవుతున్నారు’ అని శాసనమండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్ వ్యాఖ్యానించారు. కాలువలు చెత్తతో నిండి మురుగునీరు రోడ్లపైకి వస్తోందని, ఇందుకు కారణమైన మార్వాడీలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని 9వ వార్డులో జరిగిన ‘జన్మభూమి–మాఊరు’ కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. పరిశుభ్రతకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు కొందరు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు.బైర్మల్ వీధిలోని తన ఇంటి పరిసరాల్లో ఉంటున్న మార్వాడీలు చెత్తంతా మురుగు కాలువల్లో వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన మార్వాడీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
జన్మభూమి ఒక ప్లాప్ షో : వైఎస్సార్సీపీ
కర్నూల్ : జన్మభూమి ఒక ప్లాప్ షో అని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. కర్నూలు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనకు జన్మభూమిలో వస్తున్న లక్షలాది దరఖాస్తులే నిదర్శనమన్నారు. నాలుగువిడతల్లో వచ్చిన ప్రజాసమస్యలలో పరిష్కార జరిగింది 10శాతం మాత్రమేనన్నారు. నాలుగు దశల్లో కూడా ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోవడం ఈ టీడీపీ ప్రభుత్వ వైఫల్యమేనని పేర్కొన్నారు. తమ నాయకుడు చేస్తోన్న సంకల్ప యాత్ర నుంచి ప్రజలను దారి మళ్లించేందుకే ఈ జన్మభూమి నాటకం ఆడుతున్నాడని ఆరోపించారు. జన్మభూమి కార్యక్రమం అంటే టీడీపీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నియోజకవర్గాల్లో పర్యటించడానికి అధికారపార్టీ ఎమ్మెల్యేలు హడలిపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సైతం గ్రామాల్లో వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం గత నాలుగు విడతల్లో జిల్లా వ్యాప్తంగా అందిన అర్జీలు 6,18,839 అని, పరిష్కారం అయినట్టు చెబుతున్నవి 1,90,953 అని, పరిశీలన చేసినా పరిష్కారం కానీ దరఖాస్తులు 2,99,075 అని చెప్పారు. గత నాలుగు విడతల్లో జిల్లాలో మూడు లక్షల ప్రజా సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదో ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి చేసిన ఐదు సంతకాలకే దిక్కులేదు కానీ...నూతన సంవత్సరం రోజున తొలి సంతకం అంటూ గృహానిర్మాణానికి సంబంధించిన ఫైల్ పై సంతకం అంటూ చంద్ర బాబు కొత్త డ్రామా ఆడుతున్నాడని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కట్టని బాబు రానున్న సంవత్సరంలో ఏంచేస్తాడో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడం, లేకపోతే బెదిరించడం టీడీపీ నైజంగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు తీరాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. -
సమస్యలు పరిష్కరించకుండా పండగ చేసుకోమంటే ఎలా..?
విజయవాడ : ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఒక్క శాతం కూడా పరిష్కరించకుండా ఇప్పుడు చేపడుతోన్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం పండగ ఎలా అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ ఎన్ రఘవీరా రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటన సారాంశం..జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుపై రఘవీరారెడ్డి స్పందిస్తూ..ఈ కార్యక్రమంలోనైనా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలని సూచించారు. అనంతపురం జిల్లాలో మడకశిర, కల్యాణదుర్గం, పెనుగొండ నియోజకవర్గంలో వందలాది గ్రామాలలో పర్యటించినపుడు ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన్నట్లు గుర్తు చేశారు. మడకశిర నియోజకవర్గంలో 61 వేల మంది, కల్యాణదుర్గం నియోజకవర్గంలో 49 వేల మంది, పెనుగొండలో 45 వేల మంది ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఇచ్చారన్నారు. ఈ అర్జీలను స్థానిక రెవెన్యూ అధికారికి, కలెక్టర్‌కు తానే స్వయంగా అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో పింఛన్లు నిలిపేశారని, మరుగుదొడ్ల బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
తిరగబడ్డ జనం ...
► గతంలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదు ► ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? ► జన్మభూమిలో అధికారులను అడ్డుకున్న ప్రజలు మూడో విడత ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం రసాభాసగా సాగింది. పలు చోట్ల అధికారులపై జనం తిరగబడ్డారు. ‘‘గతంలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదు..ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని వచ్చారు’’ అంటూ నిలదీశారు. పలుచోట్ల అధికార పార్టీ నేతలకూ చుక్కెదురైంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో శనివారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు గ్రామ సభల్లో అధికారులను జనం నిలదీశారు. శ్రీకాళహస్తి నియోజక వర్గంలో అధికార పార్టీనేతలకే చుక్కెదురైంది. పలమనేరులో టీడీపీ నేతలకు సూచించిన వారికే రేషన్ కార్డులు ఇస్తున్నారంటూ మహిళలు అధికారులను నిలదీశారు. పీలేరు నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్యనే ఘర్షణ చోటుచేసుకుంది. నగరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జన్మభూమి కమిటీ సభ్యుడే అధికారులను నిలదీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాసారంలో శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్ గురవయ్యనాయుడును స్థానికులను అడ్డుకున్నారు. పట్టణంలోని రెండో వార్డులో టీడీపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ పేటరాధారెడ్డిపై స్థానికులు తిరగబడ్డారు. పలమనేరు నియోజకవర్గం వికోట మండలంలోని క్రిష్ణాపురంలో రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఎన్.అమరనాధరెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పాల్గొన్నారు. పలమనేరు పట్టణంలోని ఒకటో వార్డులో వేదికపై జన్మభూమి కమిటీ సభ్యులను కూర్చొపెట్టడంతో వివాదం జరిగింది. ఈవిషయంపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. టీడీపీ కార్యకర్తలు చెప్పినవారికే రేషన్‌కార్డులు ఇచ్చారంటూ మహిళలు అధికారులను అడ్డుకున్నారు. సత్యవేడు నియోజకవర్గం టీపీ కోటలో అధికారులను జనం అడ్డుకున్నారు. గతంలో ఇచ్చిన అర్జీలకు రేషన్‌కార్డులు, ఇళ్లు ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. పుంగనూరు మున్సిపాలిటీ 24వ వార్డులో వైస్‌చైర్మన్ అమరేంద్ర, కౌన్సిలర్ ఇబ్రహీం, పింఛన్లు, రుణాలు మంజూరు కాలేదని టీడీపీ పట్టణాధ్యక్షుడు ఖలీల్‌తో వాగ్వాదానికి దిగారు. కమిషనర్ కేఎల్వర్మ జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.తిరుపతి పెద్దకాపువీధిలో జన్మభూమి వేదికపై ఉన్న ఎమ్మెల్యే సుగుణమ్మ, మున్సిపల్ అధికారులకు స్థానిక మహిళలు సమస్యలతో స్వాగతం పలికారు. చిత్తూరు మండలంలో కుర్చివేడులో అధికారులను గ్రామంలోకి రానీవ్వకుండా 3 గంటల పాటు జనం అడ్డుకున్నారు. చివరకు సర్పంచ్ జోక్యంతో శాంతించారు. తంబళ్ళపల్లె నియోజకవర్గం కురబలకోట తెట్టు గ్రామంలో అంత్యోదయకార్డులు రద్దుచేశారని అధికారులపై జనం తిరగబడ్డారు. ఆర్ఎన్ తాండాలో రుణమాఫీ, పంట నష్టపరిహారం, మరుగుదొడ్ల బిల్లుల కోసం అధికారులను నిలదీశారు. నగరి నియోజకవర్గం విజయపురం మండల కేంద్రంలో అధికార పార్టీ కార్యకర్తలకు ఫించన్లు మంజూరు చేయడంపై వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు సరస్వతి ఎంపీడీవో దశరధరామయ్యను నిలదీశారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని సొన్నేగానిపల్లె, ఎంకే పురంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో స్థానిక టీడీపీ, వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గుడుపల్లె మండలం బెగ్గిలిపల్లెలో నిర్వహించిన సభలో టీడీపీకి చెందిన వూజీ ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణ సవువేశంలో అధికారులను నిలదీశారు. ‘‘ఇప్పటికి రెండు జన్మభూముల్లో అర్జీలు ఇచ్చాం.. ఎక్కడ పరిష్కారం చూపారో నిరూపించండి’’ అని ప్రశ్నించారు. కేవీపల్లె మండలం జిల్లేళ్ల మందలో వైఎస్ఆర్సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు గుండ్లూరు జయరామచంద్రయ్య చేతి నుంచి టీడీపీ నాయకులు మైక్‌ను బలవంతంగా లాక్కున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం నాగవాండ్లపల్లెలో నిర్వహిం చిన సభలో జిల్లా కలెక్టర్ సిదార్థజైన్ పాల్గొన్నారు. గతంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో అర్జీలు ఇచ్చినా ఇంతవరకు మంజూరు కాలేదని ప్రజలు కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. వెంటనే స్పందించాలని అధికారులకు సూచించారు. మొదటి రోజు 219 ప్రాంతాల్లో జన్మభూమి చిత్తూరు (గిరింపేట): జిల్లాలోని 219 ప్రాంతాల్లో శనివారం ప్రారంభమైన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహించామని జిల్లా కలెక్టర్ సిద్థార్థ్‌జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న 189 గ్రామ పంచాయతీలు, 30 వార్డుల్లో సభలు నిర్వహించి ప్రజలకు పలు రకాల సంక్షేమ పథకాలు అందజేసి వారి సమస్యలను వినతిపత్రాల రూపంలో స్వీకరిస్తామని తెలిపారు.